ఇల్లు.. మరింత శోభాయమానంగా..

ఇల్లంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న మార్బుల్‌.. ఖరీదైన ఫర్నీచర్‌.. లగ్జరీ యాక్సెసరీస్‌.. మాడ్యూలార్‌ కిచెన్‌ అన్నట్లుగా చాలామంది ఆలోచనలు ఉండేవి. మారుతున్న పరిస్థితుల్లో ఇంటి నిర్మాణంలోనూ మార్పులు అనివార్యంగా మారాయి. ప్రస్తుతం నగరంలోని ఇళ్లలో పగలు రాత్రి తేడా లేకుండా వెలుగుతున్న విద్యుత్తు దీపాలతో కాంతి కాలుష్యం పెరిగింది. భవనాల్లో ఉపయోగించే ఇనుము, ఇంట్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్‌, ఎలక్ట్రిక్‌ ఉపకరాణాల వినియోగంతో ఎలక్ట్రో మాగ్నటిక్‌ కాలుష్యం స్థాయిలు పెరిగి అనారోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి.

Published : 19 Sep 2020 02:40 IST

బహుళ అంతస్తుల భవనాల్లో హరిత అందాలు

రేటింగ్‌లోనూ వీటికే ప్రాధాన్యం

ఇల్లంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న మార్బుల్‌.. ఖరీదైన ఫర్నీచర్‌.. లగ్జరీ యాక్సెసరీస్‌.. మాడ్యూలార్‌ కిచెన్‌ అన్నట్లుగా చాలామంది ఆలోచనలు ఉండేవి. మారుతున్న పరిస్థితుల్లో ఇంటి నిర్మాణంలోనూ మార్పులు అనివార్యంగా మారాయి. ప్రస్తుతం నగరంలోని ఇళ్లలో పగలు రాత్రి తేడా లేకుండా వెలుగుతున్న విద్యుత్తు దీపాలతో కాంతి కాలుష్యం పెరిగింది. భవనాల్లో ఉపయోగించే ఇనుము, ఇంట్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్‌, ఎలక్ట్రిక్‌ ఉపకరాణాల వినియోగంతో ఎలక్ట్రో మాగ్నటిక్‌ కాలుష్యం స్థాయిలు పెరిగి అనారోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ఇళ్లలో ప్రతికూల ప్రభావాన్ని తగ్గించి సానుకూలత పెంచే హరిత భవనాల వైపు నేటితరం ఇంటి కొనుగోలుదారులు మొగ్గు చూపుతున్నారు.

డిజైన్‌.. రేటింగ్‌..

పెద్ద ప్రాజెక్ట్‌ల్లో ఇల్లు కొంటున్నప్పుడు కొనుగోలుదారులు హరిత భవనాలకే ప్రాధాన్యమిస్తున్నారు. ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ) ఏ రేటింగ్‌ ఇచ్చిందని వాకబు చేస్తున్నారు. కొనుగోలుదారుల అవసరాలకు తగ్గట్టుగా డిజైన్లలో మార్పులతో స్థిరాస్తి సంస్థలు రేటింగ్‌ పొందుతున్నాయి. వీరు దరఖాస్తులో పొందుపర్చే అంశాల ఆధారంగా ఐజీబీసీ పాయింట్లను కేటాయిస్తుంది. నిర్మాణానికి ఉపయోగిస్తున్న సామగ్రి, సాంకేతిక తదితర అంశాల ఆధారంగా రేటింగ్‌ ఇస్తారు. పాయింట్లను బట్టి ప్రాజెక్ట్‌కు సిల్వర్‌, గోల్డ్‌, ప్లాటినమ్‌ రేటింగ్‌ జారీ చేస్తారు. వాస్తుతో పాటూ ఈ మధ్య ప్రాజెక్ట్‌ల్లో రేటింగ్‌కు పెద్దపీట వేస్తుండటం నిర్మాణ రంగంలో వచ్చిన మార్పునకు నిదర్శనం.

రేటింగ్‌ ఇచ్చే ముందు...

* నీటిని ఎంత మేరకు ఆదా చేస్తున్నారు.. ఎలాంటి విధానాలు ప్రాజెక్ట్‌ల్లో అవలంబిస్తున్నారనే విషయాలు కూడా రేటింగ్‌ను నిర్ధారిస్తాయి.

* పెద్ద ప్రాజెక్ట్‌లన్నీ కూడా భవనాలపై పడిన నీటిని నిల్వ చేసుకునేలా భారీ ట్యాంకులను భూగర్భంలో నిర్మిస్తున్నాయి.

* వర్షం పడిన సమయంలోనే శుద్ధి చేసి వీటిలోకి తరలిస్తున్నారు. దీంతో పాటూ బోర్‌వెల్స్‌ రీఛార్జ్‌ అయ్యేలా.. ఇంజెక్షన్‌ వెల్స్‌ నిర్మించి ఇంకుడు గుంతలను నిర్మిస్తున్నారు. ఈ రూపంలో వాన నీటిని సంరక్షిస్తున్నారు.

* గృహ అవసరాలకు ఉపయోగించే నీటిని తిరిగి ఉపయోగించుకునేలా మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ శుద్ధి చేసిన నీటిని గార్డెనింగ్‌కు, ఇంట్లో టాయిలెట్‌ ఫ్లషింగ్‌కు ఉపయోగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలితంగా నీరు చాలావరకు తిరిగి వినియోగం అవుతుంది. రేటింగ్‌లో ఇది ముఖ్య భూమికను పోషిస్తుంది.

* ఇళ్లలో విద్యుత్తు వినియోగం వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా వేసవిలో కరెంట్‌ వినియోగం అధికంగా ఉంటోంది. వనరులను పొదుపుగా వినియోగించడం, తిరిగి పునర్వినియోగం వరకు రేటింగ్‌లో అన్ని చూస్తారు. విద్యుత్తు లైట్లు ఇష్టారాజ్యంగా కాకుండా ప్రమాణాల మేరకు ఏర్పాటు చేస్తారు. సెన్సర్లను వినియోగించి విద్యుత్తు ఆదా చేయడం, వేసవిలో నేరుగా సూర్యకాంతి ఇంట్లోకి రాకుండా షేడింగ్‌ పరికరాలు ఏర్పాటు వరకు చాలా చూస్తారు.

* ఇంటి లోపల ఉపయోగించే రంగులు పిల్లలు, గర్భిణులకు హాని చేస్తుంటాయి. అందులో విడుదలయ్యే రసాయనాలతో చాలామందికి అలర్జీలు వస్తుంటాయి. రేటింగ్‌ పొందిన ఇళ్లలో ఐజీబీసీ సర్టిఫై చేసిన రంగులను వాడటం ద్వారా ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.


మార్కెట్లో లభ్యం..

భవనాల నిర్మాణంతో పర్యావరణంపై కల్గే ప్రతికూల ప్రభావాలను తగ్గించే ఉత్పత్తులు, సాంకేతికతలను సీఐఐ-ఐజీబీసీ గ్రీన్‌ప్రో గుర్తింపు జారీ చేస్తుంది. ఐదేళ్లలో దాదాపు వెయ్యి వరకు హరిత భవనాల్లో వాడదగిన ఉత్పత్తులు దేశీయంగా అందుబాటులోకి వచ్చాయి. వందకుపైగా కంపెనీలు గ్రీన్‌ప్రో గుర్తింపు పొందాయి. నీరు తక్కువగా వినియోగించే కమోడ్‌ల దగ్గరినుంచి, హాని చేయని రంగుల వరకు ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయి. ఇప్పుడు మన ఉత్పత్తులే ఎగుమతి అవుతున్నాయి. అవగాహన పెరగడంతో నిర్మాణదారులు క్రమంగా స్థానిక ఉత్పత్తుల వినియోగానికి మొగ్గుచూపుతున్నారు. సాధారణ భవనాలతో పోలిస్తే హరిత భవనాల వ్యయం కొంచెం ఎక్కువే అయినా.. దీర్ఘకాలంలో పొందే ప్రయోజనాలతో పోలిస్తే ఈ వ్యయం పెద్ద ఎక్కువేం కాదు అంటున్నారు నిపుణులు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని