ఆ ఇంట్లో వాన నీరే ఏడాదంతా..!

వేసవి వచ్చిందంటే నీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడే ఇళ్లే ఎక్కువ. కొందరైతే వర్షాకాలంలోనూ ట్యాంకర్లను ఆశ్రయిస్తుంటారు. ఈ సీజన్‌లో అప్పుడే బోర్లలో నీటి లభ్యత తగ్గుతూ వస్తోంది. ఏప్రిల్‌, మే వచ్చేసరికి నీటి కోసం ప్రతి కుటుంబం భారీగా ఖర్చుచేస్తే తప్ప మనగడ సాగదు. వాన నీటి సంరక్షణతో నీటిఎద్దడి సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. చెప్పడమే కాదు స్వయంగా ఆచరిస్తున్నవారు మన మధ్యలోనే ఉన్నారు....

Updated : 14 Mar 2020 05:02 IST

ఈనాడు, హైదరాబాద్‌

వేసవి వచ్చిందంటే నీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడే ఇళ్లే ఎక్కువ. కొందరైతే వర్షాకాలంలోనూ ట్యాంకర్లను ఆశ్రయిస్తుంటారు. ఈ సీజన్‌లో అప్పుడే బోర్లలో నీటి లభ్యత తగ్గుతూ వస్తోంది. ఏప్రిల్‌, మే వచ్చేసరికి నీటి కోసం ప్రతి కుటుంబం భారీగా ఖర్చుచేస్తే తప్ప మనగడ సాగదు. వాన నీటి సంరక్షణతో నీటిఎద్దడి సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. చెప్పడమే కాదు స్వయంగా ఆచరిస్తున్నవారు మన మధ్యలోనే ఉన్నారు. అలాంటి వారిలో ఇటీవల దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించిన కల్పనా రమేశ్‌ ఒకరు. నీటి సంరక్షణపై ఎంతోకాలంగా పనిచేస్తూ మహిళా దినోత్సవం రోజు ప్రధాని మోదీ సామాజిక ఖాతాలు నిర్వహించే బాధ్యతలు దక్కించుకున్న ఏడుగురు మహిళల్లో ఒకరైన కల్పనా రమేశ్‌ ఇంటీరియర్‌ డిజైనర్‌ కూడా. కొన్నేళ్లుగా తన ఇంట్లో నీటి సంరక్షణకు అనుసరిస్తున్న పద్ధతులను, అందరూ ఆచరించ తగ్గ విధానాలను ఆమె ‘ఈనాడు స్థిరాస్తి’తో పంచుకున్నారు.

యూఎస్‌లో నుంచి హైదరాబాద్‌ తిరిగివచ్చాక కొంతకాలం అద్దె ఇంట్లో ఉండేవాళ్లం. నీటికోసం ఎక్కువగా ట్యాంకర్లపైనే ఆధారపడాల్సి వచ్చేది. గచ్చిబౌలిలోని రోలింగ్‌హిల్స్‌ గేటెడ్‌ కమ్యూనిటీలో ఎనిమిదేళ్ల క్రితం ఇల్లు కట్టుకునేప్పుడు నీటి ట్యాంకర్ల అవసరం లేకుండా ఉండాలని నిర్ణయించుకుని ఆ మేరకే ఇంటి డిజైన్‌ రూపొందించుకున్నాను.

* నీటి నిల్వ కోసం ఇంటి వెనకాల అందరి ఇళ్ల మాదిరే ఒక సంప్‌తో పాటూ వాననీటిని నిల్వ చేసుకునేందుకు ప్రత్యేకంగా ఇంటిలోపల కోర్ట్‌యార్డ్‌ కింద 30వేల లీటర్లు నీరు పట్టేలా సంప్‌  తవ్వించాను. వర్షపు నీరు ఇందులోకి చేరడానికంటే ముందే 8 x4 x 3 అంగుళాల పరిమాణంలో నిర్మించిన రెండు ఛాంబర్లలో నీటి వడపోతకు ఏర్పాటు చేశాం.

* మొదటి ఛాంబర్‌లో అడుగు భాగంలో బొగ్గు వేశాం. నీటిని శుభ్రం చేసే గుణం దీనికి ఉంది. బొగ్గుపై స్టీల్‌ మెష్‌ కప్పి పైన ఇసుక వేశాం. ఆపై కొంత ఖాళీ స్థలం వదిలేశాం. ఇంటిపైన కురిసిన వర్షం పైపుల ద్వారా వచ్చి ఇక్కడ పడుతుంది. మొదటి ఛాంబర్‌లోంచి నీరు రెండో ఛాంబర్‌లోకి చేరుతుంది. ఇందులో 50 శాతం బొగ్గుతో నింపి ఉంటుంది. ఇక్కడి నుంచి నీరు ట్యాంకులోకి చేరుతుంది. ట్యాంకులోకి చేరే దగ్గర గొట్టానికి వస్త్రం కడితే ఫిల్టర్‌లాగా పనిచేస్తుంది.

* వాననీటి ట్యాంకు నిండి వృథా పోకుండా ఆ నీరు రోజువారీ వాడుకునే సంప్‌లోకి వెళ్లేలా ఏర్పాట్లు చేశాం. ఈ రెండు, ఇంటిపైన ట్యాంకులు నిండిన తర్వాత మిగిలిన నీరు ఇంటి బయట తవ్వించిన ఇంకుడు గుంతలలోకి మళ్లిస్తాం.

* ఎనిమిదేళ్లలో ఇప్పటివరకు నీటి ట్యాంకర్లు కొనే అవసరం రాలేదు. జలమండలి ఇచ్చే నీరు ఈ రోజు వచ్చిందా రాలేదా అనే ఎదురుచూపులు లేవు. మా ఇంట్లో వర్షపునీటినే తాగుతున్నాం. ఎక్కడో దూరం నుంచి వచ్చే నీటితో పోలిస్తే వర్షపు నీరే మంచిదని మా పరీక్షల్లో తేలింది. యాసిడ్‌ వర్షాలు కురుస్తుంటాయనే భయాలు ఉన్నాయి. మేం నీటిలోని 20 అంశాలపై పరీక్షలు నిర్వహిస్తే సరఫరా చేసే నీటి కంటే వాననీరే మెరుగని తేలింది. రెండుమూడేళ్లకోసారి వడపోత ఛాంబర్లను శుభ్రం చేస్తే సరి.

* ఏటా వర్షాకాలంలో సగటున 45-50 రోజుల పాటూ వర్షం పడుతుంది. వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఇంటిపైన 70-80వేల లీటర్ల వర్షపు నీరు లభ్యత ఉంటుంది. ఈ నీటిని ఒడిసి పడితే ట్యాంకర్లతో, బోర్‌వెల్స్‌తో పనే ఉండదు. మా ఇంట్లో బోర్‌వెల్‌ లేనే లేదు. నిల్వ చేసుకున్న వర్షపునీరే ఏడాది పాటూ సరిపోతుంది. రెండురోజులకోసారి కమ్యూనిటీ బోర్‌ నుంచి నీరు సరఫరా చేస్తారు.

* ఇంటి వెనకాల బండలు కడిగిన నీరు, ఏసీల నుంచి వచ్చేనీరు వృథా పోకుండా భూమిలోకి ఇంకేలా చిన్న ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి పైన యథావిధిగా బండలు వేశాం. చిన్నగా వదిలిన ఖాళీ స్థలం నుంచి నీరు లోపలికి వెళుతుంది. ఒక్క బొట్టు కూడా బయటకుపోదు.


నీటి పునర్వినియోగం..

* ఇంట్లో ఉపయోగించిన నీటిని శుద్ధి చేసి దానిని మాత్రమే మొక్కలకు డ్రిప్‌ పద్ధతిలో అందిస్తున్నాం. ఇంటి బయట, వెనకాల, ఇంటిపైన అన్ని మొక్కలకు శుద్ధిచేసిన నీరే. మొక్కల కుండీల నుంచి కారిన నీరు సీసాల్లోకి చేరేలా చేసి ఆ నీటిని తిరిగి మొక్కలకే పోస్తాను.

* ఇంటికి కావాల్సిన కూరగాయల్లో కొంతవరకు పైనే సాగు చేసుకుంటున్నాం. టమాటా, మిర్చి, క్యాప్సికం, బెండ, దొండ, చిక్కుడు, ఆకుకూరలు, లెమన్‌గ్రాస్‌, సపోటా, నిమ్మకాయ వరకు పలు రకాలను ఉన్న కొద్ది స్థలంలోనే పెంచుతున్నాను. నాకు ఇదే వ్యాయామం. ఉదయంపూట ఎండతో శరీరానికి డి విటమిన్‌ అందుతుంది. ప్రతి ఇంటిపైన మొక్కలను పెంచుకోవచ్చు. వేసవిలో ఇంట్లో చల్లదనం కూడా. వంటగది వ్యర్థాలను ఎక్కువగా మొక్కలకు వేస్తుంటాను.

* ఇంటిపైన 3 కిలోవాట్ల సౌరపలకలు ఏర్పాటు చేసుకున్నాం. దీంతో మా ఇంటి కరెంట్‌ అవసరాలను చాలావరకు సౌర విద్యుత్తే తీరుస్తుంది. పలితంగా కరెంట్‌ బిల్లు చాలావరకు ఆదా అవుతుంది. మా కరెంట్‌ బిల్లు రూ.400 మాత్రమే వస్తుంది.


ప్రతి ఇంట్లోనూ చేసుకోవచ్చు..

మాదాపూర్‌లో నీటికొరతతో ఏటా ట్యాంకర్ల కోసం చేసే ఖర్చు రూ.20కోట్ల వరకు ఉంటుంది. ఇక్కడ భవనాల పైకప్పు విస్తీర్ణం 145 చదరపు కి.మీ. కురిసే వర్షాన్ని ఒడిసిపడితే ఏటా 114 కోట్ల లీటర్లు అవుతుంది. నగరంలో ఏటా ట్యాంకర్ల కోసం రూ.200కోట్లు వ్యయం చేస్తున్నారు. మన ఇంటిపైన పడే వర్షపునీటిని సంరక్షించుకోగలిగితే చాలా డబ్బులు ఆదా అయినట్లే.

* అపార్ట్‌మెంట్లలో నీటి సమస్యలు ఎక్కువ. భవనంపైన పడిన వర్షపునీరు వచ్చే పైపునకు ఫిల్టర్‌ ఏర్పాటు చేసుకుని నీటిని నేరుగా సంప్‌లోకి మళ్లించుకోవచ్చు. సంప్‌ నిండిన తర్వాత నీటిని వృథాగా వదిలేయకుండా ఎండిపోయిన బోర్‌వెల్‌లోకి మళ్లించవచ్చు. ఇక్కడ ఒక చిట్కా. మొదట ఒక ట్యాంక్‌నీటిని బోర్‌వెల్‌లోకి వదలండి. నిండి నీరు బయటకు వస్తుందంటే పెద్దగా ఉపయోగం ఉండదు. అదే నీరు ఇంకుతోందంటే వర్షపునీటిని మళ్లించవచ్చు.  అపార్ట్‌మెంట్‌ కామన్‌ ప్రాంతాల్లో 4 x 4 x 5 అడుగుల పరిమాణంలో ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసుకోవచ్చు.

* అపార్ట్‌మెంట్ల బయట ఇంజక్షన్‌ బోర్‌వెల్స్‌ వేసుకుని వర్షపునీరు ఇంకేలా చేయవచ్చు. ఇంకుడుగుంతలు తవ్విస్తున్నా.. ఏటా శుభ్రం చేయకపోతే ఉపయోగం ఉండదు. అందుకే ఇందులోనూ వినూత్న మోడల్స్‌ను సిద్ధం చేశాం.

* కొత్తగా ఇల్లు కట్టుకునేవారు స్థలం లేదని వదిలేయకుండా కారు పార్కింగ్‌ స్థానంలోనే 10 x 20 x 6 అడుగుల విస్తీర్ణంలో 34వేల లీటర్లు సామర్థ్యం కలిగిన ట్యాంకును ఏర్పాటు చేసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని