మీరు ఇల్లు కొనండి.. మేం సాయం చేస్తాం

కొత్తగా ఇల్లు కొనే సామాన్య, మధ్యతరగతివాసులకు కేంద్రం మరోసారి శుభవార్త మోసుకొచ్చింది. సొంతంగా కట్టుకున్నా, కట్టిన ఇల్లు కొన్నా గరిష్ఠంగా రూ.2.69 లక్షలు సాయం చేయనుంది. గృహ రుణం తీసుకుని మొదటిసారి ఇల్లు కొంటున్నవారికిది వర్తిస్తుంది. రుణం అసలు నుంచి ఈ మొత్తాన్ని మినహాయిస్తారు దీంతో ఈఎంఐ రూ.2,500 వరకు తగ్గనుంది. నెలవారీ కొంత ఆర్థిక భారం తగ్గనుండడం

Published : 23 May 2020 02:09 IST

స్థిరాస్తి కొనుగోలుదారులకు కేంద్రం భరోసా
పీఎంఏవై రుణ ఆధారిత రాయితీ పథకం కింద గరిష్ఠంగా రూ.2.69 లక్షల లబ్ధి
ఈనాడు, హైదరాబాద్‌

కొత్తగా ఇల్లు కొనే సామాన్య, మధ్యతరగతివాసులకు కేంద్రం మరోసారి శుభవార్త మోసుకొచ్చింది. సొంతంగా కట్టుకున్నా, కట్టిన ఇల్లు కొన్నా గరిష్ఠంగా రూ.2.69 లక్షలు సాయం చేయనుంది. గృహ రుణం తీసుకుని మొదటిసారి ఇల్లు కొంటున్నవారికిది వర్తిస్తుంది. రుణం అసలు నుంచి ఈ మొత్తాన్ని మినహాయిస్తారు దీంతో ఈఎంఐ రూ.2,500 వరకు తగ్గనుంది. నెలవారీ కొంత ఆర్థిక భారం తగ్గనుండడం పెద్దఊరట. మూడేళ్లుగా కేంద్రం ఈ సాయం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన రుణ ఆధారిత రాయితీ పథకం (పీఎంఏవై సీఎల్‌ఎస్‌ఎస్‌) కింద చేస్తోంది. ఈ ఏడాది మార్చితో గడువు ముగిసింది. ఉద్దీపన ప్యాకేజీల్లో భాగంగా ఈ పథకాన్ని వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. కొనుగోలుదారుల్లో విశ్వాసం పెంపొందించేందుకు.. నిర్మాణ రంగానికి ఈ పథకం ఉపయోగపడనుంది.
2017 మే నుంచి అమలులో..: రుణ ఆధారిత సబ్సిడీ పథకం కింద హైదరాబాద్‌లో మూడేళ్లుగా చాలా మంది ప్రయోజనం పొందారు. 2017 మే నుంచి ఈ పథకం అమల్లోకి రావడంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 3.3 లక్షల కుటుంబాలు ప్రయోజనం పొందాయి.

ఇలా పని చేస్తుంది..
హైదరాబాద్‌కు చెందిన రాకేశ్‌ 2018 ఫిబ్రవరిలో ఒక బ్యాంకు నుంచి రూ.25 లక్షల గృహరుణం తీసుకున్నారు. అర్హత ఉండడంతో రుణ మంజూరు సమయంలోనే రుణ ఆధారిత రాయితీ పథకానికి బ్యాంకులోనే దరఖాస్తు చేసుకున్నారు. వడ్డీ రాయితీ నిబంధనల ప్రకారం 2019 ఏప్రిల్‌లో వీరికి కేంద్రం రూ.2.69 లక్షల మొత్తం బ్యాంకుకు జమ అయ్యింది. బ్యాంకు ఈ మొత్తాన్ని రుణం అసలు నుంచి మినహాయించడంతో వడ్డీ భారం తగ్గింది. రూ.25 లక్షల అసలు కాస్త రూ.22.31 లక్షలకు తగ్గిపోయింది. దీంతో అప్పటి వరకు రూ.20,700 వరకు ఉన్న ఈఎంఐ కాస్త రూ.18,500కు తగ్గిపోయింది. ఒకేసారి నెలకు రెండు వేల వరకు తగ్గడంతో ఆ కుటుంబానికి ఆర్థికంగా పెద్ద ఊరట లభించింది. రుణం తీరే వరకు కలిగిన ప్రయోజనం లెక్కిస్తే ఆరు లక్షల వరకు ఉంటుంది. కొందరికి రూ.2.35 లక్షలు, మరికొందరికి రూ.1.90 లక్షల సాయమే అందింది.
ఎవరు అర్హులు..
* రూ.3 లక్షల నుంచి రూ.18 లక్షల రూపాయల లోపు కుటుంబ వార్షికాదాయం ఉన్నవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
* మహిళల పేరున స్థిరాస్తి రిజిస్ట్రేషన్‌ అయి ఉండాలి. భార్యాభర్తలిద్దరి పేరున ఉన్నా అర్హులే.
* కుటుంబ వార్షికాదాయాలను బట్టి రూ.3లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఎల్‌ఐజీ, రూ.6 లక్షలు నుంచి రూ.12 లక్షల వరకు ఎంఐజీ-1, రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు ఎంఐజీ-2 పరిధిలోకి వస్తారు.
* ఇంటి విస్తీర్ణం కూడా చూస్తారు. గరిష్ఠంగా 200 చ.మీ.(2152 చ.అ) కార్పెట్‌ ఏరియా వరకు రాయితీ అర్హత ఉంది.
* ఈ పథకాన్ని మరో ఏడాది పొడిగించడంతో మధ్యతరగతి కొనుగోలుదారుల్లో విశ్వాసం పెరిగేందుకు, నిర్మాణరంగానికి మేలు చేస్తుందని సీబీఆర్‌ఈ ఇండియా ఛైర్మెన్‌ అన్షుమన్‌ మ్యాగజైన్‌ అన్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు