రియల్‌ ఎస్టేట్‌ 2.0

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ 2.0లోకి అడుగు పెట్టబోతుందా? అవుననే అంటున్నాయి పరిశ్రమ వర్గాలు. స్థిరాస్తి రంగం ప్రాజెక్ట్‌లు ఇప్పటి వరకు ఒక ఎత్తైతే టౌన్‌షిప్పుల ప్రాజెక్ట్‌లతో మున్ముందు కొత్త శకమే అంటున్నారు ఈ రంగంలోని నిపుణులు. ప్రస్తుతం నగరంలో జనాభా పెరిగేకొద్దీ అభివృద్ధి విస్తరిస్తూ వెళుతోంది. మొదట ఇళ్లు, ఆ తర్వాత వాణిజ్య దుకాణాలు, ఆపై విద్యా సంస్థలు, వైద్య సేవలు, రవాణా, రహదారుల వంటి మౌలిక సదుపాయాలు వస్తున్నాయి.

Updated : 14 Nov 2020 02:50 IST

లేఅవుట్లు, గేటెడ్‌ కమ్యూనిటీల నుంచి టౌన్‌షిప్పుల వైపు..
ఈనాడు, హైదరాబాద్‌

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ 2.0లోకి అడుగు పెట్టబోతుందా? అవుననే అంటున్నాయి పరిశ్రమ వర్గాలు. స్థిరాస్తి రంగం ప్రాజెక్ట్‌లు ఇప్పటి వరకు ఒక ఎత్తైతే టౌన్‌షిప్పుల ప్రాజెక్ట్‌లతో మున్ముందు కొత్త శకమే అంటున్నారు ఈ రంగంలోని నిపుణులు. ప్రస్తుతం నగరంలో జనాభా పెరిగేకొద్దీ అభివృద్ధి విస్తరిస్తూ వెళుతోంది. మొదట ఇళ్లు, ఆ తర్వాత వాణిజ్య దుకాణాలు, ఆపై విద్యా సంస్థలు, వైద్య సేవలు, రవాణా, రహదారుల వంటి మౌలిక సదుపాయాలు వస్తున్నాయి. ఇందుకు ఎంతలేదన్నా పదేళ్ల సమయం పడుతోంది. అప్పటి వరకు అన్నింటికీ సిటీనే ఆధారం. ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన టౌన్‌షిప్పుల విధానంతో ప్రణాళికబద్ధ అభివృద్ధికి అడుగులు పడనున్నాయి. సకల సౌకర్యాలతో ఇదొక మినీ పట్టణంగా ఉంటుంది. ప్రతి అవసరానికి నగరానికి రావాల్సిన అవసరం లేకుండా వంద ఎకరాలు ఆపైన నిర్మించే టౌన్‌షిప్పులో అన్ని వర్గాలకు నివాసాలు, వాణిజ్య సముదాయాలు, కార్యాలయాల భవనాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, క్రీడా స్థలాలు, పార్కులు, రహదారులు ఉంటాయి. ఇప్పటివరకు లేఅవుట్లు, విల్లా ప్రాజెక్ట్‌లు, గేటెడ్‌ కమ్యూనిటీలు, మాల్స్‌, వాణిజ్య, కార్యాలయాల ప్రాజెక్ట్‌లు చేపట్టిన స్థిరాస్తి సంస్థలు.. టౌన్‌షిప్పులను అభివృద్ధి చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. సిటీ చుట్టూ టౌన్‌షిప్పులతో హైదరాబాద్‌ విశ్వనగరంగా రూపొందుతుందని, సుస్థిరాభివృద్ధితో స్థిరాస్తి రంగానికి కూడా ఇది మేలని తెలంగాణ డెవలపర్స్‌ అసోసియేషన్‌ (టీడీఏ) అంటోంది.

స్థిరాస్తి రంగానికి మౌలిక వసతులే ఛోదక శక్తులు. నగరంలో ఎక్కడ ఏ కొత్త ప్రాజెక్ట్‌ వచ్చినా ఆ చుట్టు పక్కల నివాసాలు, వాణిజ్య నిర్మాణాల కార్యకలాపాలు వేగం అందుకుంటాయి. ఒక పెద్ద రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఒక ప్రాంతంలో కొత్త ప్రాజెక్ట్‌ చేపట్టినా, ఒక ఎంఎన్‌సీ కంపెనీ కొత్తగా ఒక ప్రాంతంలో కార్యాలయం ఏర్పాటు చేసినా ఆ చుట్టుపక్కల స్థిరాస్తి లావాదేవీలు జోరందుకుంటాయి. అలాంటిది ఇప్పుడు టౌన్‌షిప్పులే రాబోతున్నాయి. వలసలతో సిటీపై భారం పడకుండా టౌన్‌షిప్పులను మౌలిక వసతులతో అభివృద్ధి చేయాలని టీడీఏ సూచిస్తోంది. ఏటా నగరానికి నాలుగు లక్షల మంది వలస వస్తున్నారు. వీరికి ఉపాధి, ఆవాసాలు కావాలంటే ప్రణాళికబద్దమైన అభివృద్ధితోనే సాధ్యమని ప్రస్తుతం ప్రభుత్వం తీసుకొచ్చిన టౌన్‌షిప్పుల విధానం అందుకు దోహదం చేస్తుందని అంటోంది.

విజయవంతం కావాలంటే...

నగరంతో జనాభా పెరిగేకొద్దీ ట్రాఫిక్‌, కాలుష్య సమస్యలు ఎదురవుతుంటాయి. ప్రస్తుతం కోటి మంది జనాభా నగరంలో నివసిస్తున్నారు. భవిష్యత్తులో మరింత మంది నగరానికి వలస వచ్చే అవకాశం ఉంది. గత పదేళ్లు చూస్తే ఏటా 4 లక్షల మంది నగరానికి వలస వస్తున్నారు. అధిక మంది ఇక్కడే స్థిరపడుతున్నారు. జనసాంద్రత పెరిగితే మౌలిక వసతులు తట్టుకోలేవు. సిటీకి వలసలు వచ్చినా అందరూ ప్రధాన నగరంలోకి రావాల్సిన అవసరం లేకుండా అవుటర్‌ బయట టౌన్‌షిప్పులు ఉండాలని ఎంతోకాలంగా తెలంగాణ డెవలపర్స్‌ అసోసియేషన్‌ కోరుతోంది. తమ ప్రతిపాదనలు, సూచనలు ప్రభుత్వానికి అందించాం. సరైన సమయంలో ప్రభుత్వం టౌన్‌షిప్పులపై ఉత్తర్వులు జారీ చేసింది. నగర జనసాంద్రత మరింత పెరగకుండా, వీలైతే తగ్గించుకునేందుకు శివార్లలో వెలిసే కొత్త పట్టణాలు దోహదం చేస్తాయి. ప్రభుత్వ జీవోతో ఒక అడుగు ముందుకు పడినట్లయ్యింది.
* ఇక్కడ ఉంటున్నవారు తమ అవసరాల కోసం హైదరాబాద్‌ వచ్చే అవసరం లేకుండా టౌన్‌షిప్పుల్లోనే విద్య, వైద్యం, ఉపాధి, వినోద సదుపాయాలు ఏర్పాటు చేయగలిగితే ఇవి విజయవంతం అవుతాయి. డెవలపర్‌తో పాటూ స్వయం సంవృద్ధి టౌన్‌షిప్పులుగా ఎదిగేందుకు ప్రభుత్వం సైతం మౌలిక వసతులు కల్పించాలి. అప్పుడే ఇవి విజయవంతం అయ్యేందుకు ఆస్కారం ఉంటుంది.
* శంకర్‌పల్లి-సంగారెడ్డి, ఫార్మాసిటీ మధ్యలో, పోచారం-ఘట్‌కేసర్‌, మేడ్చల్‌-శామీర్‌పేట, శంషాబాద్‌-షాద్‌నగర్‌ మధ్యలో, పటాన్‌చెరు-సంగారెడ్డి ప్రాంతాల్లో టౌన్‌షిప్పులు వచ్చేందుకు అవకాశం ఉంది. అవుటర్‌కు ఐదు కిలోమీటర్ల బయట కాబట్టి ఈ ప్రాంతాల్లో అభివృద్ధికి అనువుగా ఉన్నాయి.
* మనది వలయాకార (సర్క్యులర్‌) మోడల్‌ అభివృద్ధి. బాహ్య వలయ రహదారి ఉండటంతో నగరంలో చుట్టూ టౌన్‌షిప్పులతో అన్ని ప్రాంతాలు అభివృద్ధికి, రియల్‌ ఎస్టేట్‌కు ఆస్కారం ఉంటుంది. బెంగళూరులో చూస్తే రిబ్బన్‌ మోడల్‌ అభివృద్ధి అంటారు. ఒకవైపు వెళుతుంది. దిల్లీకి నోయిడా, గుర్గావ్‌; ముంబయికి నవీముంబయి టౌన్‌షిప్పులుగా ఏర్పాటయ్యాయి. నోయిడా, గుర్గావ్‌లో జనసాంద్రత ఎక్కువ కావడంతో అక్కడి మౌలిక వసతులు దెబ్బతిన్నాయి. ఇలాంటి  పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
* అవుటర్‌కు ఐదు కిలోమీటర్ల బయట కొత్త టౌన్‌షిప్పులు కాబట్టి అవుటర్‌కు అటుఇటు గ్రిడ్‌ రోడ్లను ఏర్పాటు చేస్తే ఉపాధి అవకాశాలు చేరువవుతాయి. అవుటర్‌ రింగురోడ్డు ఇరువైపులా కి.మీ. మేర గ్రోత్‌ కారిడార్‌ ప్రాంతంగా ఉంది. ఇది బహుళ జోన్‌.

* కొత్తగా డెవలపర్లు అభివృద్ధి చేసే టౌన్‌షిప్పులకు తోడుగా ఇప్పటికే ఓఆర్‌ఆర్‌ బయట అభివృద్ధికి అవకాశం ఉన్న ముఖ్య పట్టణాలను గుర్తించి అక్కడ మౌలిక వసతులు కల్పిస్తే అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందుతాయి. ప్రతి రీజినల్‌ టౌన్‌కు ఆసుపత్రులు, విద్యాలయాలు, క్రీడా మైదానాల కోసం ఒక్కోదానికి 100 ఎకరాల వరకు మాస్టర్‌ ప్లాన్‌లో కొంత భూమిని ప్రత్యేకించి మౌలిక వసతులు అభివృద్ధి చేయాలి. ప్రైవేటు మాల్స్‌, సముదాయాలు వాటంతట అవే వస్తాయి.  

ఇక్కడ పరిశ్రమలు మినహా గృహ, వాణిజ్య ఏదైనా నిర్మాణం చేసుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు ఆశించిన మేరకు ఇక్కడ అభివృద్ధి లేకపోవడానికి గ్రిడ్‌ రోడ్లు లేకపోవడమే. గ్రిడ్‌ రోడ్లు వేయాలంటే 100 అడుగుల రహదారి కోసం భూసేకరణ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక కార్పొరేషన్‌ లేదంటే హెచ్‌ఎండీఏ, గ్రోత్‌ కారిడార్‌ సంస్థ భూసేకరణ చేపట్టి రహదారులు అభివృద్ధి చేయాలి. రహదారి అనుసంధానంగా నిర్మాణాల అనుమతుల కోసం వచ్చిన డెవలపర్స్‌ నుంచి రహదారుల అభివృద్ధికి చేసిన చేసిన వ్యయాన్ని తీసుకోవచ్చు. దశల వారీగా గ్రోత్‌ కారిడార్‌లోని రహదారులను మొత్తం ఈ విధంగా అభివృద్ధి చేయాలి.

- జి.వి.రావు, అధ్యక్షుడు, తెలంగాణ డెవలపర్స్‌ అసోసియేషన్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు