ఎల్‌ఆర్‌ఎస్‌ పరిశీలన ఇలా..!

అక్రమ లేఅవుట్లలోని ఫ్లాట్ల క్రమబద్ధీకరణ దరఖాస్తులను ఈసారి కొత్త పద్ధతిలో పరిష్కరించనున్నారు. గతంలో మాదిరి ఒక్కో దరఖాస్తు కాకుండా ఒక్కో ప్రాంతం ఆధారంగా అక్కడ ఉన్న లేఅవుట్లన్నింటినీ ఒకేసారి వేర్వేరు విభాగాల అధికారులు పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు. ఫలితంగా తక్కువ వ్యవధిలో ఎక్కువ దరఖాస్తుల....

Updated : 12 Dec 2020 08:14 IST

ఈనాడు, హైదరాబాద్‌: అక్రమ లేఅవుట్లలోని ఫ్లాట్ల క్రమబద్ధీకరణ దరఖాస్తులను ఈసారి కొత్త పద్ధతిలో పరిష్కరించనున్నారు. గతంలో మాదిరి ఒక్కో దరఖాస్తు కాకుండా ఒక్కో ప్రాంతం ఆధారంగా అక్కడ ఉన్న లేఅవుట్లన్నింటినీ ఒకేసారి వేర్వేరు విభాగాల అధికారులు పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు. ఫలితంగా తక్కువ వ్యవధిలో ఎక్కువ దరఖాస్తుల పరిష్కారానికి వీలవుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రయోగాత్మకంగా పీర్జాదిగూడ కార్పొరేషన్‌ పరిధిలోని దరఖాస్తులను మొదట పరిష్కరించనున్నారు. ఇక్కడ ఎదురయ్యే సమస్యలు, ఇబ్బందులను గుర్తించి వాటిని అధిగమిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ(ఎల్‌ఆర్‌ఎస్‌)కు పెద్దఎత్తున దరఖాస్తులు వచ్చాయి. సెప్టెంబరు 1 నుంచి అక్టోబరు 31 వరకు రెండు నెలలపాటు ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌కు గడువు ఇవ్వగా 25.59 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గ్రేటర్‌తోపాటు శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిని ఎప్పుడు పరిష్కరిస్తారని దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు. అధికారులు ఇప్పటికే దీనిపై కొంత కసరత్తు చేశారు. వేగంగా పరిష్కరించే ప్రక్రియవైపు ప్రభుత్వం మొగ్గుచూపింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ముగిసి ఫలితాలు రావడంతో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిశీలన మొదలెట్టి వేగంగా పూర్తిచేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఒక్క దరఖాస్తు లేకపోయినా..

2015లో హెచ్‌ఎండీఏ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్‌ తీసుకొచ్చారు. హెచ్‌ఎండీఏ బయట పంచాయతీలకు ఎల్‌ఆర్‌ఎస్‌ లేకపోవడంతో దరఖాస్తుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. పరిష్కారానికి సంవత్సరాలు పట్టింది. ఇప్పటికే కొన్నివేల దరఖాస్తులు అపరిష్కృతంగా ఉన్నాయి. వీటిలో కొందరు మళ్లీ ఈసారి కూడా దరఖాస్తు చేశారు. అప్పట్లో ఒక్కో దరఖాస్తును విడిగా పరిశీలన జరపడంతో తీవ్ర జాప్యమైంది. వేర్వేరు శాఖల నుంచి నిరభ్యంతర పత్రాలను దరఖాస్తుదారులనే సమర్పించమనేవారు. వీటి కోసం ఆయా కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరగాల్సి వచ్చింది.

ఏకకాలంలో..

ఒక్కో ప్రాంతం, అక్కడ వచ్చిన దరఖాస్తుల్లోని లేఅవుట్లన్నింటిని ఏకకాలంలో పరిశీలన చేపడతారు. ఏ దరఖాస్తుదారుడైనా లేఅవుట్‌ కాపీ లేక సమర్పించకపోతే పక్కన పెట్టకుండా అదే లేవుట్‌లో సర్వే నంబరులో ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం ఇతర దరఖాస్తుదారులు సమర్పించిన కాపీతో పరిశీలిస్తారు. లేఅవుట్‌లో నిర్ధారిత 10 శాతం ఖాళీ స్థలం ఉందా లేదా చూస్తారు. చెరువుల్లో ఉన్నాయా? అసైన్డ్‌ ల్యాండ్సా? ఇలా వీటి పరిశీలనకు సంబంధించి నీటిపారుదల, రెవెన్యూ, హెచ్‌ఎండీఏ, అటవీ ఇలా అన్ని విభాగాల అధికారులు ఒకేసారి వచ్చి లేఅవుట్లు అన్ని వారి రికార్డుల ఆధారంగా పరిశీలిస్తారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా క్రమబద్ధీకరణకు అవకాశం ఉన్న ఫ్లాట్లు అన్నింటిని ఏకకాలంలో పరిష్కరిస్తారు. మిగతావాటిని తిరస్కరించాలని ప్రభుత్వ నిర్ణయంగా ఉంది. ఎల్‌ఆర్‌ఎస్‌పై కోర్టులో కేసు ఉన్నందున తుది ఆదేశాలకు అనుగుణంగా సర్కారు చర్యలు తీసుకోనుంది.

మా దగ్గరే ప్రయోగాత్మకంగా..

ఈసారి ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు వేగంగా పరిష్కారం కానున్నాయి. ఒక ప్రాంతంలోని లేఅవుట్లలోని దరఖాస్తులన్నీ ఒకేసారి పరిశీలించనున్నారు. ఈ తరహాలో పరిశీలనకు పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ను పైలెట్‌ ప్రాజెక్ట్‌గా ఎంపికచేశారు. మా కార్పొరేషన్‌ పరిధిలో 9వేల పైగా దరఖాస్తులు వచ్చాయి.

- జక్కా వెంకట్‌రెడ్డి, మేయర్‌, పీర్జాదిగూడ కార్పొరేషన్‌; సలహాదారు, తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని