వినేదెవరు.. చెప్పేదెవరు

శంకర్‌పల్లి ప్రాంతానికి చెందిన దరఖాస్తుదారుడు ఒకరు 2012లో లేఅవుట్‌లో స్థలాల క్రమబద్ధీకరణ(ఎల్‌ఆర్‌ఎస్‌)కు దరఖాస్తు చేసుకున్నారు. రూ.41,819 నగదు చెల్లించారు. దస్త్రాలు కాలిపోయాయని మరోసారి పత్రాలు సమర్పించాలని అప్పట్లో కోరితే రెండోసారి కూడా అందజేశారు. కానీ సమయం అయిపోయిందని అపరిష్కృతంగా ఉంచారు. ఇప్పటివరకు దీనిపై ఎటూ తేల్చలేదు. ఇప్పుడు మళ్లీ దరఖాస్తు చేయాలా? గతంలో చెల్లించిన ఛార్జీల మాటేమిటి? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం కరవైంది. హెల్ప్‌లైన్‌ నంబర్లకు ఫోన్‌ చేస్తే తెలియదంటున్నారు. అధికారులను అడిగితే మాకే స్పష్టత లేదంటున్నారు.

Published : 10 Oct 2020 07:03 IST

అనధికార లేఅవుట్ల సందేహాలు తీరేదెలా?
క్రమబద్ధీకరణ దరఖాస్తుదారుల మల్లగుల్లాలు
ముందైతే అర్జీ పెట్టుకోండంటున్న అధికారులు
ఈనాడు, హైదరాబాద్‌

శంకర్‌పల్లి ప్రాంతానికి చెందిన దరఖాస్తుదారుడు ఒకరు 2012లో లేఅవుట్‌లో స్థలాల క్రమబద్ధీకరణ(ఎల్‌ఆర్‌ఎస్‌)కు దరఖాస్తు చేసుకున్నారు. రూ.41,819 నగదు చెల్లించారు. దస్త్రాలు కాలిపోయాయని మరోసారి పత్రాలు సమర్పించాలని అప్పట్లో కోరితే రెండోసారి కూడా అందజేశారు. కానీ సమయం అయిపోయిందని అపరిష్కృతంగా ఉంచారు. ఇప్పటివరకు దీనిపై ఎటూ తేల్చలేదు. ఇప్పుడు మళ్లీ దరఖాస్తు చేయాలా? గతంలో చెల్లించిన ఛార్జీల మాటేమిటి? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం కరవైంది. హెల్ప్‌లైన్‌ నంబర్లకు ఫోన్‌ చేస్తే తెలియదంటున్నారు. అధికారులను అడిగితే మాకే స్పష్టత లేదంటున్నారు.  గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులు సందేహాల నివృత్తికి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ముందైతే దరఖాస్తు చేసుకోవాలని, తరవాత ప్రభుత్వ ఆదేశాల మేరకు పరిష్కరిస్తామని చెబుతున్నారు.
ఇటీవల ప్రభుత్వం భూ క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్‌)ను అమలు చేసేందుకు మరోసారి ప్రకటన జారీ చేసింది. అనధికార లేఅవుట్లను క్రమబద్ధీకరించుకొనేందుకు అవకాశం కల్పించింది. దీంతో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భూ యజమానులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొనేందుకు బారులు తీరుతున్నారు. దరఖాస్తుల సమర్పణకు అక్టోబరు 15వ తేదీ తుది గడువు కావటంతో భారీగా దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే పది లక్షలు దాటాయి. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకుంటున్న వారిని పలు అనుమానాలు వెంటాడుతున్నాయి.  అక్రమ లే అవుట్‌ ఏది? గ్రామకంఠంలో ఇల్లు ఉంటే దరఖాస్తు చేసుకోవాలా? స్థలమైతేనా? అక్రమ లేఅవుట్‌ అయినప్పటికీ పంచాయతీ అనుమతిలో ఇప్పటికే ఇల్లు కట్టినట్లయితే వాటికి కూడా అర్జీ పెట్టుకోవాలా? వీటిలో చాలా సందేహాలకు స్పష్టమైన సమాధానం అధికారుల నుంచి కొరవడింది. సందేహాలను నివృతి చేసుకునేందుకు సంబంధిత కార్యాలయాల్లో ప్రత్యేకించి ఎవరూ అందుబాటులో లేరు. గడువు సమీపిస్తున్న సమయంలో తమకు ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం వెతికేందుకు భూ యజమానులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇదే అదనుగా రంగంలోకి దిగిన దళారులు/మధ్యవర్తులు ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారుల నుంచి భారీగా సొమ్ములు వసూలు చేస్తున్నారు. కొన్ని మీ-సేవ కేంద్రాల్లో నిర్ధేశించిన రుసుముకు మించి అధికంగా వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. వివరాలు తెలుసుకొని కొందరు హెల్ప్‌లైన్‌ నంబర్లకు ఫోన్లు చేస్తే ఎక్కడ దరఖాస్తు చేయాలి? ఎంత రుసుం చెల్లించాలి? ఏయే పత్రాలు జతచేయాలనే వివరాలు మాత్రమే ఇస్తున్నారు తప్ప స్థల యాజమానుల నిర్ధిష్టమైన సందేహాలు తీర్చడం లేదు. ఇ-మెయిల్‌ చేస్తే మెయిల్‌ అందింది అని సమాధానం వస్తోంది తప్పిస్తే అర్జీదారుల సందేహాలు మాత్రం నివృత్తి కావడం లేదని ఒక దరఖాస్తుదారుడు వాపోయారు. ఈ నేపథ్యంలో చాలామంది ఎదుర్కొంటున్న కొన్ని సందేహాలను క్రోడీకరించిన ‘ఈనాడు’ వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఈ కింది విధంగా సమాధానమిచ్చారు.

? ఎలాంటి స్థలాలకు ఎల్‌ఆర్‌ఎస్‌ అవసరం?

* జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో ఇంటి స్థలాలుగా విభజించిన భూమి ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుకు అర్హమైనది. అనధికార లేఅవుట్లు, గ్రామకంఠంలో ఇంటి నంబర్లతో రిజిస్టరయిన స్థలానికీ ఎల్‌ఆర్‌ఎస్‌ అవసరం. హైదరాబాద్‌ బాహ్య వలయ రహదారి ఆవల లేఅవుట్లలో ఉన్న ఫాంల్యాండ్లను క్రమబద్ధీకరించుకోవచ్చని అధికారులు తెలిపారు. వ్యవసాయ భూమిని రహదారుల సౌకర్యంతో ఫాంల్యాండ్‌గా మార్చుకున్నట్లయితే ఎల్‌ఆర్‌ఎస్‌ చేసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.
? చౌటుప్పల్‌లో లక్కారంలో ఇంటి స్థలముంది. 1996 లేఅవుట్‌. అప్పుడు 18 అడుగుల రోడ్డుంది. 30 అడుగులు ఉండాలంటున్నారు. మా భూమిని ఆమేర కోల్పోవాల్సిందేనా?
* అవును. నిబంధనల ప్రకారం 9 మీటర్లు (30అడుగులు) రోడ్డు. అవసరం.
? 2016లో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు చేశాం. నాలా ఛార్జీలు, ఇతర ఫీజు కట్టమని సందేశం వచ్చింది. అప్పుడు డబ్బు కట్టలేదు. ఇప్పుడు కడదామంటే అవకాశం లేదు. ఎలా?
* మీరు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వం మున్ముందు తీసుకునే మార్గదర్శకాల ప్రకారం పరిశీలన జరుగుతుంది.
? అసైన్డ్‌ భూమిని యజమాని ఇళ్ల స్థలాలుగా చేసి విక్రయించారు. పలువురు నిర్మాణాలు చేపట్టారు. ఇంటి పన్నూ చెల్లిస్తున్నారు. వాటి మధ్యనున్న ఖాళీ స్థలానికి ఎల్‌ఆర్‌ఎస్‌ చేసుకోవచ్చా?
* అసైన్డ్‌ భూమికి ఎల్‌ఆర్‌ఎస్‌ వర్తించదు.
? పారిశ్రామిక వాడలో ఉన్న ప్లాటుకు ఎల్‌ఆర్‌ఎస్‌ వర్తిస్తుందా?
*
వర్తించదు.
? లేఅవుట్‌లో ఖాళీ స్థలాన్ని ఎలా లెక్కించాలి. తక్కువ, ఎక్కువ ఉంటే రుసుము చెల్లించడం, జరిమానా చెల్లించడం నుంచి మినహాయింపు ఉంటుందా?
* అనధికార లేఅవుట్‌ మొత్తం విస్తీర్ణంలో ఖాళీ స్థలం 10 శాతం ఉండాలి. ఎంత మేర తక్కువ ఉంటే, ఆమేర ఖాళీ స్థలం ఛార్జీలు ఉంటాయి.


సొంతగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు

ప్రభుత్వం తీసుకొచ్చిన www.lrs.telangana.gov.in వెబ్‌సైట్‌ ద్వారా పౌరులు నేరుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మీ-సేవా కేంద్రం, సీజీజీ రూపొందించిన ‘ఎల్‌ఆర్‌ఎస్‌ 2020’ అనే మొబైల్‌ యాప్‌ ద్వారానూ దరఖాస్తు చేయొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని