నగరం చుట్టూ ఆధునిక పట్టణాలు

ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ‘ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ పాలసీ -2020’తో హైదరాబాద్‌ శివారు ప్రాంతాల ముఖచిత్రం మారిపోనుంది. చుట్టూ పనిచేసే చోటే నివాసం(వాక్‌ టూ వాక్‌) ఉండేలా ఆధునిక పట్టణాలు అందుబాటులోకి రానున్నాయి. పెట్టుబడులు తరలి వచ్చి ఉపాధి అవకాశాలు మెరుగు పడే అవకాశముంది. తద్వారా నగరంపై ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ...

Published : 07 Nov 2020 02:44 IST

అన్ని వర్గాలకు గృహ సముదాయాలు
సమీకృత టౌన్‌షిప్‌లతో మారనున్న శివార్ల ముఖచిత్రం

ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ‘ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ పాలసీ -2020’తో హైదరాబాద్‌ శివారు ప్రాంతాల ముఖచిత్రం మారిపోనుంది. చుట్టూ పనిచేసే చోటే నివాసం(వాక్‌ టూ వాక్‌) ఉండేలా ఆధునిక పట్టణాలు అందుబాటులోకి రానున్నాయి. పెట్టుబడులు తరలి వచ్చి ఉపాధి అవకాశాలు మెరుగు పడే అవకాశముంది. తద్వారా నగరంపై ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక భాగ్యనగరానికి మణిహారంగా మారిన బాహ్య వలయ రహదారి(ఓఆర్‌ఆర్‌) మరింత కీలకంగా మారనుంది.
ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో రాబోయే పది నుంచి ఇరవయ్యేళ్లలో జనాభా మరింత పెరిగే అవకాశముంది. మరికొన్నేళ్లలో వాహనాల సంఖ్యా కోటి మార్కు చేరుతుందని అంచనా. ట్రాఫిక్‌ రద్దీకి అనుగుణంగా రోడ్లను విస్తరించేందుకు అవకాశం లేదు. రాబోయే రోజుల్లో పరిస్థితిని గుర్తించిన హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) అప్రమత్తమైంది. హెచ్‌ఎండీఏ పరిధి 7,228 చ.కిమీలు. గ్రేటర్‌ను మినహాయిస్తే 5,965 చ.కిమీ ఆరు జిల్లాల పరిధిలోకి వస్తుంది. బాహ్య వలయ రహదారి(ఓఆర్‌ఆర్‌) కేంద్రంగా ఈ ఆరు జిల్లాల పరిధిలో పనిచేసే చోట నివాసముండేలా సమీకృత టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేయడమే పరిష్కారమని నిర్ణయించారు.

13 ప్రాంతాల ఎంపిక: సమీకృత టౌన్‌షిప్‌ల అభివృద్ధికి ఓఆర్‌ఆర్‌ను ఆనుకుని ఉన్న ఆదిభట్ల, బొంగుళూరు, ఘట్‌కేసర్‌, గుండ్లపోచంపల్లి, కీసర, కోకాపేట్‌, మేడ్చల్‌, పటాన్‌చెరు, పెద్ద అంబర్‌పేట, శామీర్‌పేట్‌, తెల్లాపూర్‌, తుక్కుగూడ, తిమ్మాపూర్‌ను ఎంపిక చేశారు. ఆయా ప్రాంతాల్లో కనీసం వంద ఎకరాలను సేకరించి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారు. తుది అనుమతికి ప్రభుత్వానికి పంపించారు.
ఆదరణ దక్కాలంటే రవాణా వ్యవస్థతోనే..
టౌన్‌షిప్‌లకు ఆదరణ రావాలంటే రవాణా వ్యవస్థ కీలకం. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నగరానికి ఉత్తరాన మేడ్చల్‌- శామీర్‌పేట్‌, తూర్పు పోచారం-ఘట్‌కేసర్‌, దక్షిణాన కొత్తూరు-షాద్‌నగర్‌, పడమర సంగారెడ్డి-శంకర్‌పల్లి ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలని సూచిస్తున్నారు. ‘సమీకృత బృహత్తర ప్రణాళిక’ను అందుబాటులోకి తేవాల్సిన అవసరముంది. గచ్చిబౌలి నుంచి ఓఆర్‌ఆర్‌ మీదుగా విమానాశ్రయం, మియాపూర్‌-పటాన్‌చెరు, ఎల్బీనగర్‌-హయత్‌నగర్‌ వరకు మెట్రోను పొడిగించాలని.. ఎంఎంటీఎస్‌నూ అందుబాటులోకి తేవాలని సూచిస్తున్నారు.
అన్నీ ఒకే చోట.. పర్యావరణ హితంగా..
ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ పాలసీ 2020 కింద ఒక్కో టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేసేందుకు ఓఆర్‌ఆర్‌కు 5 కి.మీల దూరంలో హెచ్‌ఎండీఏ పరిధిలో కనీసం 100 ఎకరాలుండాలి.
మొత్తం విస్తీర్ణంలో 40 శాతం మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయింపు(10 శాతం పచ్చదనం, రహదారులు, ఎస్టీపీలు, రోడ్లు) ఉంటుంది. మిగిలిన భాగంలో కార్యాలయాలు, నివాసాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, పాఠశాలలు, ఆసుపత్రులు వస్తాయి.
అంతర్గత రవాణాకు ఎలక్ట్రిక్‌ వాహనాలు తప్పనిసరి ః 18-30 మీటర్ల వెడల్పు ఉండే ప్రధాన రహదారులు, 8 మీటర్ల వెడల్పుతో అంతర్గత రహదారులు ఉంటాయి. ః పేదలు, తక్కువ ఆదాయ వర్గాలకు ఎల్‌ఐజీ, ఈడబ్ల్యూఎస్‌ హౌజింగ్‌ ః టౌన్‌షిప్‌ రెసిడెంట్స్‌, యూజర్స్‌ అసోసియేషన్‌(టీఆర్‌యూఏ) పేరిట కమిటీ ఉంటుంది.
ప్రోత్సాహకాలు ఇలా..
టౌన్‌షిప్‌లను పీపీపీ విధానంలో అభివృద్ధి చేస్తారు. స్థిరాస్తి వ్యాపారులకు ప్రోత్సాహాకాలు ప్రకటించారు.
టీఎస్‌-బీపాస్‌ ద్వారా సత్వర అనుమతులు. రెరాలో నమోదు తప్పనిసరి
పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తే అభివృద్ధి రుసుములో 75 శాతం మినహాయింపు
అయిదేళ్ల వరకు ఆస్తి పన్నులో 50 శాతం రాయితీ
ఎల్‌ఐజీ/ఈడబ్ల్యూఎస్‌ నివాసాల అభివృద్ధి, ఇతర ఛార్జీలు 100 శాతం మినహాయింపు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని