రెరా మధ్యే మార్గం

తెలంగాణ రాష్ట్ర స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి చట్టం(రెరా)కు కొనుగోలుదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పటివరకు సుమారు 200 వరకు వచ్చాయి. చాలావరకు బిల్డర్లు, కొనుగోలుదారులను కూర్చోబెట్టి మధ్యవర్తిత్వంతో సమస్యలను రెరా పరిష్కరిస్తోంది. ఈ మేరకు చట్టం అవకాశం కల్పిస్తోంది.

Updated : 16 Jan 2021 04:57 IST

కొనుగోలుదారుల నుంచి వస్తున్న ఫిర్యాదులు
ఈనాడు, హైదరాబాద్‌

తెలంగాణ రాష్ట్ర స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి చట్టం(రెరా)కు కొనుగోలుదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పటివరకు సుమారు 200 వరకు వచ్చాయి. చాలావరకు బిల్డర్లు, కొనుగోలుదారులను కూర్చోబెట్టి మధ్యవర్తిత్వంతో సమస్యలను రెరా పరిష్కరిస్తోంది. ఈ మేరకు చట్టం అవకాశం కల్పిస్తోంది. 20 వరకు ఫిర్యాదులపై రెరా తీర్పు వెలువరించాల్సి ఉంది. పలు రాష్ట్రాల్లో రెరా చురుగ్గా ఉండగా.. తెలంగాణలో ఇంకా వేగం అందుకోలేదు. కొనుగోలుదారులకు భరోసా పెరిగితే ఫిర్యాదులు పెరిగే అవకాశం ఉంది.
రాష్ట్రంలో 2017 జనవరి 1 తర్వాత అనుమతి తీసుకున్న ప్రతి ప్రాజెక్ట్‌ రెరా పరిధిలోకి వచ్చింది. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, ఇతర విభాగాల నుంచి అనుమతి తీసుకున్న ప్రాజెక్టులన్నీ రెరాలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సిందే. 8 ఫ్లాట్‌లు ఆపైన, 500 చ.మీ., ఆపై విస్తీర్ణం కల్గిన స్థలంలో నిర్మించే ప్రతి ప్రాజెక్ట్‌కు, లేఅవుట్లకు రెరా వర్తిస్తుంది. నమోదుకు ఇప్పటికే తగినంత గడువు ఇచ్చారు. ఆ లోపు నమోదు చేసుకోని సంస్థలపై జరిమానా సైతం విధించారు. ఇప్పటివరకు 3వేల ప్రాజెక్టుల వరకు రెరాలో నమోదయ్యాయి. మహారాష్ట్రలోని రెరా అమలును పరిశీలించి.. ఇక్కడ స్థానికంగా నిర్మాణదారుల సూచనలతో మన అవసరాలకు తగ్గట్టుగా తెలంగాణ రెరాను తీసుకొచ్చారు. నాలుగు స్థాయుల్లో ప్రతి ప్రాజెక్ట్‌ పరిశీలన చేస్తున్నారు.. మొదటి దశలో పత్రాలన్నీ అప్‌లోడ్‌ చేశారా లేదా అనేది లెవల్‌-1 అధికారి చూస్తారు. రెండో దశలో సక్రమంగా ఉన్నాయా లేవా అనేది లెవెల్‌-2 అధికారి పరిశీలిస్తారు. మూడో దశలో కార్యదర్శి, నాలుగో దశలో ఛైర్మన్‌ పరిశీలించి ఆమోదం తెలుపుతున్నారు.

పారదర్శకత పెంచేందుకు..
కొనుగోలుదారుల ప్రయోజనాల దృష్ట్యా నిర్మాణరంగంలో పారదర్శకతను పెంపొందించేందుకు రెరాను తీసుకొచ్చారు. కొనుగోలుదారులు, నిర్మాణదారుల మధ్య వివాదం తలెత్తినప్పుడు తమ వద్ద ఉన్న సమాచారంతో ఫిర్యాదు చేస్తే పరిష్కరించేందుకు రెరా కృషి చేస్తుంది.
* బ్రోచర్‌లో పేర్కొన్నట్లుగా పూర్తి ప్లాన్‌ సమర్పించి అనుమతులు పొందాలి. ఫ్లోర్‌, ఫ్లాట్‌ వారీగా వివరాలు స్పష్టంగా ఉండాలి.
* నిర్మాణదారుడు, కొనుగోలుదారులతో చేసుకునే ఒప్పంద పత్రంలో అన్ని వివరాలు పొందుపర్చాలి. నిర్మాణం స్వాధీనపరిచే తేదీ, ధర, వ్యక్తిగత గృహ సదుపాయాల, సామూహిక వసతుల వివరాలు, ఉపయోగించే సామగ్రి తయారీదారు పేరు వంటి వివరాలన్నీ పొందుపర్చాలి.
* ఐదు సంవత్సరాలు వరకు నిర్మాణలోపాలకు బిల్డర్‌దే బాధ్యత.  
* కార్పెట్‌ ఏరియా, సూపర్‌ బిల్టప్‌ ఏరియా, సేలబుల్‌ ఏరియా, కామన్‌ ఏరియా విడివిడిగా చూపాల్సి ఉంటుంది.
* కరపత్రాలలో, వాణిజ్య ప్రకటనల్లో పేర్కొన్న పలురకాల వసతులు, నాణ్యత వివరాలు, సాంకేతికత అంశాలకు చట్టబద్ధత ఉంటుంది. లోపాలుంటే వీటిని ఆధారంగా చూపి న్యాయం పొందవచ్చు. ఆయా కరపత్రాలు, ప్రకటనలపై కచ్చితంగా రెరా నంబర్‌ ఉండాలి.
* నిర్మాణ ప్లాన్‌ను కొనుగోలుదారుని ప్రమేయం లేకుండా వ్యాపారి మార్పులు, చేర్పులు చేస్తుంటారు. అనుమతి ఒకటి తీసుకుని మరో విధంగా నిర్మిస్తుంటారు. ఒకవేళ మార్పు చేస్తే కొనుగోలుదారుడికి సమాచారం ఇవ్వాలి. లేకపోతే వారు రెరాలో ఫిర్యాదు చేయవచ్చు.  
అవిభాజ్య స్థలంపైనే...
రెరాలో వేర్వేరు దశలో ఉన్న ఫిర్యాదుల్లో అవిభాజ్య స్థలంపైనే ఎక్కువగా ఉన్నాయి. గృహ, వాణిజ్య నిర్మాణాలు ఒకే చోట ఉన్న ప్రాజెక్టులపైనే ఇవి వస్తున్నాయి. విక్రయించేటప్పుడు స్పష్టంగా చెప్పక పోవడంతో ఈ సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి.
3 వేల ప్రాజెక్టులు నమోదు చేసుకున్నాయ్‌
మనకొస్తున్న ఫిర్యాదులు తక్కువే ఉంటున్నాయి. డబ్బులు వెనక్కి ఇప్పించాలనేవే ఎక్కువగా వస్తున్నాయి. సమస్య మా దృష్టికి రాగానే పరిశీలించి బిల్డర్‌కు నోటీసు పంపిస్తున్నాం. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత చట్టం మేరకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇప్పటివరకు రెరాలో 3వేల ప్రాజెక్టులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఇచ్చినట్లే కొవిడ్‌ కారణంగా ప్రాజెక్ట్‌ గడువు పూర్తికి ఇక్కడా ఏడాది పొడిగింపు ఇచ్చాం.

- కె.విద్యాధర్‌రావు, కార్యదర్శి, రెరా

ఏం ఫిర్యాదులు వస్తున్నాయ్‌...
* నిర్మాణాలు పూర్తి చేసినా కొందరు స్థిరాస్తి వ్యాపారులు నివాసయోగ్య పత్రం(ఓసీ) పొందక పోవడంతో మంచినీటి కనెక్షన్‌ సకాలంలో తీసుకోలేక ఇబ్బంది పడుతున్నట్లు కొనుగోలుదారుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి.
* వాహనాల పార్కింగ్‌ కేటాయింపులో పారదర్శకత లేకపోవడం, వ్యాపారులు తమ ఇష్టానుసారం కేటాయించడంపై..
* కొనుగోలు సమయంలో పలు సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చి.. వాటిని కల్పించడంలో విఫలం కావడం.. జనరేటర్‌, లిఫ్ట్‌ వంటి కనీస వసతులు కూడా కల్పించకుండా అసంపూర్తిగా వదిలేయడం..
* పెద్ద ప్రాజెక్టులలో సౌర విద్యుత్తు, మురుగు శుద్ధి కేంద్రం (ఎస్‌టీపీ) కల్పిస్తామని చెప్పి వాటిని విస్మరించడం..
* సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి హక్కులన్నీ బదలాయించాల్సి ఉన్నా.. నివాస సంఘం ఏర్పాటుకు అవరోధాలను సృష్టించడం..
* బహుళ అంతస్తుల్లో ఉమ్మడి వసతులకు సంబంధించి పరికరాల కొనుగోలు రశీదులు, వారంటీ కార్డు, నిర్వహణ కాంట్రాక్ట్‌ ఒప్పంద పత్రాలను సంక్షేమ సంఘాలకు బదిలీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం..
* ఆమోదిత ప్లాన్‌ ప్రకారం కాకుండా గదుల నిర్మాణం చేపట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు కొనుగోలుదారుల నుంచి ఫిర్యాదులు..
* బిల్డర్‌, భూ యజమాని మధ్య విబేధాలతో కొనుగోలుదారులకు సకాలంలో నిర్మాణం పూర్తి చేయకపోవడం..
* భూ యజమాని నుంచి కొన్నవారికి వ్యాపారి సరైన సేవలు అందించక పోవడం, నాణ్యమైన నిర్మాణం చేపట్టక పోవడం పైన ఫిర్యాదులు వస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని