నిర్మాణ రంగంలో పలు మార్పులు!

లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపుతో నిర్మాణ రంగం ఊపిరిపీల్చుకుంది. కూలీల కొరత వేధిస్తున్నా అందుబాటులో ఉన్నవారితో గృహ నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. దాదాపు 45 రోజులు స్తంభించిన లావాదేవీలు.. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు తిరిగి పనిచేస్తుండటంతో స్థిరాస్తి మార్కెట్‌లో సందడి మొదలైంది.

Published : 09 May 2020 03:54 IST

కొత్త ప్రాజెక్ట్‌ల రీడిజైన్‌

ఈనాడు, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపుతో నిర్మాణ రంగం ఊపిరిపీల్చుకుంది. కూలీల కొరత వేధిస్తున్నా అందుబాటులో ఉన్నవారితో గృహ నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. దాదాపు 45 రోజులు స్తంభించిన లావాదేవీలు.. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు తిరిగి పనిచేస్తుండటంతో స్థిరాస్తి మార్కెట్‌లో సందడి మొదలైంది. ప్రారంభానికి ప్రణాళిక సిద్ధమై లాక్‌డౌన్‌తో వాయిదా పడిన ప్రాజెక్ట్‌లను కొందరు రీడిజైన్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
* అంతకుముందు ఇంటి నుంచి పనిచేయడం ఐటీ వంటి కొన్ని రంగాలకే పరిమితం కాగా.. లాక్‌డౌన్‌తో దాదాపు అన్ని రంగాలకు  చేరువ అయింది. ప్రస్తుతం ఎక్కువ మంది ఇళ్లలో ప్రత్యేకంగా గది లేకపోవడంతో.. రెండు పడక గదుల్లో ఒకదాన్ని ఆఫీసు పని కోసం ఉపయోగిస్తున్నారు. సరైన ఫర్నీచర్‌ లేక.. ఉన్నా ఇంట్లో తగిన స్థలం లేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటిని గమనించిన బిల్డర్లు తమ భవిష్యత్తు ప్రాజెక్ట్‌ల్లో ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా సదుపాయాలు ఉండేలా, కుదిరితే ఒక చిన్న గది ఉండేలా డిజైన్లు ఆలోచిస్తున్నారు. గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఇప్పటివరకు ఉన్న క్లబ్‌ హౌస్‌, ఈత కొలను, ఆట స్థలాలు, పిల్లల సంరక్షణ కేంద్రాలతోపాటు అదనంగా కమ్యూనిటీలోంచే పని చేసేందుకు అవసరమైన కార్యాలయ సదుపాయాలపై దృష్టి సారించబోతున్నారు.
* తమ వద్ద సొమ్ములో కొంత దాచుకుని మిగతా దాంతోనే ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారు మార్కెట్‌ ధర కంటే తక్కువ వస్తేనే మొగ్గు చూపుతారని తమ సర్వేలో తేలినట్లు పలువురు బిల్డర్లు తెలిపారు. మరికొందరు లాక్‌డౌన్‌లోనూ ఆదుకున్నది ఇల్లే కాబట్టి ఎంత ఖర్చైనా పర్వాలేదు.. మంచి గృహం తీసుకోవాలకుంటున్నట్లు వివరించారు. వీరు ఇంటిపై కొంచెం ఎక్కువైనా వెచ్చిస్తారని, సౌకర్యాలు ముఖ్యమన్నారు. వీరి ఆలోచనలకు తగ్గట్టుగా.. బడ్జెట్‌లో ఇళ్ల నిర్మాణాలు చేయగలిగితే మార్కెట్‌కు ఢోకా ఉండదని నిర్మాణదారుల అంచనా.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని