ఏకగవాక్ష అనుమతులకు అడుగులు

జీహెచ్‌ఎంసీ సహా శివార్లలోని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో భవనాల నిర్మాణాల అనుమతుల కోసం ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన టీఎస్‌ బీపాస్‌ విధానం జూన్‌ 2 నుంచి అమల్లోకి రానుందని అధికారులు స్పష్టం చేసినట్లుగా క్రెడాయ్‌ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌ రామ్‌చంద్రారెడ్డి తెలిపారు.

Updated : 30 May 2020 03:00 IST

 నిర్మాణదారులకు ఎంతో ఊరట
 క్రెడాయ్‌ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చంద్రారెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ సహా శివార్లలోని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో భవనాల నిర్మాణాల అనుమతుల కోసం ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన టీఎస్‌ బీపాస్‌ విధానం జూన్‌ 2 నుంచి అమల్లోకి రానుందని అధికారులు స్పష్టం చేసినట్లుగా క్రెడాయ్‌ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌ రామ్‌చంద్రారెడ్డి తెలిపారు. ఈ విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అమలు చేయబోతున్నారన్నారు. ఈ కొత్త విధానంపై తమ నిర్మాణదారులకు అవగాహన కల్పించేందుకు డీటీసీపీ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారులతో క్రెడాయ్‌ వెబినార్‌ నిర్వహించింది. ఈ నేపథ్యంలో టీఎస్‌ బీపాస్‌తో అనుమతుల ప్రక్రియలో రాబోయే మార్పులను రామ్‌చంద్రారెడ్డి ‘ఈనాడు’కు తెలిపారు.
* ఆన్‌లైన్‌లో అనుమతుల విధానం ఉన్నప్పటికీ వేర్వేరు విభాగాల అనుమతులకు నిర్మాణదారులే తిరగాల్సి వచ్చేది. ఇందుకు 6-9 నెలలు పట్టేది. టీఎస్‌ బీపాస్‌ విధానంలో చేసే దరఖాస్తు ఏకగవాక్ష విధానంలో వేర్వేరు శాఖలకు వెళుతుంది. ప్రస్తుతానికి అగ్నిమాపక, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీలను చేర్చారు. త్వరలోనే జలమండలి, మురుగునీటి వ్యవస్థ, విద్యుత్తు పంపిణీ సంస్థను చేర్చనున్నారు. అనుమతి కోరుతూ, నిర్మాణ ప్లాన్‌ను ఆన్‌లైన్లో అప్‌లోడ్‌ చేసిన రోజు నుంచి ఏమైనా అభ్యంతరాలున్నా, పత్రాలన్నీ లేకపోయినా ఆయా విభాగాలు 15 రోజుల్లోపే తెలియజేయాలి. లేకపోతే ఆ విభాగం అనుమతి ఇచ్చినట్లు భావిస్తారు.

 

70 గజాల లోపు స్వీయ ధ్రువీకరణ చాలు
* 70 చదరపు గజాలు, అంతకంటే తక్కువ విస్తీర్ణంలో ఇల్లు కట్టుకొనేవారికి అనుమతి అక్కర్లేదని కొత్త విధానం చెబుతోంది. స్వీయ ధ్రువీకరణతో ఇంటి సర్వే నంబరు, నిర్మాణ విస్తీర్ణం, యజమాని వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసి ఒక రూపాయి ఫీజు చెల్లిస్తే చాలు.
* 70 చ.గజాలపైన 500 చ.మీ. విస్తీర్ణం లోపు ఉండి జి+2 లోపు ఇల్లు కట్టుకునేవారు ప్లాన్‌ అప్‌లోడ్‌ చేస్తే చాలు. స్వీయ ధ్రువీకరణతో ఆర్కిటెక్ట్‌, కన్సల్టెంట్లు ఇచ్చిన డిజైన్‌ ఎలాంటి ఉల్లంఘనలు లేకుండా నిబంధనల మేరకే ఉన్నాయనే విశ్వాసం ఉంటే నిర్మాణం మొదలు పెట్టొచ్చు. అనుమతి ఇవ్వడానికి ముందు టాస్క్‌ఫోర్స్‌ బృందం నిర్మాణ స్థలాన్ని పరిశీలిస్తుంది.
* జి+3, ఆపై నిర్మాణాలు చేపట్టేవారు అన్ని పత్రాలు అప్‌లోడ్‌ చేసి అనుమతి పొందాల్సి ఉంటుంది. 21 రోజుల్లో వీరికి అనుమతి ఇస్తారు. లేకపోతే ఇచ్చినట్లే భావించాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని