నిర్మాణరంగంపై కరోనా దెబ్బ

స్థిరాస్తి రంగం లాక్‌డౌన్‌తో పూర్తిగా స్తంభించిపోయింది. ఎక్కడి నిర్మాణాలు అక్కడే ఆగిపోయాయి. నిర్మాణకార్మికులు ఇప్పటికే చాలామంది సొంతూళ్లకు బయలుదేరగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు క్యాంపులకే పరిమితం అయ్యారు. దీంతో తవ్వి వదిలేసిన సెల్లార్లు, మధ్యలో ఆగిపోయిన గోడలు, పూర్తికాని ప్లాస్టరింగ్‌తో పలు ప్రాజెక్ట్‌లు దర్శనమిస్తున్నాయి. నిర్మాణం పూర్తిచేసి ఈనెల, వచ్చేనెలలో అందజేస్తామని ఇచ్చిన హామీలు నెరవేరే పరిస్థితి లేదు. ఎప్పటికి పూర్తవుతోందో చెప్పలేని స్థితిలో కొనుగోలుదారులు గృహప్రవేశాలు వాయిదా వేసుకుంటున్నారు. కొవిడ్‌-19 స్థిరాస్తి రంగానికి చాలా పెద్ద దెబ్బ అని..

Updated : 28 Mar 2020 06:27 IST

‘ఈనాడు’తో తెలంగాణ క్రెడాయ్‌ ఛైర్మన్‌ జి.రాంరెడ్డి
ఈనాడు, హైదరాబాద్‌

స్థిరాస్తి రంగం లాక్‌డౌన్‌తో పూర్తిగా స్తంభించిపోయింది. ఎక్కడి నిర్మాణాలు అక్కడే ఆగిపోయాయి. నిర్మాణకార్మికులు ఇప్పటికే చాలామంది సొంతూళ్లకు బయలుదేరగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు క్యాంపులకే పరిమితం అయ్యారు. దీంతో తవ్వి వదిలేసిన సెల్లార్లు, మధ్యలో ఆగిపోయిన గోడలు, పూర్తికాని ప్లాస్టరింగ్‌తో పలు ప్రాజెక్ట్‌లు దర్శనమిస్తున్నాయి. నిర్మాణం పూర్తిచేసి ఈనెల, వచ్చేనెలలో అందజేస్తామని ఇచ్చిన హామీలు నెరవేరే పరిస్థితి లేదు. ఎప్పటికి పూర్తవుతోందో చెప్పలేని స్థితిలో కొనుగోలుదారులు గృహప్రవేశాలు వాయిదా వేసుకుంటున్నారు. కొవిడ్‌-19 స్థిరాస్తి రంగానికి చాలా పెద్ద దెబ్బ అని.. దీని ప్రభావం ఆరునెలలా, ఏడాది ఉంటుందా ఇప్పుడే చెప్పలేమని క్రెడాయ్‌ తెలంగాణ ఛైర్మన్‌ జి.రాంరెడ్డి అన్నారు. ప్రస్తుత పరిస్థితులపై ఆయనతో ‘ఈనాడు’ ముఖాముఖి.

లాక్‌డౌన్‌ ప్రభావం
కరోనాతో కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి. ప్రపంచంలోని ప్రతిరంగంపైన ప్రభావం పడింది. అందులో స్థిరాస్తి రంగమూ ఉంది. ఇంతకంటే పెద్ద దెబ్బ భవిష్యత్తులో చూస్తామని కూడా అనుకోవడం లేదు. నేనైతే రావొద్దనే కోరుకుంటున్నా. వ్యవసాయం తర్వాత ఎక్కువమంది ఆధారపడేది నిర్మాణరంగంపైనే. హైదరాబాద్‌లోనే లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. వీరందరికీ ఇప్పుడు పనిలేకుండా పోయింది. రావాల్సిన చెల్లింపులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. మరోవైపు ఉద్యోగుల జీతాలు చెల్లించాలి. క్యాంపుల్లో ఉండే కార్మికుల బాగోగులు చూసుకోవాలి. నిర్మాణ పనులు ఎక్కడివి అక్కడే ఆగిపోవడం, ఎప్పుడు ప్రారంభం అవుతాయో చెప్పలేని దశలో కొన్నింటి పనులు మొదటి నుంచి చేయాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్‌లు ఆలస్యం కావడం తీవ్ర నష్టాలనే మిగులుస్తాయి.

ఇది ఎంతకాలం...
లాక్‌డౌన్‌ 21 రోజులు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్‌ 15 వరకు పొడిగించింది. పరిస్థితి చూస్తుంటే ఏప్రిల్‌ 30, ఆ తర్వాత కూడా ఉండొచ్చు.  కరోనా ప్రభావం తగ్గిన తర్వాత మార్కెట్లు కుదురుకోవడానికి ఆరునెలలు, ఏడాదైనా పట్టొచ్చు.

భవిష్యత్తులో హైదరాబాద్‌ మార్కెట్‌..
కరోనా ప్రభావం మార్కెట్లపై తాత్కాలికమే. సర్వం బంద్‌ కావడంతో కొనే వాతావరణం లేదు. పరిస్థితులు సర్దుకున్నాక గాడిలో పడుతుంది. ప్రతి ఒక్కరికి నివాసం కావాలి. ఆ మేరకు డిమాండ్‌ ఎప్పుడూ ఉంటుంది. ఆర్థికమాంద్యం తొలగిపోగానే మెరుగైన మౌలిక వసతులు ఉన్న హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ మళ్లీ పుంజుకుంటుంది.

సాంకేతికత బాటలో..
గప్రస్తుతం జనాలు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇలాంటి సమయంలో ఇళ్లు కొంటారా అని అడిగితే ఏ సమాధానం వస్తుందో ఊహించడం పెద్ద కష్టం కాదు. ఈ పరిస్థితుల నుంచి జనం తేరుకోవాలి. అందుకు రెండు వారాలైనా పట్టే అవకాశం ఉంది. ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుందామని స్థిరాస్తులపై విచారణలు చేయడం మొదలెడితే అప్పుడు టెక్నాలజీ తోడ్పాటుతో వారికి సేవలు అందించవచ్చు. వర్చువల్‌ రియాల్టీ, అగ్‌మెంటెడ్‌ రియాల్టీలతో ఇంట్లో కూర్చుని ల్యాప్‌టాప్‌, లేదంటే మొబైల్‌లోనే ప్రాజెక్ట్‌ స్వరూపాన్ని కళ్లకు కట్టినట్లు చూపించవచ్చు. కొన్ని సంస్థలు ఈ తరహా సాంకేతికతను అందిపుచ్చుకునే పనిలో ఉన్నాయి. లాక్‌డౌన్‌ ఎక్కువకాలం కొనసాగితే ఇలాంటివన్నీ తెరమీదకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి చాలావరకు స్థిరాస్తి సంస్థలు వ్యాపారం కంటే కుటుంబం, సంస్థ, అందులో ఉద్యోగుల గురించిన ఆలోచనల వరకే పరిమితం అయ్యాయి. క్యాంపుల్లో ఉన్న కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నాం.

నిర్మాణదారులకు భరోసా..
ప్రస్తుత పరిస్థితిని ఎవరూ ఊహించింది కాదు. కరోనా నుంచి దేశం బయటపడాలంటే లాక్‌డౌన్‌ అనివార్యమైన పరిస్థితుల్లో నిర్మాణదారులు సైతం మానసికంగా సంసిద్ధం కావాలి. చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. తట్టుకోవాల్సిందే. ఏదో అయిపోయిందనే కంటే రేపు పరిస్థితులు గాడిలో పడ్డాక ఏం చేయాలో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని