హరిత కట్టడాలు..!

హరిత భవనాల నిర్మాణంలో తెలంగాణ ఆరో స్థానంలో నిలిచింది. 41.43 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో 106 ప్రాజెక్ట్‌లు పర్యావరణ హితమైనవని లీడర్‌షిష్‌ ఇన్‌ ఎనర్జీ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ డిజైన్‌(లీడ్‌) రేటింగ్‌ పొందాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రేటింగ్‌ సంస్థతో కలిసి గ్రీన్‌ బిజినెస్‌ సర్టిఫికేషన్‌(జీబీసీఐ) ఇండియా మూడేళ్లుగా మొదటి పది స్థానాల్లో ఉన్న రాష్ట్రాల జాబితాను ప్రకటిస్తోంది. మహారాష్ట్ర కోటి చదరపు మీటర్లపైగా విస్తీర్ణం కలిగిన 373 ప్రాజెక్ట్‌లు లీడ్‌ ధ్రువీకరణతో మొదటి స్థానంలో నిలిచింది.

Published : 25 Jan 2020 02:31 IST

విస్తీర్ణం పరంగా ఆరో స్థానంలో తెలంగాణ

ఈనాడు, హైదరాబాద్‌: హరిత భవనాల నిర్మాణంలో తెలంగాణ ఆరో స్థానంలో నిలిచింది. 41.43 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో 106 ప్రాజెక్ట్‌లు పర్యావరణ హితమైనవని లీడర్‌షిష్‌ ఇన్‌ ఎనర్జీ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ డిజైన్‌(లీడ్‌) రేటింగ్‌ పొందాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రేటింగ్‌ సంస్థతో కలిసి గ్రీన్‌ బిజినెస్‌ సర్టిఫికేషన్‌(జీబీసీఐ) ఇండియా మూడేళ్లుగా మొదటి పది స్థానాల్లో ఉన్న రాష్ట్రాల జాబితాను ప్రకటిస్తోంది. మహారాష్ట్ర కోటి చదరపు మీటర్లపైగా విస్తీర్ణం కలిగిన 373 ప్రాజెక్ట్‌లు లీడ్‌ ధ్రువీకరణతో మొదటి స్థానంలో నిలిచింది.

మన భవనాలన్నీ పాతరోజుల్లో ఎక్కువగా పర్యావరణహితంగా ఉండేవి. సహజసిద్ధంగా గాలి వెలుతురు వచ్చేలా ఇళ్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, కార్యాలయాల నిర్మాణాలు చేపట్టేవారు. నిర్వహణ వ్యయం పరిమితంగా ఉండేది. పట్టణీకరణ, భూముల ధరలు పెరగడంతో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ నిర్మాణాలు చేపట్టడం మొదలైనప్పటికీ నుంచి గాలి వెలుతురు కోసం విద్యుత్తుపై ఆధారపడడం మొదలైంది. పగలు సైతం విద్యుత్తు దీపాలు వెలగాల్సిందే. ఏసీల వినియోగం పెరిగింది. అధిక విద్యుత్తు వినియోగంతో విడుదలవుతున్న కాలుష్య ఉద్గారాలు పర్యావరణానికి తీవ్ర హాని చేస్తున్నాయి. కొత్త భవనాల నిర్మాణం పర్యావరణంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. భవనాల కోసం పచ్చదనంపై వేటు పడుతోంది. దీంతో ఈ భవనాల్లో నివసిస్తున్నవారు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి దశలో హరిత భవనాల ప్రాధాన్యత పెరిగింది. కొనుగోలుదారులు సైతం వీటివైపు మొగ్గు చూపుతుండడంతో నిర్మాణదారులు హరిత నిర్మాణ ప్రాజెక్ట్‌లను అభివృద్ధి చేస్తున్నారు. ప్రభుత్వ భవనాలు సైతం పర్యావరణహితంగా కడుతున్నారు ప్రాజెక్ట్‌ డిజైన్‌ దశ నుంచే పర్యావరణహితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ తరహా చేపట్టే ప్రాజెక్ట్‌కు అంతర్జాతీయంగా, దేశీయంగా వేర్వేరు సంస్థలు రేటింగ్‌ ఇస్తున్నాయి. ఏటా రేటింగ్‌ పొందుతున్న ప్రాజెక్ట్‌ల సంఖ్య పెరుగుతుండడం విశేషం.
* 2018లో దేశవ్యాప్తంగా 899 ప్రాజెక్ట్‌లు లీడ్‌ రేటింగ్‌ పొందాయి.  2019 డిసెంబరు నాటికి ఈ సంఖ్య 3200కి పెరిగింది. 24.81 మిలియన్‌ చ.మీ. విస్తీర్ణం నుంచి ఏకంగా 1.45 బిలియన్‌ చదరపు అడుగులకు పెరిగింది. 2020 నాటికి 10 బిలియన్ల చదరపు అడుగులకు చేరుకోవాలనేది లక్ష్యం. 


ఇలా చేస్తే సరి..

* నిర్మాణం చేపట్టే చోట జలాశయాలు మట్టితో పూడ్చేయకుండా వాటిని సంరక్షించుకోవాలి.
* సిమెంట్‌, ఇసుక ప్లాస్టరింగ్‌ స్థానంలో ప్రత్యామ్నాయంగా జిప్సమ్‌ ప్లాస్టరింగ్‌ చేయవచ్చు. దీంతో 50 శాతం నీటి వాడకం తగ్గుతుంది.
* క్యూరింగ్‌కు నీటి వాడకం స్థానంలో క్యూరింగ్‌ కాంపౌండ్‌ వాడొచ్చు. ఫలితంగా నీటి వినియోగం గణనీయంగా తగ్గుతుంది.
* పరిసరాల్లో పచ్చదనం పెంపొందించేందుకు రీసైక్లింగ్‌ నీటిని వాడేలా ఎస్‌టీపీల ఏర్పాటు ఉండాలి.
* ప్రాజెక్ట్‌లోని రహదారుల నిర్మాణానికి, వాహనాలు నిలిపే పార్కింగ్‌ ప్రాంతాల్లోని ఫ్లోరింగ్‌కు ఇటుకలు, ఫ్లైయాష్‌ ఉపయోగించుకోవచ్చు. ఫ్లైయాష్‌తో సిమెంట్‌ వాడకం గణనీయంగా తగ్గుతుంది. పైగా ఫ్లైయాష్‌తో ఇంటీరియర్స్‌ వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉంటుంది.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని