మార్కెట్‌ పురోగమనమే!

కొత్త సంవత్సరంలో మార్కెట్‌ నెమ్మదించింది.. ఇప్పటివరకు ఉన్న అభిప్రాయం.. నాలుగురోజుల క్రితం ప్రముఖ సంస్థ కొత్త ప్రాజెక్ట్‌ ప్రారంభం రోజే సగం యూనిట్లు బుక్‌ అయ్యాయంటే మార్కెట్‌ డిమాండ్‌ ఏ మాత్రం తగ్గలేదని సూచిస్తోంది. మాంద్యం ప్రభావం కూడా పెద్దగా లేదు అనేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో పదినెలల కాలంలో పెరిగిన రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయమే నిదర్శనం. ఇప్పటివరకు ధరలు తగ్గుతాయని ఎదురుచూస్తున్న వారు ఇప్పుడేం చేయాలి? మార్కెట్లో ఇళ్ల సరఫరా ఎక్కువగా లేకపోవడం.. డిమాండ్‌ స్థిరంగా ....

Published : 15 Feb 2020 02:04 IST

అనుమతుల దశలో పలు ప్రాజెక్ట్‌లు

కొత్త సంవత్సరంలో మార్కెట్‌ నెమ్మదించింది.. ఇప్పటివరకు ఉన్న అభిప్రాయం.. నాలుగురోజుల క్రితం ప్రముఖ సంస్థ కొత్త ప్రాజెక్ట్‌ ప్రారంభం రోజే సగం యూనిట్లు బుక్‌ అయ్యాయంటే మార్కెట్‌ డిమాండ్‌ ఏ మాత్రం తగ్గలేదని సూచిస్తోంది. మాంద్యం ప్రభావం కూడా పెద్దగా లేదు అనేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో పదినెలల కాలంలో పెరిగిన రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయమే నిదర్శనం. ఇప్పటివరకు ధరలు తగ్గుతాయని ఎదురుచూస్తున్న వారు ఇప్పుడేం చేయాలి? మార్కెట్లో ఇళ్ల సరఫరా ఎక్కువగా లేకపోవడం.. డిమాండ్‌ స్థిరంగా కొనసాగుతుండటంతో ధరలు దిగిరావడం లేదని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం నిలకడగా ఉన్నా మున్ముందు పెరగడమే తప్ప తగ్గడం ఉండదని అంటున్నారు. ప్రస్తుతం చాలా ప్రాజెక్ట్‌లు అనుమతుల దశలో ఉన్నాయి.

ఈనాడు, హైదరాబాద్‌

స్థిరాస్తి లావాదేవీలు ఎక్కువగా హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో జరుగుతున్నాయి. స్థిరమైన ప్రభుత్వం రెండోసారి ఏర్పడడంతో రాష్ట్రంలోని ఐటీ, ఐటీ ఆధారిత, ఇతర పరిశ్రమలు రాజధాని నగరంతో పాటూ చుట్టు పక్కల జిల్లాల్లో ఏర్పాటుకు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే పలు పరిశ్రమలు వేలకోట్ల రూపాయలను పెట్టుబడులు పెట్టాయి. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధిపై అంచనాలతో అక్కడ స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. గత ఏడాది జనవరితో ముగిసిన కాలానికి రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం రూ.4574 కోట్ల నుంచి ఈసారి రూ.5261 కోట్లకు పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.  
నలుదిక్కులా..
* రంగారెడ్డి జిల్లాలో అవుటర్‌ రింగ్‌ రోడ్డు చుట్టూ నిర్మాణాలు, స్థలాల విక్రయాల జోరు కొనుసాగుతున్నాయి. ఈ జిల్లా వ్యాప్తంగా పదినెలల వ్యవధిలో రిజిస్ట్రేషన్ల ఆదాయమే రూ. రెండువేల కోట్లు వచ్చాయి. ఐదేళ్ల క్రితం రాష్ట్రం మొత్తం ఆదాయంతో ఇది సమానం. నిర్మాణాల పరంగా వేగం పెరగడంతో హైదరాబాద్‌ సౌత్‌లో దూకుడు పెరిగింది. శివార్లలో డెవలపర్లు కొత్త ప్రాజెక్ట్‌లను ప్రకటిస్తున్నారు.
* హైదరాబాద్‌ పశ్చిమం ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో ఇటీవల పలు సంస్థలు తమ కార్యాలయాల ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. కొత్తగా వచ్చేవారు ఇక్కడే కావాలంటున్నారు. ఐటీ సంస్థలన్నీ ఇక్కడ కేంద్రీకృతం అయి ఉండటంతో పెద్ద సంస్థలు తమ ప్రీమియం ప్రాజెక్ట్‌లను కొత్తగా ఇక్కడే చేపడుతున్నాయి. కొండాపూర్‌లో 3750 యూనిట్ల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. పూర్తికావొచ్చిన ప్రాజెక్ట్‌ల్లోనూ విక్రయాలు ఆశాజనకంగా ఉన్నట్లు స్థిరాస్తి వర్గాలు ప్రకటిస్తున్నాయి.
* నగరానికి చేరువలో ఉన్న యాదగిరిగుట్ట క్షేత్రం అభివృద్ధికి సర్కారు ప్రత్యేక చర్యలు చేపట్టడం, వరంగల్‌-హైదరాబాద్‌ పారిశ్రామిక కారిడార్‌ కావడంతో ఈ మార్గంలో పెద్ద ఎత్తున స్థిరాస్తి వెంచర్లు ఏర్పాటయ్యాయి. కొత్తవి భారీగా పుట్టుకొస్తున్నాయి. పెట్టుబడి దృష్ట్యా ఎక్కువ మంది ఇక్కడ కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు.
* బెంగళూరు జాతీయ రహదారి మార్గంలో ప్రభుత్వం ఇప్పటికే ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తి క్లస్టర్‌ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఏరోస్పేస్‌ రంగం, లాజిస్టిక్‌ హబ్స్‌, భవిష్యత్తులో టౌన్‌షిప్స్‌ ఇక్కడ వచ్చే అవకాశం ఉండడంతో ఈ ప్రాంతంలో కొత్త వెంచర్లు వస్తున్నాయి. శ్రీశైలం, సాగర్‌ మార్గంలో ఫార్మాసిటీ, లాజిస్టక్‌ హబ్స్‌ ఏర్పాటుతో ఈ ప్రాంతాల్లో మార్కెట్‌ మున్ముందు మరింత పుంజుకునే అవకాశం ఉంది.

ధరలు పెరగకూడదంటే..
* ప్రస్తుతం మార్కెట్లో సరఫరా తక్కువగా ఉంది. డిమాండ్‌ అధికంగా ఉంది. దీంతో స్థిరాస్తుల ధరలు పెరగడమే తప్ప ఎక్కడా దిగిరావడం లేదు. కొనుగోలుదారుడికి మేలు జరగాలంటే ఎక్కువ ప్రాజెక్ట్‌లు నిర్మాణంలో ఉండాలని క్రెడాయ్‌ ప్రతినిధి ఒకరు అన్నారు.
* ఇప్పటికీ పలు కొత్త ప్రాజెక్ట్‌లు స్థానిక సంస్థలు, పర్యావరణం, రెరా ఇలా వేర్వేరు సంస్థల పరిధిలో అనుమతుల దశలో ఉన్నాయి. వీటి రాకతో మార్కెట్లో సరఫరా పెరిగితే కొనుగోలుదారులకు బేరమాడే అవకాశం ఉంటుంది. అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సరసమైన ధరలో ఇల్లు లభిస్తుంది.
* నిర్మాణదారులు సైతం కొత్త ప్రాజెక్ట్‌లు ఎక్కువగా చేపట్టాలంటే ప్రస్తుతం అవుటర్‌ చెంత అవకాశం ఉంది. గ్రిడ్‌రోడ్లు లేక అటువైపు ఎక్కువగా వెళ్లడం లేదు. వెళ్లినవారు సొంతంగా రహదారులు వేయాల్సి వస్తోంది. ప్రభుత్వం వెంటనే గ్రిడ్‌రోడ్లు వేస్తే నగరంలో 50వేల ఎకకరాలకుపైగా భూ లభ్యత ఏర్పడుతుంది. లభ్యత పెరిగితే భూముల ధరలు భారీగా పెరగకుండా ఉంటాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని