కొనుగోలుదారుల అడుగులు ఎటు!

ఇళ్లు, స్థలాల ధరలు మున్ముందు ఎలా ఉండొచ్చు? మరికొన్నాళ్లు వేచిచూస్తే ధరలు దిగి వస్తాయా? కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌ కారణంగా రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టేవారి ఆలోచనలు కొన్నాళ్లుగా ఇలాగే సాగుతున్నాయి. అయితే హైదరాబాద్‌ మార్కెట్‌లో పాత ప్రాజెక్టుల్లో అమ్ముడుపోకుండా మిగిలిన ఇళ్లు చాలా తక్కువని.. ప్రస్తుత ప్రాజెక్టుల్లో 80 వరకు ప్ల్లాట్లను ఇదివరకే విక్రయించారని స్థిరాస్తి వర్గాలు పేర్కొంటున్నాయి. కొవిడ్‌ అనంతరం నిర్మాణ వ్యయం పెరిగినా.. ధరలు పెంచకుండా అంతకుముందున్న

Updated : 18 Jul 2020 02:56 IST

ఈనాడు, హైదరాబాద్‌

ఇళ్లు, స్థలాల ధరలు మున్ముందు ఎలా ఉండొచ్చు? మరికొన్నాళ్లు వేచిచూస్తే ధరలు దిగి వస్తాయా? కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌ కారణంగా రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టేవారి ఆలోచనలు కొన్నాళ్లుగా ఇలాగే సాగుతున్నాయి. అయితే హైదరాబాద్‌ మార్కెట్‌లో పాత ప్రాజెక్టుల్లో అమ్ముడుపోకుండా మిగిలిన ఇళ్లు చాలా తక్కువని.. ప్రస్తుత ప్రాజెక్టుల్లో 80 వరకు ప్ల్లాట్లను ఇదివరకే విక్రయించారని స్థిరాస్తి వర్గాలు పేర్కొంటున్నాయి. కొవిడ్‌ అనంతరం నిర్మాణ వ్యయం పెరిగినా.. ధరలు పెంచకుండా అంతకుముందున్న ధరలకే విక్రయిస్తున్నామని నిర్మాణదారులు అంటున్నారు. ఇంతకంటే తగ్గే అవకాశం లేదని, కొత్త ప్రాజెక్ట్‌ల్లో ధరలు పెరగడమే తప్ప తగ్గడం ఉండదని.. ఆర్థికంగా వెసులుబాటు ఉన్నవారు ఇప్పుడు కొనుగోలు చేయడమే మేలని క్రెడాయ్‌ హైదరాబాద్‌ సూచిస్తోంది.
  రెరా గణాంకాలిలా...
ఇళ్లు, ప్లాట్లు విక్రయించాలంటే రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ ఆథారిటీ(రెరా)లో రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి. రెరా గణాంకాల ప్రకారం 2017లో 219 ప్రాజెక్టుల్లో 21,665 ఇళ్ల నిర్మాణానికి అనుమతి పొందారు. మార్చి 2020కి ఈ సంఖ్య 448 ప్రాజెక్టులకు పెరిగింది. ఇళ్ల సంఖ్య 31,559కి చేరుకుంది. 5.34 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో అపార్ట్‌మెంట్లు, విల్లా ప్రాజెక్టులను నిర్మాణదారులు చేపట్టారు. దాదాపుగా రూ.31,379 కోట్ల పెట్టుబడులు పెట్టారు. పనులు వేర్వేరు దశల్లో ఉన్నాయి. మొదలు పెట్టిన  వాటిలో కొన్ని ప్రాజెక్టులు పూర్తికాగా.. మరికొన్ని పురోగతి దశలో ఉన్నాయి. విక్రయాలు మాత్రం ఈ ప్రాజెక్టుల్లో 80 శాతం కొవిడ్‌కు ముందే పూర్తయ్యాయని నిర్మాణదారులు అంటున్నారు. మిగిలిన ఇళ్లు చాలా తక్కువని చెబుతున్నారు.
  సిమెంట్‌ ధరల మోత  
కొవిడ్‌కు ముందు సిమెంట్‌ బస్తా రూ.270 వరకు ఉంటే ప్రస్తుతం రూ.370 వరకు ఉంది. ఒక దశలో రూ.400 వరకు వెళ్లిందని నిర్మాణదారులు చెబుతున్నారు. నిర్మాణ వ్యయం 10-15 శాతం పెరిగిందని చెబుతున్నారు.  కార్మికుల కొరతతో ఎక్కువ వేతనాలు చెల్లించాల్సి వస్తోందని.. వీరిని రప్పించేందుకు అదనపు ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. కొవిడ్‌ తర్వాత నిర్మాణ వ్యయం పెరిగినా ప్రస్తుత ప్రాజెక్టుల్లో తాము ధరలు ఏం పెంచలేదని నిర్మాణదారులు చెబుతున్నారు. కొత్తగా ప్రారంభించే ప్రాజెక్టుల్లో వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని ధర నిర్ణయిస్తారు కాబట్టి పెరగడానికే అవకాశాలు ఉన్నాయన్నారు.

స్పందనే ఆధారం:  ఇతర నగరాల్లో పెట్టుబడి దృష్ట్యా కొని ఎక్కువ ధర రాగానే విక్రయిస్తుంటారు. హైదరాబాద్‌ మార్కెట్‌లో అలా కాదు. అత్యధిక శాతం ఇళ్లు కావాల్సినవారు మాత్రమే కొనుగోలు చేస్తుంటారు. ఈ కారణంగానే కొనుగోలుదారుల స్పందనను బట్టి దశల వారీగా నిర్మాణాలను చేపడుతుంటారు. ఒక ప్రాజెక్ట్‌లో మొదట ఒకటి రెండు టవర్లు కట్టిన తర్వాత స్పందనను బట్టి తర్వాత టవర్ల నిర్మాణం చేపడుతుంటారు.

సరఫరా తక్కువ
యూనిట్ల సరఫరా ఎక్కువ ఉండి డిమాండ్‌ లేకపోతే ధరలు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ సరఫరానే తక్కువగా ఉందన్నది బిల్డర్ల మాట. కొవిడ్‌కు ముందు ఆకాశహర్మ్యాల ప్రాజెక్ట్‌లకు ఏడాదికాలంపాటు పర్యావరణ అనుమతులు రాలేదు. ఆ సమయంలో సరఫరా కొంత తగ్గింది. జీఎస్‌టీ అనంతరం పూర్తయిన ఇళ్లనే ఎక్కువ మంది కొనుగోలు చేశారు. పూర్తయిన వాటికి జీఎస్‌టీ వర్తించదనే నిబంధనతో అప్పుడే అమ్ముడుకాకుండా మిగిలిపోయిన ఇళ్లన్నీ విక్రయించారు. ఇప్పుడు అందుబాటులో ఉన్నవి తక్కువ. ఇప్పటికీ అందుబాటు ధరలు హైదరాబాద్‌లోనే ఉన్నాయని.. ఇంతకంటే తగ్గే సూచనలు లేవని క్రెడాయ్‌ హైదరాబాద్‌ ఉపాధ్యక్షుడు వేణువినోద్‌ అన్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని