కొనుగోలుదారులకు అండగా రెరా

స్థిరాస్తి అమ్మకాలు, కొనుగోళ్లలో పారదర్శకత పాటించడం..అలానే బాధ్యతారాహిత్యానికి నిర్మాణదారులను బాధ్యులను చేస్తూ కేంద్రం స్థిరాస్తి నియంత్రణ అభివృద్ధి చట్టం(రెరా) తెచ్చిన విషయం తెలిసిందే.  తెలంగాణ రెరాకు 50కు పైగా ఫిర్యాదులు వచ్చాయి. నిర్మాణదారులను నమ్మి తాము ఏ విధంగా మోసపోయామో పలువురు గోడు వెళ్లబోసుకున్నారు.  కాకపోతే ఇవన్నీ ఈ చట్టం అమల్లోకి రాకముందు చేపట్టిన ప్రాజెక్ట్‌లని సంబంధిత అధికారులు ....

Published : 15 Jun 2019 03:32 IST

ఆశ్రయిస్తున్న బాధితులు 
ఫిర్యాదులన్నీ పాత ప్రాజెక్ట్‌లపైనే 
ఈనాడు, హైదరాబాద్‌

స్థిరాస్తి అమ్మకాలు, కొనుగోళ్లలో పారదర్శకత పాటించడం..అలానే బాధ్యతారాహిత్యానికి నిర్మాణదారులను బాధ్యులను చేస్తూ కేంద్రం స్థిరాస్తి నియంత్రణ అభివృద్ధి చట్టం(రెరా) తెచ్చిన విషయం తెలిసిందే.  తెలంగాణ రెరాకు 50కు పైగా ఫిర్యాదులు వచ్చాయి. నిర్మాణదారులను నమ్మి తాము ఏ విధంగా మోసపోయామో పలువురు గోడు వెళ్లబోసుకున్నారు.  కాకపోతే ఇవన్నీ ఈ చట్టం అమల్లోకి రాకముందు చేపట్టిన ప్రాజెక్ట్‌లని సంబంధిత అధికారులు అంటున్నారు. 2017 జనవరి 1 తర్వాత అనుమతి పొందిన స్థిరాస్తి ప్రాజెక్ట్‌లు రెరా పరిధిలోకి వస్తాయని.. సేవా లోపాలపై ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. కొత్త ప్రాజెక్ట్‌లు కాబట్టి వీటిపై ఇప్పటివరకు ఫిర్యాదులు రాలేదని.. మున్ముందు వచ్చే అవకాశం ఉందన్నారు.

వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.. 

లేఅవుట్‌లో స్థలం తీసుకుంటున్నా, బహుళ అంతస్తు నిర్మాణంలో ఫ్లాట్‌ కొనుగోలు చేస్తున్నా రెరా రిజిస్ట్రేషన్‌ ఉందో లేదో ముందు తెలుసుకోవాలి. ఒకవేళ నమోదైన ప్రాజెక్ట్‌ అయితే టీఎస్‌రెరా వెబ్‌సైట్‌లో ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి. ప్రతీ మూడునెలలకు ప్రాజెక్ట్‌ పురోగతి వివరాలు ఇందులో పొందుపర్చాల్సి ఉంటుంది.  
rera.telangana.gov.in

కేంద్రం తీసుకొచ్చిన రెరా చట్టం 2016 మే 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులకు తగ్గట్టుగా అవసరమైన మార్పులు చేర్పులకు అవకాశం కల్పించింది. 
రాష్ట్రాల్లో 2017 మే 1 నాటికి అథారిటీ ఏర్పాటుచేయాలని కేంద్రం గడువు నిర్దేశించింది. ఈ మేరకు తెలంగాణలో మార్గదర్శకాలు రూపొందించి టీఎస్‌ రెరాను నోటిఫై చేశారు. 
2017 జనవరి 1 తర్వాత అనుమతి పొందిన ప్రాజెక్ట్‌లు రెరా పరిధిలోకి వస్తాయని మార్గదర్శకాలు రూపొందించి నోటిఫికేషన్‌ ఇచ్చారు. 
రాష్ట్రంలోని నిర్మాణదారులు, స్థిరాస్తి వ్యాపారులు, ఏజెంట్లు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. అయితే టీఎస్‌రెరా అథారిటీ ఏర్పాటు, వెబ్‌సైట్‌ రూపకల్పన ఆలస్యమైంది. అది గతయేడాది ఆగస్టు 31న అందుబాటులోకి వచ్చింది. 
2017 జనవరి 1 నుంచి 31.8.2018 లోపు అనుమతి పొందిన ప్రాజెక్ట్‌లు రెరాలో నమోదుకు 3 నెలల గడువు ఇచ్చారు. ఈ కాలంలో 5వేల ప్రాజెక్ట్‌లు స్థానిక సంస్థల నుంచి అనుమతి పొందినట్లు అధికారులు గుర్తించారు. మూడునెలల గడువు ముగిసిన అనంతరం అపరాధ రుసుముతో నమోదుకు అవకాశం కల్పించారు. 
కొత్త ప్రాజెక్ట్‌లు నిర్ణీత ఫీజు చెల్లించి నమోదు చేసుకునే సౌలభ్యం ఉన్నా.. పాతవాటికి ప్రస్తుతం రూ.3 లక్షల జరిమానాతో స్వీకరిస్తున్నారు. ఈ గడువు ఈనెల 30తో ముగియనుంది. ఇప్పటివరకు 5669 ప్రాజెక్ట్‌లు, 2523 మంది ఏజెంట్ల ప్రొఫైల్స్‌ రాగా.. 895 ప్రాజెక్ట్‌లు, 1238 మంది ఏజెంట్లు నమోదు చేసుకున్నారు. ఈ ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు అంటున్నారు. 
ఇప్పటివరకు రూ.16.5 కోట్ల రిజిస్ట్రేషన్‌ ఫీజు, రూ.3.5 కోట్ల అపరాధ రుసుముతో రూ.20 కోట్లు రెరా అథారిటీకి వచ్చిందని వెల్లడించారు.

సొమ్ము తీసుకుని ఆ తర్వాత..

‘‘భవిష్యత్తులో మంచి డిమాండ్‌ ఉంటుందని చెప్పి స్థలం చూపించి 40 మంది వరకు ఐటీ, ఇతర ఉద్యోగుల నుంచి పెట్టుబడి పెట్టించారు ఒక స్థిరాస్తి వ్యాపారి. ఒక్కొక్కరు రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు సొమ్ములు ఇచ్చారు. కొందరు పూర్తిగా చెల్లించగా మరికొందరు సగం చెల్లించారు. వీరి దగ్గర సొమ్ములు తీసుకుని వేరొకరికి భూమిని అమ్మి పరారయ్యాడు. బాధితులు ఇటీవలను రెరాను ఆశ్రయించారు. రెరా రాకముందు ప్రాజెక్ట్‌ ఇది. అయినా బాధితులకు న్యాయం చేద్దామని విచారిస్తే సదరు వ్యాపారి నెంబరు పనిచేయడం లేదు. మరిన్ని వివరాలు సేకరించే పనిలో ఉన్నారు’’ 

జరిమానా వేయబోతున్నారు.. 
జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలోని బహుళ అంతస్తుల భవనాలు, లేఅవుట్లపై రెరా నజర్‌ పెట్టింది. పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలను గమనిస్తున్నారు. క్షేత్రస్థాయిలోనూ అధికారుల బృందాన్ని పంపించి పరిశీలిస్తున్నారు. వీటిలో 60 శాతం వరకు పాత ప్రాజెక్ట్‌లు కాగా.. మిగిలినవి కొత్తవని తేలాయి. ఆయా సంస్థలను రెరాలో చేరాల్సిందిగా సూచించారు. ఆరు సంస్థలు మాత్రం ఎన్నిసార్లు చెప్పినా లెక్కచేయడం లేదని అధికారులు గుర్తించారు. వీటికి నోటీసులు జారీ చేసి ప్రాజెక్ట్‌ మొత్తంలో 10 శాతం జరిమానా విధించేందుకు సిద్ధపడుతున్నారు. రూ.2 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌ అనుకుంటే రూ.20 లక్షలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. 
నిబంధనలు ఏం చెబుతున్నాయంటే 
ప్రాజెక్ట్‌కు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వ సంస్థలకు దరఖాస్తు చేసిన దగ్గర్నుంచి చాలా సంస్థలు విక్రయాలు ప్రారంభిస్తుంటాయి. కొనుగోలుదారుడు అనుమతులు ఉన్నాయా అని ఆరా తీసినా ఉన్నాయనో.. వచ్చేస్తాయనో నచ్చచెప్పి విక్రయిస్తుంటారు. అన్నిరకాల అనుమతులతో పాటు రెరాలో నమోదుచేయించాలి. భూయజమాని, నిర్మాణదారు, లేఅవుట్‌, అనుమతుల పత్రాలు, ప్లాన్‌, ఆర్కిటెక్ట్‌, గుత్తేదారు, ఇంజినీర్ల వివరాలన్నీ సమర్పించాలి. ఆ తర్వాతే విక్రయాలు ప్రారంభించాలి. 
నిర్మాణపరమైన లోపాలను బిల్డర్లు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. రెరా వచ్చాక నిర్మాణం పూర్తయిన ఐదేళ్లవరకు నిర్మాణదారే బాధ్యత వహించాలి. 
నియంత్రణ బిల్లు ప్రకారం కొనుగోలుదారుల నుంచి వసూలు చేసిన మొత్తంలో 70 శాతం వరకు ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతాలో జమ చేయాలి. దీంతో ప్రాజెక్ట్‌ సొమ్ము పక్కదారి పట్టకుండా నియంత్రణ ఉంటుంది. గడువులోపు పూర్తిచేసేందుకు ఈ నిబంధన మేలు చేస్తుంది. 
ప్రత్యేకంగా స్థిరాస్తి కొనుగోలుదారుల వివాదాల పరిష్కారానికి అప్పిలేట్‌ ట్రైబ్యునళ్లు, నియంత్రణ ప్రాధికార సంస్థలకు కాల పరిమితులను విధించింది. ఈ సంస్థలు గరిష్ఠంగా 60రోజుల్లోనే ఫిర్యాదులను పరిష్కరించనుండం కొనుగోలుదారులకు ఊరట. 
కొనుగోలుదారుల అనుమతి లేకుండా ప్లాన్‌ మార్చకూడదనే నిబంధన ఉంది. దీంతో ప్రాజెక్ట్‌ ఆరంభంలోనే దీనిపై సమగ్రంగా కసరత్తు చేస్తారు కాబట్టి ఆఖరి నిమిషాల్లో మార్పులతో ప్రాజెక్ట్‌ల్లో జాప్యం తగ్గుతుంది. కొనుగోలుదారు మార్పుతో నష్టపోకుండా ఉంటారు.

ఇక జరిమానాలే 

‘2017 జనవరి తర్వాత అనుమతి పొందిన ప్రతి ప్రాజెక్ట్‌ను రెరాలో తప్పనిసరిగా నమోదు చేసుకునేలా చూస్తున్నాం. నమోదు ప్రక్రియ చాలా సులభతరం చేశాం. స్థిరాస్తి సంఘాల ద్వారా వారి సభ్యులకు తెలిసేలా చేస్తున్నాం. కొన్ని సంస్థలు దరఖాస్తు చేసినా అవసరమైన అన్ని పత్రాలు సమర్పించకపోవడం గుర్తించాం. వీటిని సైతం తిరస్కరించకుండా పూర్తి పత్రాలు సమర్పించేలా చైతన్యపరుస్తున్నాం. ఇప్పటికే నిర్మాణదశలో ఉండటం, కొన్ని అమ్ముడుపోవడం వంటి అంశాలను దృష్టిపెట్టుకుని కొనుగోలుదారుల హక్కులను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పలుమార్లు హెచ్చరించినా రెరాలో నమోదుకు ముందుకురాని ఆరు సంస్థలకు నోటీసులిచ్చి అప్పటికీ స్పందించకపోతే 10 శాతం జరిమానా విధించే ఆలోచనలో అథారిటీ ఉంది. కొనుగోలుదారుల నుంచి ఇప్పటికే నిర్మాణలోపాలపై పలు ఫిర్యాదులు వచ్చినా అవన్నీ రెరా రాకముందు ఉన్న ప్రాజెక్ట్‌లు. వీరికి ఎలా న్యాయం చేయాలనేది ఆలోచిస్తున్నాం. రెరా అనుమతి ఉన్న వాటికే రిజిస్ట్రేషన్‌ చేసేలా సంబంధిత శాఖను కోరబోతున్నాం. అందుకు చట్టంలో మార్పులు చేయాల్సి ఉంది.’

- కె.విద్యాధర్‌, సభ్య కార్యదర్శి, టీఎస్‌రెరా


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని