అందుబాటు ధరలు ఎక్కడ?

ఓ ఇల్లు కొనాలని అనుకుంటున్నారా..అయితే, కాస్త త్వరపడటం మంచిది. ఆలస్యమయ్యే కొద్దీ ధరలు సామాన్య, మధ్యతరగతి వాసులు అందుకోలేనంతగా పెరిగిపోతున్నాయి. కొవిడ్‌ సమయంలో ఇళ్ల ధరలు కొంతైనా దిగి వస్తాయని ఎదురుచూసినా.. తగ్గకపోగా కొన్నిచోట్ల పెరిగాయి. అందుబాటు ధరల్లో కొనగలిగే నిర్మాణాల లభ్యత తగ్గింది....

Published : 21 Nov 2020 02:19 IST

రూ.45 లక్షల లోపు ఇళ్లకోసం కొనుగోలుదారుల వెతుకులాట

ఈనాడు, హైదరాబాద్‌: ఓ ఇల్లు కొనాలని అనుకుంటున్నారా..అయితే, కాస్త త్వరపడటం మంచిది. ఆలస్యమయ్యే కొద్దీ ధరలు సామాన్య, మధ్యతరగతి వాసులు అందుకోలేనంతగా పెరిగిపోతున్నాయి. కొవిడ్‌ సమయంలో ఇళ్ల ధరలు కొంతైనా దిగి వస్తాయని ఎదురుచూసినా.. తగ్గకపోగా కొన్నిచోట్ల పెరిగాయి. అందుబాటు ధరల్లో కొనగలిగే నిర్మాణాల లభ్యత తగ్గింది. రూ.45 లక్షల బట్జెట్‌లో ఇంటికోసం ఎక్కువ మంది చూస్తుండగా.. అవుటర్‌ దాకా వెళితే తప్ప దొరకని పరిస్థితి. అంతదూరం వెళ్లినా ఛాయిస్‌ తక్కువగా ఉంటుంది. ఈ ధరల శ్రేణిలో తక్కువ మంది బిల్డర్లు కడుతున్నారు.  
ఇన్నర్‌ రింగ్‌రోడ్డు బయట మొన్నటివరకు అందుబాటు ధరల్లో రెండు పడకల ఫ్లాట్లు దొరికేవి. ఐదు నుంచి పది కిలోమీటర్ల లోపలికి వెళితే అదే ధరకు వ్యక్తిగత ఇళ్లు వచ్చేవి. ఐదు నుంచి పదేళ్ల వ్యవధిలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆ ప్రాంతాల్లో వ్యక్తిగత ఇళ్లు రూ.80 లక్షల వరకు పలుకుతుంటే అపార్ట్‌మెంట్ల ధర రూ.50 లక్షల వరకు చెబుతున్నారు. రూ.40లక్షల నుంచి రూ.45 లక్షల ధరలో కావాలంటే అవుటర్‌ వరకు వెళ్లాల్సిందే. పశ్చిమ హైదరాబాద్‌లో చూస్తే కొల్లూరు, బీరంగూడ వంటి దూర ప్రాంతాల్లోనే అందుబాటు ధరల్లో ఫ్లాట్లు వస్తున్నాయి. ఒకప్పుడు ఇవన్నీ వ్యక్తిగత నివాస కాలనీలుగా గుర్తింపు పొందాయి. తూర్పు హైదరాబాద్‌లో చూస్తే ఆదిభట్ల, తుర్కయంజాల్‌, హయత్‌నగర్‌, ఘట్‌కేసర్‌ వరకు వెళ్లాల్సి వస్తోంది. దక్షిణ హైదరాబాద్‌లో శంషాబాద్‌లో మాత్రమే ఈ ధరకు ఫ్లాట్‌ వస్తుంది. ఈ ప్రాంతాల్లోనూ గేటెడ్‌ కమ్యూనిటీల్లో అయితే ఇంకా ఎక్కువే అవుతోంది. ఉత్తర హైదరాబాద్‌లోనే వీటి లభ్యత కాస్త ఎక్కువగా ఉంది. బొల్లారం, అల్వాల్‌, సైనిక్‌పురి తదితర ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్నాయి.

పాతవాటి వైపు మొగ్గు..
ఉద్యోగం, పిల్లల చదువుల దృష్ట్యా అవుటర్‌ వరకు వెళ్లలేనివారు ఇన్నర్‌రింగ్‌రోడ్డు చేరువలో పాత ఫ్లాట్ల వైపు మొగ్గుచూపుతున్నారు. ఐదేళ్ల నుంచి పదేళ్ల క్రితం నిర్మాణమైన అపార్ట్‌మెంట్లు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. మెహిదీపట్నం నుంచి అత్తాపూర్‌, కర్మన్‌ఘాట్‌, నాగోల్‌, సికింద్రాబాద్‌ వరకు రూ.45లక్షల నుంచి 50లక్షల్లో పాతఫ్లాట్లు విక్రయానికి ఉన్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని