ఉప్పల్‌-ఎల్‌బీ నగర్‌ అటు పైన..

ఒకప్పుడు అక్కడ పేరున్న సంస్థలు ఒకటి అరా తప్ప పెద్దగా కనిపించేవి కావు.. అలాంటిది ఇప్పుడు అక్కడ గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌లు చేపట్టేందుకు బడా సంస్థలు వరస కడుతున్నాయి. ఐదేళ్ల క్రితం వరకు ఏడాదిలో రెండు మూడు గేటెడ్‌ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్లు చేపట్టడమే కష్టంగా ఉన్న దశ నుంచి ఇప్పుడు పన్నెండు వరకు ప్రాజెక్ట్‌లు

Published : 09 Nov 2019 02:13 IST

మెట్రో రైలుతో మారిన రియాల్టీ చిత్రం

* ఒకప్పుడు అక్కడ పేరున్న సంస్థలు ఒకటి అరా తప్ప పెద్దగా కనిపించేవి కావు.. అలాంటిది ఇప్పుడు అక్కడ గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌లు చేపట్టేందుకు బడా సంస్థలు వరస కడుతున్నాయి.
* ఐదేళ్ల క్రితం వరకు ఏడాదిలో రెండు మూడు గేటెడ్‌ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్లు చేపట్టడమే కష్టంగా ఉన్న దశ నుంచి ఇప్పుడు పన్నెండు వరకు ప్రాజెక్ట్‌లు నిర్మాణాలు జరుపుకొంటున్నాయి.
*మెట్రోరైలు రాకతో హైదరాబాద్‌ తూర్పు రియాల్టీరంగంలో చాలా మార్పులు వచ్చాయి. ఉప్పల్‌ - ఎల్‌బీనగర్‌ చుట్టుపక్కల ప్రాంతాలు స్థిరాస్తి రంగ అభివృద్ధికి కేంద్రాలుగా మారాయి.

ఈనాడు, హైదరాబాద్‌

ఐటీ కారిడార్‌లో పనిచేసే వారంతా ఇదివరకు పశ్చిమ హైదరాబాద్‌లోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి మొగ్గు చూపేవారు. ఎల్‌బీనగర్‌ నుంచి మియాపూర్‌, నాగోల్‌ నుంచి హైటెక్‌సిటీ వరకు మెట్రో అందుబాటులోకి వచ్చాక దూరం తగ్గిపోయింది. ఐటీ ఉద్యోగులు సైతం ఉప్పల్‌-ఎల్‌బీనగర్‌ చుట్టుపక్కల 15 కిలోమీటర్ల వరకు నివాసానికి మొగ్గుచూపుతున్నారు. ఉప్పల్‌, ఘట్‌కేసర్‌, పోచారం, నాగోల్‌, ఎల్‌బీనగర్‌, విజయవాడ రహదారి, సాగర్‌ రోడ్డు, ఆదిభట్ల, మహేశ్వరం వరకు కొత్త నిర్మాణాలు విస్తరించాయి. పశ్చిమ హైదరాబాద్‌లో ఇంటికి వెచ్చించే వ్యయంతో సగం ధరకే మరింత ఎక్కువ విస్తీర్ణం కలిగిన ఆవాసాలను ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు. తల్లిదండ్రులతో కలిసి ఉండడానికి ఈ ప్రాంతమే అనువైందని భావిస్తున్నారు. ఇదివరకు ఈ ప్రాంతాల్లో మహబూబ్‌నగర్‌, నల్గొండ, వరంగల్‌ జిల్లాల నుంచి పిల్లల చదువుల కోసం, ఉపాధిరీత్యా వలస వచ్చినవారు ఎక్కువగా నివసించేవారు. మెట్రోతో అన్నివర్గాల వారు ఇక్కడ స్థిర నివాసానికి ఆసక్తి చూపిస్తున్నారని స్థిరాస్తి వర్గాలు అంటున్నాయి. ఐటీ ఉద్యోగులు ఆసక్తి చూపుతుండడంతో గేటెడ్‌ కమ్యూనిటీల నిర్మాణాలు ఈ ప్రాంతంలో జోరందుకున్నాయి.

ధరలెలా ఉన్నాయ్‌..
మెట్రో రాక, మౌలిక వసతుల అభివృద్ధితో స్థిరాస్తి ధరలు ఈ ప్రాంతంలో గత రెండేళ్లలో అనూహ్యంగా పెరిగాయి. ఇదివరకు రూ.పాతిక లక్షలు మొదలు రూ.40 లక్షల లోపు వచ్చే ఇళ్లు ఇప్పుడు రూ.40 లక్షల నుంచి రూ.80 లక్షలకు ఎగబాకాయి. వ్యక్తిగత ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలు, విల్లాలు అన్నీ అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తు వృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతం కావడంతో ధరలు మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని నిర్మాణదారులు అంటున్నారు. చ.అడుగు ధర రూ.3వేల నుంచి రూ.5500 వరకు చెబుతున్నారు.

భారీగా మల్టీఫ్లెక్స్‌లు..
సామాజిక పరమైన మౌలిక వసతులు చుట్టుపక్కల పెద్ద ఎత్తున రాబోతున్నాయి. నాగోల్‌లో శిల్పారామం ఇటీవలనే అందుబాటులోకి వచ్చింది. రామాంతపూర్‌ మార్గంలో పెద్ద మాల్‌ ఒకటి ప్రారంభమైంది. ఇందులో సినిమా తెరలు ఉన్నాయి. కొత్తగా ఎల్‌బీనగర్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో మల్టీఫ్లెక్స్‌లు.. వాటిలో 36 స్క్రీన్లు రాబోతున్నాయి. నాగోల్‌, ఎల్‌బీనగర్‌, కర్మాన్‌ఘాట్‌, హస్తినాపురం, వనస్థలిపురం ప్రాంతంలో మల్టీఫ్లెక్స్‌ పనులు వేర్వేరు దశలో ఉన్నాయి. ఒక్కో మాల్‌లో కనీసం 4 నుంచి గరిష్ఠంగా 11 వరకు సినిమా తెరలు ఉండబోతున్నాయి. ఇబ్రహీంపట్నంలోనూ మల్లీఫ్లెక్స్‌ వస్తోంది. ఇప్పటికే మలక్‌పేటలో మెట్రో మాల్‌, సినిమా తెరలు అందుబాటులోకి వచ్చాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామోజీ ఫిల్మ్‌సిటీ చేరువలో ఉంది. సమీపంలోనే పలు కార్పొరేటు ఆసుపత్రులు, విద్యాసంస్థలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నివాస యోగ్య ప్రాంతంగా మార్చాయి. దీంతో పెద్ద బిల్డర్లు తమ కొత్త ప్రాజెక్ట్‌లను ఇటువైపు చేపట్టేందుకు వస్తున్నారు. పశ్చిమ హైదరాబాద్‌కు ప్రత్యామ్నాయంగా అభివర్ణిస్తున్నారు.

లుక్‌ ఈస్ట్‌ పాలసీతో..
ఐటీ కారిడార్‌ రద్దీగా మారింది. కొత్త కంపెనీల రాక, కార్యాలయాల నిర్మాణాలు, వాటి పక్కనే ఆవాస కేంద్రాలతో అభివృద్ధిలో ఈ ప్రాంతం దూసుకుపోతుంది. వ్యవస్థీకృత స్థిరాస్తి రంగంలో ఎనభై శాతం వరకు ప్రాజెక్ట్‌లు ఐటీ కారిడార్‌ చుట్టుపక్కల పశ్చిమ హైదరాబాద్‌లో కేంద్రీకృతమై ఉన్నాయి. ప్రభుత్వం లుక్‌ ఈస్ట్‌ పాలసీ తీసుకు వస్తుండడంతో నిర్మాణాలు క్రమంగా తమ ఫోకస్‌ను తూర్పు హైదరాబాద్‌ వైపు మళ్లించాయి. ఇక ఇప్పుడు రావాల్సింది ఐటీ కంపెనీలు అని స్థిరాస్తి సంఘాలు అంటున్నాయి. అన్ని రకాల మౌలిక వసతులు ఇక్కడ ఉన్నాయని చెబుతున్నాయి. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఉప్పల్‌లో ఎన్‌ఎస్‌ఎల్‌ ఐటీ సెజ్‌, పోచారంలో రహేజా మైండ్‌స్పేస్‌లో ఐటీ కార్యాలయాలు ఉన్నాయి. ఇన్ఫోసిస్‌ పెద్ద ప్రాంగణం ఇక్కడ ఏర్పాటైంది. ఆదిభట్లలో టీసీఎస్‌ అతిపెద్ద ప్రాంగణాన్ని నిర్మించింది. ఉప్పల్‌-ఎల్‌బీనగర్‌ చుట్టుపక్కల 15 కి.మీ. వరకు ఐటీ సంస్థల ఏర్పాటుకు కావాల్సినంత భూమి అందుబాటులో ఉందని క్రెడాయ్‌ సంఘాలు అంటున్నాయి. గతంలో పరిశ్రమలకు కేటాయించి ప్రస్తుతం ఖాళీగా ఉన్న భూములను ప్రభుత్వం ఐటీ సంస్థలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని చెబుతున్నారు.

మౌలిక వసతులు మెరుగు..
తూర్పు హైదరాబాద్‌లో మౌలిక వసతులు మెరుగ్గానే ఉన్నాయి. పెరుగుతున్న ట్రాఫిక్‌ రద్దీని తట్టుకునేందుకు భవిష్యత్తు దృష్ట్యా ఈ ప్రాంతంలో నగరంలో ఎక్కడా లేని విధంగా ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్ట్‌లో అత్యధిక ఫ్లైఓవర్ల పనులను ప్రభుత్వం చేపట్టింది. ఎల్‌బీనగర్‌లో ఒక ఫ్లైఓవర్‌ ఒక అండర్‌పాస్‌, చింతలకుంటలో మరో అండర్‌పాస్‌, సాగర్‌రింగ్‌రోడ్డు వద్ద ఫ్లైఓవర్‌, కామినేని వద్ద ఫ్లైఓవర్‌, నాగోల్‌ వద్ద మరో ఫ్లైఓవర్‌, ఉప్పల్‌ నుంచి నారపల్లి వరకు ఫ్లైఓవర్‌ పనులు చేపట్టారు. కొన్ని పూర్తికాగా.. మరికొన్ని వేర్వేరు దశలో ఉన్నాయి. ఒకటి రెండేళ్లలో ఈ పనులన్నీ పూర్తయితే ఈ ప్రాంతం రూపురేఖలు మరింత మారిపోనున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని