కొనుగోలుదారులు మోసపోకుండా సంస్కరణలు

ఎంతో కష్టపడి రూపాయి, రూపాయి పోగేసి ఇళ్లో, ప్లాటో, భూమి కొన్నాక.. అమ్మినవాళ్లు మోసం చేశారనో లేక కబ్జాలో ఉన్న ఆస్తిని కొన్నామనో తెలిస్తే  లేని ఇబ్బందులను కొని తెచ్చుకున్నట్లే. చిన్న, చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి చిక్కులు లేకుండా ఉంటుందని చెబుతున్నారు రిజిస్ట్రేషన్‌ శాఖ ఐజీ చిరంజీవులు.

Published : 01 Jun 2019 01:42 IST

భూమి తీసుకునేటపుడు జాగ్రత్తలు తప్పనిసరి 
‘ఈనాడు’తో రిజిస్ట్రేషన్‌ శాఖ ఐజీ చిరంజీవులు 
ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌

 

ఎంతో కష్టపడి రూపాయి, రూపాయి పోగేసి ఇళ్లో, ప్లాటో, భూమి కొన్నాక.. అమ్మినవాళ్లు మోసం చేశారనో లేక కబ్జాలో ఉన్న ఆస్తిని కొన్నామనో తెలిస్తే  లేని ఇబ్బందులను కొని తెచ్చుకున్నట్లే. చిన్న, చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి చిక్కులు లేకుండా ఉంటుందని చెబుతున్నారు రిజిస్ట్రేషన్‌ శాఖ ఐజీ చిరంజీవులు. కొనుగోలుదారులు మోసపోకూడదనే ఉద్దేశంతోనే రిజిస్ట్రేషన్‌ శాఖలో ఇటీవల పలు సంస్కరణలు తీసుకువచ్చినట్లు తెలిపారు. స్థిరాస్తులు కొనడానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘ఈనాడు’ నిర్వహించిన ముఖాముఖిలో పలు అంశాలకు సమాధానాలిచ్చారు.

రాష్ట్రంలో ప్రస్తుతం రియల్‌ఎస్టేట్‌ పరిస్థితి ఎలా ఉంది? 
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ కొనసాగుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 15లక్షల 32వేల డాక్యుమెంట్లు రిజిస్టర్‌ అయ్యాయి. రిజిస్ట్రేషన్‌లో 33 శాతం, ఆదాయంలో 23 శాతం వృద్ధి నమోదైంది. నాలుగేళ్లలో వచ్చిన ఆదాయం కంటే గతేడాది అధిక ఆదాయం వచ్చింది. ఈ సంవత్సరం ఇప్పటికే 2.50లక్షల దస్త్రాలు రిజిస్టరై, రూ.1,045 కోట్ల ఆదాయం వచ్చింది. సిబ్బంది కొరత ఉన్నా, పని భారం పెరిగినా నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ సమర్థంగా సకాలంలో సేవలు అందిస్తున్నాం.

కొన్ని సందర్భాల్లో భూమి కొనేవాళ్లు మోసపోతున్నారు. మున్ముందు ఎవరూ మోసపోకుండా ఉండేందుకు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? 
రాష్ట్రంలో గత ఆర్థిక సంవత్సరంలో సుమారు లక్ష కోట్ల రూపాయల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జరిగింది. పెద్ద ఎత్తున క్రయవిక్రయాలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో కొనుగోలుదారులు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. బ్రోకర్లను నమ్మి మోసపోయి.. కోర్టులు, అధికారుల చుట్టూ తిరగడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకే భూమి కొనుగోలు చేసేటప్పుడు అన్ని ధ్రువపత్రాలు చూసుకోవాలి.

సరి చూసుకోవాల్సినవి ఇవే.. 
వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ఇళ్లు ఏది కొనుగోలు చేయాలనుకున్నా అది కొనుగోలు జాబితాలో ఉందా, నిషేధిత జాబితాలో ఉందా చూసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ శాఖ సంబంధిత వెబ్‌సైట్‌లో ప్రతి గ్రామానికి సంబంధించిన నిషేధిత జాబితా ఉంటుంది. ప్రభుత్వ, అసైన్‌మెంట్‌, ఎండోమెంట్‌ భూములు, కోర్టు వివాదంలో ఉన్న భూముల వివరాలన్నీ అందులో ఉంటాయి.

వ్యవసాయ భూమి కొనేముందు అమ్మేవారికి టైటిల్‌ ఉందా.. లేదా.. అనేది చూడాలి. రెవెన్యూ శాఖకు చెందిన ఐఎల్‌ఆర్‌ఎంఎస్‌ వెబ్‌సైట్‌లో గ్రామం, సర్వే నెంబరులో వారి పేరు ఉందా చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో సర్వే నెంబరులో పేరున్నప్పటికీ డీఎస్‌ పెండింగ్‌ అని ఉంటుంది. అలాంటి భూమిని తహసీల్దార్‌ సంతకం పెట్టే వరకు కొనొద్దు.

పట్టాదారు పాసు పుస్తకం లేకపోతే కొనకుండా ఉండటమే మంచిది. గతంలోనే భూమి రిజిస్టరై ఉంటే రిజిస్ట్రేషన్‌ నెంబరు సాయంతో ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ తీసుకొని వివరాలను సరి చూసుకోవాలి. పట్టణాల్లో ఓపెన్‌ ప్లాట్లు కొనాలనుకుంటే కార్పొరేషన్‌, మున్సిపల్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీల అనుమతి (లేఅవుట్‌) ఉందా, లేదా చూసుకోవాలి.

భూమి కొనేవారికి మేలు చేసేలా తీసుకొచ్చిన సంస్కరణలు? 
హెచ్‌ఎండీఏ పరిధిలో కాని, హైదరాబాద్‌ చుట్టపక్కల దాదాపు 25-30 శాతం లేఅవుట్లకు అనుమతులు లేవు. కానీ జనాలు కొంటున్నారు. వాటితో భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. అందుకే మున్సిపాలిటీల పరిధిలో ‘ఖాళీ స్థలం పన్ను అంచనా నంబరు’(వీఎల్‌టీఏ) ఉంటేనే రిజిస్ట్రేషన్‌ చేయమని ఆదేశాలిచ్చాం. ఆ వీఎల్‌టీఏలో మనకు విక్రయించే వారి పేరుంటేనే సరైన వాళ్లని అర్థం. అది లేని పక్షంలో ఎల్‌ఆర్‌ఎస్‌ అయినా ఉందా, ఉంటే అది సరైనదేనా అనేది చూసుకోవాలి. 2015 నవంబరు కంటే ముందే ప్లాట్‌ అయిపోతే, ఎల్‌ఆర్‌ఎస్‌ లేకున్నా భవన నిర్మాణానికి అనుమతి తీసుకొని ఉండాలి. ఇళ్ల విషయానికి వస్తే ప్రాపర్టీ ట్యాక్స్‌ ఐడెంటిఫికేషన్‌ (పీటీఐ) నెంబరు తప్పనిసరిగా చూసుకోవాల్సిన అంశం. 2018 తరువాత 10 ప్లాట్లకు మించి ఉన్న భవనాలకు ‘రెరా’ అనుమతి తప్పనిసరి. నగరం, పట్టణాల్లో ఇళ్లు కొనేవారు వీటన్నింటిని సరిచూసుకుంటే మంచిది.

భూమికి సంబంధించిన వివరాలు/ధ్రువపత్రాలు ఈ వెబ్‌సైట్లలో చూసుకోవచ్చు. 
registration.telangana.gov.in 
ilrms.telangana.gov.in 
dtcp.telangana.gov.in 
hmda.gov.in 
ghmc.gov.in 
cdma.telangana.gov.in 
rera.telangana.gov.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని