ఆకర్షిస్తోన్న శంకర్‌పల్లి

ఇల్లు, ప్లాట్లు కొనేముందు వినియోగదారులు మౌలిక వసతుల గురించి ఆలోచిస్తారు. రవాణా, రహదారులు, నీటి సౌకర్యం, సమీపంలో విద్యాసంస్థలు, వైద్య సదుపాయం వంటివి చూసి నిర్ణయం తీసుకుంటారు. హైదరాబాద్‌ మహా నగరానికి సమీపంలో, బాహ్యవలయ రహదారికి అనుకొని

Published : 31 Aug 2019 01:52 IST

ఈనాడు, హైదరాబాద్‌; శంకర్‌పల్లి, న్యూస్‌టుడే

ఇల్లు, ప్లాట్లు కొనేముందు వినియోగదారులు మౌలిక వసతుల గురించి ఆలోచిస్తారు. రవాణా, రహదారులు, నీటి సౌకర్యం, సమీపంలో విద్యాసంస్థలు, వైద్య సదుపాయం వంటివి చూసి నిర్ణయం తీసుకుంటారు. హైదరాబాద్‌ మహా నగరానికి సమీపంలో, బాహ్యవలయ రహదారికి అనుకొని ఉన్న శంకర్‌పల్లి పరిసర ప్రాంతాలు స్థిరాస్తుల పెట్టుబడులకు చిరునామాగా మారాయి. అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చెందుతున్న వెంచర్లు భారీ సంఖ్యలో వెలుస్తున్నాయి. వినియోగదారుల స్థాయికి తగ్గట్టుగా ధరలు ఉండటంతో స్ధలాల కొనుగొళ్లు జోరుగా సాగుతున్నాయి. నగరంలో జీవనం ఆర్థిక భారంగా మారిన మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ఖర్చులో పట్టణ వసతులు ఉన్న కేంద్రంగా శంకర్‌పల్లి ఆకర్షిస్తోంది.

హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ బృహత్‌ ప్రణాళికలో శంకర్‌పల్లి, మోకిల, మహాలింగాపురం, సింగాపురం గ్రామాలను నివాసయోగ్య ప్రాంతాలుగా గుర్తించారు. నగరానికి సమీపంలో ఆహ్లాదకర వాతావరణం ఉన్న ప్రాంతాల్లో ఇంటిని నిర్మించుకోవాలనుకునేవారు శంకర్‌పల్లి వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రభుత్వం 2018 ఆగస్టు 2న శంకర్‌పల్లిని పురపాలికగా ఏర్పాటు చేసింది. సింగాపురం, బుల్కాపురం, ఫత్తేపురం, రామంతాపురం గ్రామాలను విలీనం చేసింది. మున్సిపాలిటీలో పట్టణ వసతులు రానుండడంతో భవన నిర్మాణాలు ఊపందుకున్నాయి. మోకిలలో ప్లాట్లు, విల్లాల ధరలు అధికంగా ఉండడంతో పలువురు శంకర్‌పల్లి మండల కేంద్రం వైపు అడుగులు వేస్తున్నారు. చుట్టుపక్కల పలు గ్రామాల్లో పేరున్న పలు స్థిరాస్తి సంస్థలు పెద్ద సంఖ్యలో వెంచర్లు ఏర్పాటు చేశాయి. ఒక్కో వెంచరు సుమారు 20 ఎకరాల నుంచి 150 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకున్నాయి. రానున్న రెండు సంవత్సరాల్లో శంకర్‌పల్లి రూపురేఖలు మరింత మారనున్నాయి.

గంటలోపే చేరుకునేలా.. 
శంకర్‌పల్లి చుట్టుపక్కల సుమారు 8 ఏళ్ల క్రితమే ప్రముఖ విద్యా సంస్థలు వచ్చాయి. గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌, ఇండస్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌, సమిష్టి, గాడియం ఇంటర్నేషనల్‌ స్కూల్‌, ఇక్ఫాయ్‌ బిజినెస్‌ స్కూల్‌ ఉన్నాయి. ఈ విద్యాసంస్థల్లో నగరానికి చెందిన వారే అధికంగా విద్య అభ్యసిస్తున్నారు. 

శంకర్‌పల్లి నుంచి 30-40 నిమిషాల్లో నగరానికి చేరుకునే అవకాశం ఉంది. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, గచ్చిబౌలి ఫైనాన్సియల్‌ జిల్లా, పలు ఐటీ కంపెనీలకు ఇక్కడ నుంచి గంటలోపే చేరుకునే వీలుంది. బాహ్యవలయ రహదారికి సమీపంలో ఉన్న శంకర్‌పల్లి పట్టణానికి ప్రభుత్వం నిధులు ఎక్కువ మొత్తంలో మంజూరుచేసి రోడ్లను అభివృద్ధి పరిచింది. గండిపేట నుంచి శంకర్‌పల్లి వరకు ఉన్న రోడ్డును నాలుగు వరుసలుగా, రామంతాపురం నుంచి దేవరంపల్లి రోడ్డును రెండు వరుసలుగా,  హిమాయత్‌నగర్‌-తండగపల్లి రోడ్డును రెండు వరుసల రహదారిగా మార్చడంతో రవాణా సదుపాయం మెరుగుపడింది. ఓఆర్‌ఆర్‌తో మెరుగైన అనుసంధానం ఉంది. శంకర్‌పల్లి రైల్వేస్టేషన్‌ నుంచి సమీపంలో ఉన్న లింగంపల్లి ఎంఎంటీఎస్‌ స్టేషన్‌కు 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. శంకర్‌పల్లి నుంచి నాంపల్లి వెళ్లేందుకు ఉదయం, సాయంత్రం వేళల్లో సుమారు 8 రైళ్లు ఉన్నాయి.

వారాంతపు విడిది కేంద్రాలు..... 
మండలంలో పేరుగాంచిన పలు రిసార్టులు ఉన్నాయి. వారాంతాల్లో సేద తీరేందుకు ఇక్కడకు నగరవాసులు వస్తున్నారు. పర్యాటకులు ఈ పరిసర ప్రాంతాల్లో ప్లాట్లు, విల్లాల కొనుగోలుపై మక్కువ చూపుతున్నారు. పొద్దుటూరు పరిధిలో ప్రగతి రిసార్టు, కొండకల్‌ పరిధిలో లహరి రిసార్టు, ఏర్వగూడ పరిధిలో ఫామ్‌ ఎక్సోటికా, వైల్డ్‌ వాటర్‌ ఉన్నాయి. వినోదంతో పాటు అత్యవసరంలో వైద్య సదుపాయాలు ముఖ్యం. నానక్‌రాంగూడ, గచ్చిబౌలిలో ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్టు చుట్టుపక్కల కాంటినెంటల్‌, కిమ్స్‌, కేర్‌, ఏషియన్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, సన్‌షైన్‌ ఆసుపత్రులు ఉన్నాయి. అత్యవసరంలో గంటలోపే ఇక్కడికి చేరుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని