ధరణితో రియల్‌ ఎస్టేట్‌కు మేలు

కొవిడ్‌ నుంచి స్థిరాస్తి మార్కెట్‌ కోలుకునే సమయంలో రిజిస్ట్రేషన్లు ఆగిపోవడం నిర్మాణ కార్యకలాపాలపై కొంతవరకు ప్రభావం చూపింది. లాక్‌డౌన్‌తో ఏప్రిల్‌, మే నెలలో పూర్తిగా కార్యకలాపాలు నిల్చిపోగా.. జూన్‌ నుంచి ఆన్‌లాక్‌ చేసినా కొవిడ్‌ భయాలు తగ్గకపోవడంతో లావాదేవీలు పెద్దగా జరగలేదు. కూలీల కొరతతో మొదట్లో 30 శాతం పనులే మొదలయ్యాయి. ఆగస్టు నాటికి పరిస్థితులన్నీ కుదుటపడి మార్కెట్‌లో కొనుగోళ్లు మొదలయ్యాయి.

Updated : 31 Oct 2020 05:53 IST

స్వాగతిస్తున్న స్థిరాస్తి సంస్థలు
కోర్టు కేసులుంటే వాటిని అనుసంధానించాలి
ఈనాడు, హైదరాబాద్‌

కొవిడ్‌ నుంచి స్థిరాస్తి మార్కెట్‌ కోలుకునే సమయంలో రిజిస్ట్రేషన్లు ఆగిపోవడం నిర్మాణ కార్యకలాపాలపై కొంతవరకు ప్రభావం చూపింది. లాక్‌డౌన్‌తో ఏప్రిల్‌, మే నెలలో పూర్తిగా కార్యకలాపాలు నిల్చిపోగా.. జూన్‌ నుంచి ఆన్‌లాక్‌ చేసినా కొవిడ్‌ భయాలు తగ్గకపోవడంతో లావాదేవీలు పెద్దగా జరగలేదు. కూలీల కొరతతో మొదట్లో 30 శాతం పనులే మొదలయ్యాయి. ఆగస్టు నాటికి పరిస్థితులన్నీ కుదుటపడి మార్కెట్‌లో కొనుగోళ్లు మొదలయ్యాయి. ప్రాజెక్టుల సందర్శన, కొత్త ఇళ్ల బుకింగ్‌లపై కొనుగోలుదారుల ఆసక్తి పెరిగింది. స్థిరాస్తి కొనుగోలు చేసినా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రద్దీ దృష్ట్యా కొవిడ్‌ భయంతో రిజిస్ట్రేషన్లు వాయిదా వేసుకున్నారు. కొందరు ముందుకొచ్చి చేసుకున్నా కార్యాలయాల్లో సిబ్బంది కొరతతో స్థిరాస్తి పత్రాలు అందేందుకు 15 రోజుల వరకు పట్టేది. ఎక్కువ మంది గృహ రుణాలతోనే స్థిరాస్తులు కొనుగోలు చేస్తుంటారు. కాబట్టి ఈ పత్రాలను బ్యాంకుకు అందజేస్తే అక్కడ తక్కువ మంది సిబ్బంది కావడంతో మూడు, నాలుగు రోజులు సమయం తీసుకునేవారు. మొత్తంగా ఈ పక్రియ పూర్తయ్యి తమ చేతికి సొమ్ము అందేందుకు మూడు వారాల వరకు సమయం పట్టేదని.. కొవిడ్‌కు ముందు మూడు నాలుగురోజుల్లోనే పత్రాలు.. ఆ మరుసటి రోజే చెక్‌ చేతికి అందేదని ఒక బిల్డర్‌ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్లు పూర్తిగా ఆగిపోవడంతో నగదు లభ్యత పూర్తిగా పడిపోయిందన్నారు. తమకు ఇబ్బందైనా పారదర్శకమైన విధానం కోసం భరిస్తున్నామని చెబుతున్నారు. రాష్ట్రంలో సగటున ఐదు వేల స్థిరాస్తులు రిజిస్ట్రేషన్లు అవుతుంటాయి. అత్యధికంగా రంగారెడ్డి, మేడ్చల్‌, హైదరాబాద్‌లోనే జరుగుతుంటాయి. ఈ నెలన్నరకు పైగా వ్యవధిలో దాదాపు రెండు లక్షల స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు నిల్చిపోయాయి. కొవిడ్‌తో మార్కెట్‌ మునుపటి మాదిరి దూకుడుగా లేదు కాబట్టి లక్షకుపైగా రిజిస్ట్రేషన్ల కోసం ఎదురుచూస్తున్నాయి.

ధరణి పోర్టల్‌ అందుబాటులోకి రావడంతో సోమవారం నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాబోతున్నాయి. మరి స్థలాలు, ఇళ్ల రిజిస్ట్రేషన్లు ఎప్పుడు? పదిహేను నుంచి ఇరవై రోజులు పడుతుందని సర్కారు చెబుతోంది. నవంబరు నెలాఖరుకు పూర్తి స్థాయిలో నగరంలో రిజిస్ట్రేషన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని రియల్టర్లు, డెవలపర్లు అంచనా వేస్తున్నారు. భూ సంస్కరణల్లో భాగంగా ధరణి కోసం సెప్టెంబరు 7 నుంచి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు నిలిపివేసిన విషయం తెలిసిందే. 54 రోజులుగా రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో కొనుగోలుదారుల నుంచి రావాల్సిన తుది మొత్తం రాక బిల్డర్లు తీవ్ర నగదు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. తాము ఇప్పుడు కొన్ని నెలల ఇబ్బంది పడినా.. భవిష్యత్తులో ధరణితో పారదర్శకమైన విధానంతో భూవివాదాలకు చెక్‌ పడుతుందని బిల్డర్లు ఆశాభావంతో ఉన్నారు.


పారదర్శకంగా..

ధరణితో భూముల వివరాలన్నీ అర చేతిలో అందుబాటులోకి వచ్చాయి. ఇదివరకు భూములకు సంబంధించి సమాచారం కావాలంటే నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. రెవెన్యూ సిబ్బందికి సమయం ఉండేది కాదు. వారి దగ్గర రికార్డులు లేకపోతే నాంపల్లిలోని ప్రధాన కార్యాలయానికి వెళ్లమనేవారు. ఇప్పుడు నిషేధిత భూములేవి, పట్టా భూములేవి అనేవి స్పష్టంగా ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చు. నిర్మాణం మొత్తం పూర్తయ్యాక, అందులో ఫ్లాట్లు విక్రయించాక స్థలం తమదని కేసులు వేస్తుండటంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ధరణితో క్లియర్‌ టైటిల్‌ దిశగా అడుగులు పడ్డాయి. యూఎస్‌లో కొనేవ్యక్తి, అమ్మే వ్యక్తి కలుసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. టైటిల్‌ గ్యారంటీ ఉంటుంది. స్థిరాస్తికి సంబంధించిన సమగ్ర సమాచారం ఉంటుంది. ధరణితో మున్ముందు ఈ దిశగా సమాచారం అందుబాటులో ఉంటుంది.  స్థిరాస్తులపై ఎవైనా కోర్టు కేసులు ఉంటే వాటి సమాచారం కూడా పొందుపరిస్తే ఉపయోగకరం. ప్రభుత్వం దీన్ని పరిశీలించాలి. రిజిస్ట్రేషన్లు ఆగడంతో నిర్మాణ రంగంలో నగదు లభ్యత తగ్గింది.

-కె.ఇంద్రసేనారెడ్డి, ఉపాధ్యక్షుడు, క్రెడాయ్‌ తెలంగాణ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని