home decoration: ఇంటికి తెరచాటు అందాలు

కొత్త ఇంటి నిర్మాణం పూర్తైంది.. ఇంటీరియర్‌ చివరిదశలో ఉంది.. ఇక్కడితో ఇంటి అలంకరణ పూర్తయినట్టేనా? అంటే లేదనే అంటున్నారు డిజైనర్లు.

Published : 15 Apr 2023 00:35 IST

గృహాలంకరణలో ఫర్నిషింగ్స్‌కు పెరిగిన ప్రాధాన్యం
ఈనాడు, హైదరాబాద్‌

కొత్త ఇంటి నిర్మాణం పూర్తైంది.. ఇంటీరియర్‌ చివరిదశలో ఉంది.. ఇక్కడితో ఇంటి అలంకరణ పూర్తయినట్టేనా? అంటే లేదనే అంటున్నారు డిజైనర్లు. ఫర్నిషింగ్స్‌ లేకుండా ఇంటి అలంకరణ సంపూర్ణం కాదంటున్నారు. ఇప్పుడు ఫర్నిషింగ్స్‌ కోసం గృహస్తులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కొత్త ఇంటి కోసం భారీగా ఖర్చు చేస్తుండగా.. పాత ఇళ్లలోనూ ఎప్పటికప్పుడు మార్పులతో ఇంటికి కొత్త లుక్‌ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

గృహాలంకరణలో ప్రధానమైన వాటిలో కర్టెన్లు ఒకటి. వీటితోనే ఇంటి అందం ముడిపడి ఉంటుంది. అందుకే ఈ బాధ్యతను కొందరు ఇంటి యజమానులు డిజైనర్లకు అప్పగిస్తుంటే.. మరికొందరు తమ అభిరుచులకు తగ్గట్టుగా సొంతంగా తీర్చిదిద్దుకుంటున్నారు. సినీ తారలు, వ్యాపార ప్రముఖుల ఇళ్లకు తీసిపోని విధంగా అలంకరించుకుంటున్నారు. కొందరైతే విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఫ్యాబ్రిక్‌తో ఇంటికి కర్టెన్లు కుట్టిస్తున్నారు.

ఎక్కువగా...

కర్టెన్లు అనగానే ఎక్కువగా పాలిస్టర్‌, కాటన్‌వే కనిపిస్తుంటాయి. వీటితో పాటూ లెనిన్‌, సింథటిక్‌, శాటిన్‌, వెల్‌వెట్‌ వస్త్రాలతో కుట్టినవి మార్కెట్లో లభిస్తున్నాయి. తమ బడ్జెట్‌కు అనుగుణంగా వీటిని ఎంపిక చేసుకుంటున్నారు. చౌకలో పాలిస్టర్‌ లభిస్తే.. ఆ తర్వాత కాటన్‌ దొరుకుతోంది. లెనిన్‌ వస్త్రాలు ఒకింత ఖరీదు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ మంది రెడీమెడ్‌గా దొరికే వాటిని కొనుగోలు చేస్తుంటే.. తమ ఇంట్లో ఫర్నిచర్‌, గోడలకు నప్పే రంగుల్లో కస్టమైజ్‌ చేయించుకుంటున్నారు.

పోకడలను గమనిస్తే..

ఇంట్లో సాధారణంగా ఉపయోగించే కర్టెన్లు పగటిపూట వేస్తే చీకటి అవుతుంది. మూయకపోతే ఎండ వేడి నేరుగా ఇంట్లో పడుతుంది. అందుకే ఇంటీరియర్‌ డిజైనర్లు రెండు రకాల కర్టెన్లను డిజైన్‌ చేస్తారు. తొలుత షెడెడ్‌ కర్టెన్‌ ఉంటుంది. ఆ తర్వాత మరో కర్టెన్‌ వస్తుంది.

* షెడెడ్‌ కర్టెన్లకు సాధారణంగా పాలిస్టర్‌, కాటన్‌ ఉపయోగిస్తుంటారు. వీటిలో ప్రస్తుతం ఎన్నో రకాల డిజైన్లు అందుబాటులో ఉన్నాయి. ప్యానెల్‌ కర్టెన్‌ డిజైన్స్‌ ఇప్పుడు ట్రెండీనే.

* కర్టెన్‌ పైభాగంలో లేత రంగు, ప్లెయిన్‌గా ఉంటూ.. కిందికి వచ్చేసరికి క్రమంగా ముదురు రంగు, డిజైన్లలో ఉండే ఓంబ్రె డిజైన్ల ట్రెండ్‌ ప్రస్తుతం నడుస్తోంది.

* మార్కెట్లో ఇక్కత్‌ డిజైన్లు, ఫాయిల్‌ ప్రింట్లు ఉన్న కర్టెన్లను ఇష్టపడుతున్నారు.

ఎంబ్రాయిడరీ, పద్యాలతో.. ఫొటోలతో..

కర్టెన్లు అంటే ఎండ నుంచి రక్షణ, ప్రైవసీ కోసం మాత్రమే కాకుండా ఇంట్లోవారి అభిరుచులు, ఆలోచనలను ప్రతిబింబిస్తున్నాయి. వాటిపై పిల్లలకు ఇష్టమైన పద్యాలను, కొటేషన్లను ఎంబ్రాయిడరీ చేయించి ఉపయోగిస్తున్నారు. కుటుంబ సభ్యుల చిత్రాలను సైతం వీటిపై ప్రింట్‌ చేస్తున్నారు. కర్టెన్లు ఉపయోగించే చోటును బట్టి డిజైన్‌ చేయించుకుంటున్నారు. పూజ గది వద్ద తెరలపై గంటలు ఉండేలా భిన్నంగా ప్రయత్నిస్తున్నారు.

* లివింగ్‌ ఏరియాలో కర్టెన్‌ పైభాగంలో, కింది భాగంలో డిజైన్‌ ఉండేలా చూస్తున్నారు.

డిజైనర్ల ఛాయిస్‌

* కరెక్టన్ల ఎంపికలో ఇంటీరియర్‌ డిజైనర్ల ఛాయిస్‌ ప్రత్యేకం. వస్త్రాలపై ఉంటే ప్రింట్ల డిజైన్‌ కంటే వస్త్రంపై ఉండే టెక్చర్‌కు అమిత ప్రాధాన్యం ఇస్తారు. ఇవే ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తాయని చెబుతున్నారు.

* ఇంట్లో గోడల రంగులు, సోఫా డిజైన్‌కు తగ్గట్టుగా ఉన్నవాటిని ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు.

* దేశీయంగా ఉత్పత్తి అయ్యే ఫ్యాబ్రిక్‌ కంటే వీరు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఫ్యాబ్రిక్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు.

రిమోట్‌తో

ఇంట్లో ఏసీ, ఫ్యాన్‌, టీవీ రిమోట్‌తో ఆపరేట్‌ చేస్తున్నప్పుడు కర్టెన్లు మాత్రం వాటి దగ్గరికి వెళ్లి చేతికి అందక ఇబ్బంది పడటం ఎందుకు? అందుకే ఇప్పుడు మోటరైజ్డ్‌ కర్టెన్లు వచ్చాయి. స్మార్ట్‌ హోమ్స్‌లో వీటికే ప్రాధాన్యం ఇస్తున్నారు. కూర్చున్న చోటు నుంచి రిమోట్‌తోనే తెరవవచ్చు.. మూయవచ్చు. వీటిలో మరో ప్రత్యేకత ఉంది. చేతితో తాకితే చాలు తెరుచుకుంటాయి.


కుటుంబసమేతంగా ఎంపికకు ప్రాధాన్యం
- అంకిత్‌ గోయల్‌, డెకార్‌ వరల్డ్‌

గృహాలంకరణలో ఫర్నిషింగ్స్‌, ఫర్నిచర్‌, లైటనింగ్‌ అత్యంత ప్రధానమైనవి. ఇల్లు బాగుందని మెచ్చుకోవాలంటే ఈ మూడే కీలకం. వీటిపైనే ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు.  రూ.రెండు కోట్ల విలువ చేసే 3 పడకల ఇల్లయితే ఫర్నిషింగ్స్‌పై రూ.రెండు లక్షల నుంచి రూ.రెండున్నర లక్షలు ఖర్చు చేస్తున్నారు. 4 పడక గదుల ఇల్లయితే రూ.ఐదు లక్షల నుంచి రూ.7 లక్షల వరకు వ్యయం చేస్తున్నారు. బంగ్లాలైతే రూ.30లక్షల నుంచి రూ.35 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు.  ఇదివరకు కర్టెన్ల ఎంపిక బాధ్యతతను ఎక్కువగా గృహిణులు చూసేవారు. ఇప్పుడు వీటి ఎంపికకు కుటుంబం అంతా కలిసి వస్తున్నారు. అందుకోసమే ప్రత్యేకంగా ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు వస్తున్నాయి. ఇంటీరియర్‌ డిజైనర్లతో చర్చించుకుని జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నారు. కర్టెన్లను, రంగులను కస్టమైజ్‌ చేయిస్తున్నారు. విదేశాల్లో చూసి వచ్చిన వారు ఆ తరహా కావాలని మరీ డిజైన్‌ చేయించుకుంటున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు