తడబడకుండా నిలబడింది

స్థిరాస్తి మార్కెట్‌కు 2019 బాగా కలిసి వచ్చింది. ఎన్నికల సంవత్సరం అయినా.. రెండో అర్ధభాగంలో ఆర్థిక మాంద్యం భయాలు ఉన్నా.. హైదరాబాద్‌ మార్కెట్‌పై పెద్దగా ప్రభావం కనిపించలేదని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. కార్యాలయాల నిర్మాణాలు, లీజింగ్‌లో బెంగళూరు నగరాన్ని హైదరాబాద్‌ ఈసారి వెనక్కి నెట్టింది. భవిష్యత్తు గృహ నిర్మాణాల మార్కెట్‌ఫై ఇది విశ్వాసం పెంచింది. పర్యావరణ, అగ్నిమాపక, భూ మార్పిడి అనుమతుల జాప్యంతో కొత్తగా పెద్ద ప్రాజెక్ట్‌లు మొదలవడం ఆలస్యం అయినా.. ఈ లోపు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లలోని ఇళ్లన్నీ అమ్ముడుపోయాయి. క్రితం సంవత్సరంతో పోలిస్తే ఇళ్ల వరకు రెండింతలు విక్రయాలు జరిగాయని స్థిరాస్తి సంఘాలు అంటున్నాయి. డిమాండ్‌ మేరకు ఇళ్ల సరఫరా

Published : 28 Dec 2019 01:37 IST

2019 స్థిరాస్తి సమీక్ష

ఈనాడు, హైదరాబాద్‌ : స్థిరాస్తి మార్కెట్‌కు 2019 బాగా కలిసి వచ్చింది. ఎన్నికల సంవత్సరం అయినా.. రెండో అర్ధభాగంలో ఆర్థిక మాంద్యం భయాలు ఉన్నా.. హైదరాబాద్‌ మార్కెట్‌పై పెద్దగా ప్రభావం కనిపించలేదని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. కార్యాలయాల నిర్మాణాలు, లీజింగ్‌లో బెంగళూరు నగరాన్ని హైదరాబాద్‌ ఈసారి వెనక్కి నెట్టింది. భవిష్యత్తు గృహ నిర్మాణాల మార్కెట్‌ఫై ఇది విశ్వాసం పెంచింది. పర్యావరణ, అగ్నిమాపక, భూ మార్పిడి అనుమతుల జాప్యంతో కొత్తగా పెద్ద ప్రాజెక్ట్‌లు మొదలవడం ఆలస్యం అయినా.. ఈ లోపు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లలోని ఇళ్లన్నీ అమ్ముడుపోయాయి. క్రితం సంవత్సరంతో పోలిస్తే ఇళ్ల వరకు రెండింతలు విక్రయాలు జరిగాయని స్థిరాస్తి సంఘాలు అంటున్నాయి. డిమాండ్‌ మేరకు ఇళ్ల సరఫరా లేకపోవడంతో అంతకుముందు మిగిలిపోయిన ఇళ్లు సైతం విక్రయం అయ్యాయని బిల్డర్లు చెబుతున్నారు. ద్వితీయార్థంలో రెండు మూడు నెలలు విక్రయాలు మందగించినట్లు కనిపించినా ఏడాది ఆఖరుకు వచ్చేసరికి మళ్లీ పుంజుకున్నాయి. ఇక జీఎస్‌టీ ఐదు శాతానికి తగ్గించడం కూడా మార్కెట్‌కు ఊతమిచ్చింది. వేర్వేరు సంఘాల ప్రతినిధులు 2019 మార్కెట్‌పై ఏమంటున్నారంటే...


తొలి అర్ధభాగంలో అత్యున్నత స్థాయికి..
- రాజశేఖర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి, క్రెడాయ్‌ హైదరాబాద్‌

ఈ ఏడాది హైదరాబాద్‌ స్థిరాస్తి మార్కెట్‌కు సానుకూల సంవత్సరం అని చెప్పాలి. మొదటి ఆరు నెలలు చాలా బాగుంది. ఆ సమయంలో సిద్ధంగా ఉన్న ఇళ్లన్నీ అమ్ముడు పోయాయి. ఇన్వెస్టర్ల వద్ద మిగిలితే మిగలొచ్చు తప్ప బిల్డర్ల వద్ద ఉన్న పాతవి కూడా అమ్ముడయ్యాయి. అప్పటికే భూముల ధరలు పెరగడంతో అంతకుముందు మిగిలిన ఇళ్లు ఏమైనా ఉంటే కొంచెం ధరలు పెంచే విక్రయించారు. మార్కెట్‌ అత్యున్నత స్థాయికి చేరింది ఈ కాలంలోనే. రెండో అర్ధభాగంలో పర్యావరణ, అగ్నిమాపక శాఖ అనుమతుల రాకతో కొత్త ప్రాజెక్ట్‌ల నిర్మాణాలు మొదలయ్యాయి. మన దగ్గర ఆర్థిక మాంద్యం ప్రభావం లేకపోయినా.. కొనుగోలుదారుల్లో భయాలు మాత్రం ఉన్నాయి. మార్కెట్‌లో ధరలు తగ్గొచ్చు అని కొందరు ఎదురు చూశారు. భూముల ధరలు తగ్గితే బాగుండని మేము భావించాము. మార్కెట్‌ కొన్నిచోట్ల మినహా మొత్తంగా సానుకూలంగానే ఉంది. ఎల్‌బీనగర్‌ ప్రాంతంలో ఇటీవల క్రెడాయ్‌ తొలిసారి ఈస్ట్‌ ప్రాపర్టీ షో చేసింది. సందర్శకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఒక సంస్థకు ఆ తర్వాత నెలరోజుల్లో 102 బుకింగ్స్‌ రావడం మార్కెట్‌ తీరును సూచిస్తోంది. కొనుగోలుదారుల్లో ఇల్లు కావాల్సిన వారు ఉన్నా, ఇన్వెస్టర్లు ఉన్నా మార్కెట్‌ సెంటిమెంట్‌ను సూచిస్తోంది. ఇక్కడివారే కాదు బయట నుంచి సంస్థలు వచ్చి ఇక్కడ ప్రాజెక్ట్‌లు ఈ ఏడాదిలో మొదలెట్టాయి. దేశంలో అహ్మదాబాద్‌ తర్వాత హైదరాబాద్‌ స్థిరాస్తి మార్కెట్‌ బాగుందనేది వారి అభిప్రాయం. 2020లోనూ ఇదే హుషారు కొనసాగుతుందని అంచనా వేస్తున్నాం. ఒక సంస్థ రాబోయే రెండేళ్లలో 75 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపడుతోంది. ఇందులో అత్యధికం గృహ నిర్మాణాలే.


ధరలు 30 శాతం పెరిగాయ్‌..
జె.వెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌

స్థిరాస్తి మార్కెట్‌ అన్ని విభాగాల్లోనూ ఈ ఏడాది మంచి ప్రదర్శన కనబర్చింది. ఇళ్ల నిర్మాణం, ఓపెన్‌ ప్లాట్లు, వాణిజ్య, మాల్స్‌, కార్యాలయాల స్పేస్‌ వరకు నిర్మాణాలు పెరిగాయి. ధరల్లో 30 శాతం వృద్ధి కనిపించింది. మాంద్యం ప్రభావం పెద్దగా లేదు. ఏడాది ఆఖరులో భూముల లావాదేవీలు కొంత మందగించాయి. దీనికి కారణం లేకపోలేదు. అంతకుముందు అనూహ్యంగా ధరలు పెంచిన చోట ఈ పరిస్థితి ఎదురైంది. జీఎస్‌టీని 5 శాతానికి తగ్గించడంతో పారదర్శకత ఏర్పడింది. అంతకుముందు ఇన్‌ఫుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ ఇస్తూ జీఎస్‌టీ 12 శాతం ఉండేది. ఈ లెక్కలన్నీ కొనుగోలుదారుణ్ని గందరగోళ పరిచేవి. ఈ ఏడాది ఐదు శాతానికి తగ్గించడం మార్కెట్‌కు ఊతంగా మారింది. ఈ ఏడాదిలో ఎక్కువగా పాత ప్రాజెక్ట్‌లనే పూర్తిచేశారు. విక్రయాలు బాగున్నాయి. కొత్త ప్రాజెక్ట్‌లకు ప్రభుత్వ పరంగా అనుమతుల్లో జాప్యం జరిగింది. పర్యావరణ, అగ్నిమాపక, ల్యాండ్‌ యూజ్‌ ఛేంజ్‌లో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నందున ఆలస్యం అయ్యాయి. ఈ ప్రభుత్వం తిరిగి అధికారంలో వచ్చాక కొత్త మున్సిపల్‌ చట్టం తీసుకురావడం వంటి చర్యలతో అనుమతుల ప్రక్రియపై ప్రభావం పడింది. ఎన్నికల సంవత్సరం కావడంతో నిర్మాణదారులు ఎదురుచూసే ధోరణిని అవలంబించారు. 


మాంద్యం తట్టుకోగలిగాం..
- జి.వి.రావు, అధ్యక్షుడు, తెలంగాణ డెవలపర్స్‌ అసోసియేషన్‌

రియల్‌ వ్యాపారం ఈ ఏడాది బ్రహ్మండంగా సాగింది. మాంద్యం ప్రభావం మనపై ఎందుకు లేదంటే.. ఇంటి ధరలు అందుబాటులో ఉండడమే. అదే సమయంలో ఐటీ రంగంలో 14,  ఔషధరంగంలో 15 శాతం ఎగుమతులు పెరిగాయి. 60 శాతం వరి సాగు పెరిగింది. ఇవన్నీ మాంద్యం ప్రభావం పడకుండా కాపాడాయి. అన్నింటికంటే నగరంలో ఫ్లాట్‌ ధరలు ఎక్కువ పెరగలేదు కాబట్టి మాంద్యాన్ని తట్టుకోగలిగింది. దేశ, విదేశాల నుంచి పెట్టుబడులు హైదరాబాద్‌ రావడం వల్ల కూడా మార్కెట్‌ నిలదొక్కుకోగలిగింది. ముంబయి చూస్తే మార్కెట్‌ పూర్తిగా పడిపోయింది. బెంగళూరు ఇబ్బంది పడుతోంది. డిమాండ్‌కు మించి అక్కడ ఇళ్లు కట్టడంతో విక్రయాలు ఆశించినంత లేవు. మన దగ్గర ఆ పరిస్థితి లేదు. అవుటర్‌లో అనుమతుల పరంగా విధానపరమైన నిర్ణయాలు, ఆంక్షలతో ఈ ఏడాది కొత్త ప్రాజెక్ట్‌లు పెద్దగా రాలేదు. దీంతో ఉన్న ఇళ్లకు డిమాండ్‌ ఏర్పడింది. మౌలిక వసతులు, శాంతిభద్రతలు బాగుండడంతో కొత్త కంపెనీలూ నగరానికి వస్తున్నాయి. ఫలితంగా కమర్షియల్‌, కార్యాలయాల నిర్మాణాలు పెరిగాయి. పెద్దసంస్థలు ఇక్కడ ఐటీ సెజ్‌లను కొనుగోలు చేస్తున్నాయి. విదేశాల్లో రెండు మూడు శాతమే వడ్డీ వస్తుండడంతో.. ఇక్కడ అద్దె రాబడే ఆరు శాతం వరకు వస్తుండ[ంతో విదేశీ సంస్థలు ఇటువైపు చూస్తున్నాయి. 2020లోనూ ఇదే సానుకూలత కొనసాగే అవకాశం ఉంది. నగరానికి 50 కిలోమీటర్ల బయట ధరలు పెరుగుతాయని ఇప్పటికే ఎక్కువ చెల్లించి కొనుగోలు చేసిన భూముల ధరల్లో దిద్దుబాటు ఉండే అవకాశం ఉంది.గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని