హంగులతో గేటెడ్‌ ప్లాటింగ్‌

గేటెడ్‌ కమ్యూనిటీ ప్లాటింగ్‌ వెంచర్ల పోకడ ఇటీవల బాగా పెరిగింది. మొదట్లో విల్లాలు, ఆ తర్వాత అపార్ట్‌మెంట్లు.. ఇప్పుడు భూముల ధరలు బాగా పెరగడంతో ప్లాటింగ్‌ వెంచర్లకు ఇది విస్తరించింది. అవుటర్‌ చేరువలో ఎక్కువగా ఈ తరహా ప్లాటింగ్‌ వెంచర్లు వస్తున్నాయి. వీటిలో స్థలాలు ధరలు ఎక్కువే. బడా సంస్థలు ఈ తరహా వెంచర్లను ఎక్కువగా అభివృద్ధి చేస్తున్నాయి.

Updated : 18 Jan 2020 01:35 IST

గేటెడ్‌ కమ్యూనిటీ ప్లాటింగ్‌ వెంచర్ల పోకడ ఇటీవల బాగా పెరిగింది. మొదట్లో విల్లాలు, ఆ తర్వాత అపార్ట్‌మెంట్లు.. ఇప్పుడు భూముల ధరలు బాగా పెరగడంతో ప్లాటింగ్‌ వెంచర్లకు ఇది విస్తరించింది. అవుటర్‌ చేరువలో ఎక్కువగా ఈ తరహా ప్లాటింగ్‌ వెంచర్లు వస్తున్నాయి. వీటిలో స్థలాలు ధరలు ఎక్కువే. బడా సంస్థలు ఈ తరహా వెంచర్లను ఎక్కువగా అభివృద్ధి చేస్తున్నాయి.

ఈనాడు, హైదరాబాద్‌

కొనుగోలుదారుల అవసరాలనుబట్టి ఓపెన్‌ ప్లాట్ల వెంచర్లలో ఎప్పటికప్పుడు కొత్త మార్పులు వస్తున్నాయి. మొదట్లో చిన్నచిన్న రహదారులతో గ్రామ పంచాయతీ లేఅవుట్ల పేరుతో విక్రయించేవారు. ఇవి అక్రమమని హెచ్‌ఎండీఏ కొరడా ఝళిపించడంతో డీటీసీపీ, హెచ్‌ఎండీఏ నుంచి 30, 40 అడుగుల రహదారులు, పార్కులకు స్థలం వదిలి వెంచర్లు వేయడం మొదటైంది. భూగర్భ డ్రైనేజీ, విద్యుత్తులైన్లు, నీటి ట్యాంకు వంటి సదుపాయాలను కల్పిస్తుండటంతో కొనుగోలుదారులు సైతం అనుమతి ఉన్న లేఅవుట్లవైపే మొగ్గు చూపేవారు. ధర కాస్త ఎక్కువే అయినా చట్టబద్ధంగా ఉన్న వెంచర్లలోనే కొనుగోలు చేస్తున్నారు. కొన్నేళ్ల తర్వాత ఆ ప్రాంతం అభివృద్ధి చెందాక అక్కడ సొంతింటి నిర్మాణం చేపట్టేవారు. నేటితరం వినియోగదారులు మరిన్ని సదుపాయాలు కోరుకుంటున్నారు. భవిష్యత్తు దృష్ట్యా శివార్లలో కొనే స్థలాలకు రక్షణ కోరుకుంటున్నారు. వృత్తి, ఉద్యోగాల్లో తీరిక లేకుండా ఉండే నగరవాసులు తరచూ కొన్న ప్లాట్‌ దగ్గరికి వెళ్లి చూసుకోవడం సాధ్యమయ్యే పనికాదు. కొనేవారిలో చాలామంది ప్రవాస భారతీయులు ఉంటున్నారు. గేటెడ్‌ కమ్యూనిటీ ప్లాటెడ్‌ వెంచర్‌ అయితే సురక్షితంగా ఉంటుందనే వీరి భావన. ఒకవేళ ఇక్కడ ఇల్లు కట్టుకున్నా క్లబ్‌హౌస్‌, పార్కింగ్‌, పిల్లలకు ఆట స్థలాలు, పెద్దలకు కాలక్షేపం, పచ్చదనం, సెక్యూరిటికీ ఢోకా ఉండదని వీటివైపు మొగ్గు చూపుతున్నారు.

విల్లాలు ఖరీదు కావడంతో..
గేటెడ్‌ కమ్యూనిటీలో విల్లాలు బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రస్తుతం విల్లాల ధరలు భారీగా పెరగడంతో ఎక్కువ మంది కొనలేకపోతున్నారు. పైగా శివార్లలో అవుటర్‌ బయట ఇప్పటికిప్పుడు వెళ్లి ఉండలేని పరిస్థితులు. ఇప్పుడు గేటేడ్‌ ప్లాటింగ్‌ వెంచర్‌లో స్థలం కొనుగోలు చేస్తే ఆ తర్వాత అక్కడికి వెళ్లి తమ అభిరుచికి తగ్గట్టుగా ఇల్లు కట్టుకుని విల్లాలో మాదిరి ఉండొచ్చు అనే ఉద్దేశంతో వీటికి క్రమంగా ఆదరణ పెరుగుతోంది. మొఖిల్లా, కొల్లూరు, శ్రీశైలం రహదారి, మహేశ్వరం, బెంగళూరు రహదారి మార్గం, మేడ్చల్‌, పటాన్‌చెరువైపు ఎక్కువగా ఈ తరహా వెంచర్లు వేశారు.

నిర్వహణ ఖర్చు భరిస్తేనే..
గేటెడ్‌ కమ్యూనిటీ ప్లాంటింగ్‌ వెంచర్లలో సౌకర్యాలకు తగ్గట్టుగానే నిర్వహణ ఖర్చులు ఉంటాయి. మొదటి రెండేళ్లపాటు స్థిరాస్తి యాజమానులే భరించినా ఆ తర్వాత నెలవారీ నిర్వాహణ ఖర్చులు కొనుగోలుదారులే చెల్లించాలి. క్లబ్‌ హౌస్‌, పచ్చదనం, ఈతకొలను, ఆట స్థలాలు, సెక్యూరిటీ తదితర ఖర్చులతో సాధారణ వెంచర్లతో పోలిస్తే ఇక్కడ రెట్టింపు ఛార్జీలను వసూలు చేస్తున్నారు. వీటిలో ఇష్టారీతిగా అపార్ట్‌మెంట్లు కట్టుకుంటున్నాం అంటే కుదరదు. సొసైటీ నిర్దేశించిన నిబంధనల మేరకు ఇల్లు కట్టుకోవాల్సి ఉంటుంది. వీటికి సిద్ధపడినా వారికి గేటెడ్‌ ప్లాటింగ్‌ వెంచర్లు అనుకూలం. మొదట్లో సాధారణ ప్లాట్‌తో పోలిస్తే ప్రీమియం ధర చెల్లించినా.. విలువ కూడా అదే స్థాయిలో ఉంటుందని రియల్టర్లు అంటున్నారు.

ఇతర రాష్ట్రాల రియల్టర్లు సైతం.. రియల్‌ ఎస్టేట్‌ అనగానే సాధారణంగా ఇళ్లు, కార్యాలయాలు, వాణిజ్య నిర్మాణాలను దేశవ్యాప్తంగా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ప్లాటింగ్‌ వెంచర్లు, స్థలాల క్రయ విక్రయాలు సైతం దీని పరిధిలోకి వస్తాయి. భవిష్యత్తు దృష్ట్యా కొనుగోలుదారులు స్థలాల మీద పెట్టుబడులు పెడుతుంటారు. తెలుగు రాష్ట్రాల స్థిరాస్తి సంస్థలే కాకుండా బయటి వాళ్లూ వెంచర్లు వేస్తున్నారు.


దారి వదులుతూ..
- ఎన్‌. జైదీప్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు, క్రెడాయ్‌ హైదరాబాద్‌

గేటెడ్‌ ఓపెన్‌ ప్లాటింగ్‌ వెంచర్ల పోకడ ఐదేళ్ల క్రితం మొదలైన ఇటీవల ఈ తరహా ప్లాటింగ్‌ బాగా పెరిగింది. భూముల ధరల పెరగడంతో కొన్న స్థలం గేటెడ్‌ కమ్యూనిటీ అయితే భద్రంగా ఉంటుందనే ధీమా. ఇందులో కొన్నవారికి తప్ప మిగతావారికి ప్రవేశం ఉండదు. ప్రైవసీ ఉంటుంది. గేటెడ్‌ కమ్యూనిటీలపై ఇదివరకు పలు వివాదాలు తలెత్తడంతో కొత్తగా వేస్తున్నవారు జాగ్రత్త పడుతున్నారు. వెనక ఉన్న వెంచర్లు, కాలనీలు, భూముల కోసం గేటెడ్‌ వెంచర్లు వేసేవారే ఒకవైపు నుంచి 40 అడుగుల రహదారిని వదిలి పెడుతున్నారు. హెచ్‌ఎండీఏ నిబంధనల మేరకు వెంచర్లు వేస్తున్నారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని