ఆకట్టుకొనేలా.. అన్నీ అమ్ముడయ్యేలా!

అందుబాటు ఇళ్ల (అఫర్డబుల్‌ హౌసింగ్‌) నిర్మాణంపై ప్రముఖ సంస్థలు దృష్టి పెట్టాయి. రెండు పడక గదుల ఫ్లాట్‌ రూ.40 లక్షలకే ఇచ్చేలా నిర్మాణం చేపడుతున్నాయి. కొన్ని సంస్థలు ఇప్పటికే నిర్మాణాలు చేపట్టగా మరికొన్ని కొత్త ఏడాదిలో పనులు ప్రారంభించబోతున్నాయి. ఇప్పటివరకు ఈ కేటగిరీలో హైదరాబాద్‌లో ఇళ్ల లభ్యత తక్కువగా ఉంది...

Updated : 26 Dec 2020 06:42 IST

రూ.40 లక్షల్లో ఫ్లాట్ల వైపు పెద్ద బిల్డర్ల అడుగులు

ఈనాడు, హైదరాబాద్‌: అందుబాటు ఇళ్ల (అఫర్డబుల్‌ హౌసింగ్‌) నిర్మాణంపై ప్రముఖ సంస్థలు దృష్టి పెట్టాయి. రెండు పడక గదుల ఫ్లాట్‌ రూ.40 లక్షలకే ఇచ్చేలా నిర్మాణం చేపడుతున్నాయి. కొన్ని సంస్థలు ఇప్పటికే నిర్మాణాలు చేపట్టగా మరికొన్ని కొత్త ఏడాదిలో పనులు ప్రారంభించబోతున్నాయి. ఇప్పటివరకు ఈ కేటగిరీలో హైదరాబాద్‌లో ఇళ్ల లభ్యత తక్కువగా ఉంది. ఉన్నా ఎక్కువగా చిన్న అపార్ట్‌మెంట్లే. పెద్ద సంస్థలు రంగంలోకి దిగడంతో గేటెడ్‌ కమ్యూనిటీ తరహాలో ఒకేచోట భారీ ఎత్తున ఇలాంటి ఇళ్లను నిర్మించబోతున్నాయి. రాబోయే రెండు మూడేళ్లలో 70 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎనిమిది వేల ఫ్లాట్లు దశలవారీగా రానున్నాయి. గృహ రుణ వడ్డీ రేట్లు అతి తక్కువగా ఉండటం, గృహరుణం తీసుకుని మొదటిసారి ఇల్లు కొన్నవారికి కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద రూ.2.60 లక్షల వరకు ఇస్తుండటంతో కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన ఉందని నిర్మాణదారులు అంటున్నారు.

నెల జీతం రూ.50 వేలున్నా ఇల్లు కొనలేని పరిస్థితి. సామాన్య, దిగువ మధ్యతరగతి వాసుల్లో అత్యధిక కుటుంబాల నెల ఆదాయం ఇంతకంటే తక్కువే ఉంటుంది. మరి సొంతింటి కల తీరేదెలా? రూ.40 లక్షల లోపు ఇళ్లు దొరకవా? ఇప్పుడిప్పుడే ఈ ధరల శ్రేణిలో అందుబాటు ఇళ్ల ప్రాజెక్ట్‌లు చేపట్టేందుకు నిర్మాణదారులు ముందుకొస్తున్నారు. మార్కెట్‌ అవసరాలు, కేంద్రం ప్రోత్సాహకాలు, కరోనాతో మారిన ప్రణాళికలు.. కారణాలేమైతేనేం ఆలస్యంగానైనా ఇలాంటి ఇళ్ల వైపు నిర్మాణ సంస్థలు అడుగులు వేస్తున్నాయి.

పెద్ద సంస్థల రాకతో.. అందుబాటు ఇళ్ల నిర్మాణం వైపు పెద్ద సంస్థల రాకతో భారీతనం వచ్చింది. ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనే వీరు ప్రాజెక్ట్‌లు చేపడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు ఎక్కువగా ఉండటంతో ఆకాశహర్మ్యాల ప్రాజెక్ట్‌లను చేపడుతున్నారు. 12 నుంచి 32 అంతస్తుల వరకు వేయబోతున్నారు. చిన్న, మధ్యతరహా సంస్థలు ఐదు నుంచి 10 అంతస్తుల భవనాలను నిర్మించబోతున్నాయి. బాచుపల్లిలో ఓ సంస్థ 3600 యూనిట్లను, నార్సింగిలో మరోసంస్థ 1600 యూనిట్లను కట్టబోతున్నాయి. కిస్మత్‌పూర్‌, ఆదిభట్ల, పటాన్‌చెరు ప్రాంతాల్లో ఈ ప్రాజెక్ట్‌లు వస్తున్నాయి. ప్రారంభానికి ముందే కొన్ని ప్రాజెక్టులపై ఎక్కువమంది ఆసక్తి కనబరుస్తున్నారు.

గేటెడ్‌ కమ్యూనిటీల్లో... కనీస సౌకర్యాలన్నీ ఉండాలంటే ప్రస్తుతం గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఒక్కో ఇంటికి తక్కువలో తక్కువ రూ.65 లక్షల పెట్టాల్సి వస్తోంది. మరింత మెరుగైన వసతులు ఉన్నచోట రూ.కోటి చెబుతున్నారు. ఇట్లాంటి చోట్ల కూడా అందుబాటు ఇళ్లను రూ.40 లక్షల నుంచి రూ.45 లక్షల లోపు ఇస్తామంటున్నారు నిర్మాణదారులు. గేటెడ్‌ కమ్యూనిటీల మాదిరి సకల సౌకర్యాల ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. మార్కెట్లు, కాఫీ షాపులు, బ్యాంకులు, క్లినిక్‌లన్నీ ఉండేలా డిజైన్‌ చేశారు.

వడ్డీ రాయితీ పొందొచ్చు.. గృహ రుణం తీసుకుని మొదటిసారి ఇల్లు కొంటే పీఎంఏవై కింద వ్యక్తిగతంగా వడ్డీ రాయితీ ప్రయోజనాలు పొందొచ్చు. గరిష్ఠంగా రూ.2.60 లక్షల వరకు కేంద్రం రుణ ఖాతాలో జమ చేస్తుంది. ఈఎంఐ భారం నెలకు రూ.రెండున్నరవేల వరకు తగ్గుతుంది. గృహరుణం తీసుకున్న బ్యాంకులోనే దరఖాస్తు చేసుకోవాలి. వార్షికాదాయం రూ.18 లక్షల వరకు ఉన్నవారూ ఈ పథకానికి అర్హులే.


విస్తీర్ణమే కీలకం

అందుబాటు ఇళ్లలో ఒక్కో ఫ్లాట్‌ విస్తీర్ణం ఒక్కోరకంగా ఉంటోంది. 800 చ.అడుగుల నుంచి 975 చ.అ. వరకు ఉన్నాయి. ఇంటిలోపల కార్పెట్‌ ఏరియా అన్ని ప్రాజెక్టుల్లో ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన నిబంధనల ప్రకారం 650 చ.అ. ఉండేలా జాగ్రత్త పడుతున్నాయి. ఆపై విస్తీర్ణంలో కారిడార్లు, ఇతర కామన్‌ అవసరాల నిర్మాణాలను చూపుతున్నాయి. రెరా కూడా ఇదే చెబుతుంది. సౌకర్యాలను, కట్టిన ప్రాంతాన్ని బట్టి కొన్ని సంస్థలు రూ.41 లక్షలు మరికొన్ని రూ.45 లక్షల వరకు ఇంటి ధర ఉండొచ్చని అంటున్నారు. వీటిలో ఎక్కువ సంస్థలు కనీస సౌకర్యాలన్నీ కలిపి రూ.40 లక్షల లోపే ఇస్తున్నాయి. 


ప్రభుత్వ రాయితీలు..

* అందుబాటు ఇళ్లను నిర్మించేందుకు నిర్మాణదారులు ముందుకొచ్చేలా కేంద్రం పలు ప్రోత్సాహకాలను చేపట్టింది.
* ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద నిర్మాణం చేపట్టగా వచ్చిన లాభంపై పన్ను ఉండదు.
* ఇంటిలోపల కార్పెట్‌ ఏరియా 650 చ.అ. వరకు ఉంటే జీఎస్‌టీ 1 శాతమే వర్తిస్తుంది.
* ఈ విభాగంలో కొనుగోలుదారుల నుంచి డిమాండ్‌, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉండటంతో నిర్మాణదారులు క్రమంగా ఇటువైపు మొగ్గుచూపుతున్నారు.
* కొవిడ్‌ నేపథ్యంలోనూ కొందరు బిల్డర్లు తమ ప్రణాళికలు మార్చుకుని ఇటువైపు దృష్టి  సారించారు.
* కొన్ని సంస్థలు పీఎంఏవై రాయితీలతో సంబంధం లేకుండా రూ.41-45 లక్షల ధరల శ్రేణిలో నిర్మించి ఇస్తున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని