Data centers: డేటా కేంద్రాలతో రియల్‌కు ఊతం

డేటా కేంద్రాలు స్థిరాస్తి రంగంలో డిమాండ్‌ను పెంచబోతున్నాయా? డిజిటల్‌ యుగంలో డేటా కేంద్రాల అవసరం పెరుగుతోంది.

Published : 15 Apr 2023 00:37 IST

రెండేళ్లలో 9.1 మిలియన్‌ చదరపు అడుగుల నిర్మాణాలు
2023-25పై జేఎల్‌ఎల్‌ అంచనా
ఈనాడు, హైదరాబాద్‌

డేటా కేంద్రాలు స్థిరాస్తి రంగంలో డిమాండ్‌ను పెంచబోతున్నాయా? డిజిటల్‌ యుగంలో డేటా కేంద్రాల అవసరం పెరుగుతోంది. ఇప్పటికే వీటిని నిర్వహిస్తున్న సంస్థలు సామర్థ్యాన్ని పెంచడంతో పాటూ కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. ఇవన్నీ రియాల్టీ రంగంలో 2023 నుంచి 2025 వరకు డిమాండ్‌ను పెంచేవే అని అంచనా వేస్తోంది జేఎల్‌ఎల్‌ సంస్థ.

దేశంలో డేటా కేంద్రాల సామర్థ్యం 2019లో 350 మెగావాట్లు ఉండగా.. 2022 నాటికి 722 మెగావాట్లకు పెరిగింది. మూడేళ్లలో సామర్థ్యం రెట్టింపైంది. డేటా కేంద్రాలకు ముంబయి కేంద్రంగా ఉంది. క్రమంగా ఇతర నగరాలకు విస్తరిస్తున్నాయి. హైదరాబాద్‌లో అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ డేటా కేంద్రాల ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. చందన్‌వెళ్లి, ఫ్యాబ్‌సిటీ, ఫార్మాసిటీ ప్రాంతంలో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. మన దగ్గరే కాదు ఇతర నగరాల్లోనూ వీటి ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాబోయే సంవత్సరంలో అదనంగా 678 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా కేంద్రాలను నెలకొల్పబోతున్నారు. దీంతో వీటి సామర్థ్యం 2025 నాటికి 1500 మెగావాట్లకు చేరుతుంది. ఫలితంగా రియాల్టీ రంగంలో 9.1 మిలియన్‌ చదరపు అడుగుల నిర్మాణాలకు డిమాండ్‌ ఉంటుందని జేఎల్‌ఎల్‌ అంచనా. 4.8 బిలియన్‌ యూఎస్‌ డాలర్లను వీటిలో పెట్టుబడులు పెట్టబోతున్నట్లు వెల్లడించింది.

ఆరు నెలల్లో...

డేటా కేంద్రాలకు సంబంధించి 2022 ద్వితీయార్థం నివేదిక ప్రకారం 71.8 మెగావాట్ల డేటా కేంద్రాల సామర్థ్యం పెరిగింది. ఆర్థిక సంవత్సరంలో 171 మెగావాట్లు వచ్చింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 31 శాతం వృద్ధిని నమోదు చేసింది.  హైదరాబాద్‌ లాంటి నగరంలో డేటా కేంద్రాల ఆధారంగా కూడా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం నడుస్తోంది. డేటాకేంద్రాలు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో ప్రభుత్వం మౌలిక వసతులు కల్పిస్తోంది. విశాలమైన రహదారులు, విద్యుత్తు, ఇతరత్రా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తోంది. సహజంగానే ఆ ప్రాంత అభివృద్ధికి ఇవన్నీ దోహదం చేస్తున్నాయి. పైగా సిటీకి 30 నుంచి 40 కి.మీ. దూరంలో, ప్రాంతీయ వలయ రహదారికి చేరువలో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం నగరంలో పెట్టుబడి దృష్ట్యా కొనుగోలుదారులు సైతం ఈ ప్రాంతాల వైపు చూస్తున్నారు.  ఉపాధి అవకాశాలు పెరగడంతో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇవన్నీ ప్రతక్ష్యంగా, పరోక్షంగా రియల్‌ కదలికకు దోహదం చేస్తున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని