అప్పు కొంత.. వాటా కొంత..

స్థిరాస్తి రంగంలో ప్రైవేటు ఈక్విటీ (పీఈ)ల రాక మొదలైంది. కొవిడ్‌తో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందగమనంతో ఈ రంగంలో పెట్టుబడులకు గత ఏడాది మొదట్లో విదేశీ సంస్థలు ఆసక్తి చూపకున్నా.. చివర్లో మార్కెట్లు కోలుకోవడంతో విశ్వాసం పెరిగింది. వార్షిక పెట్టుబడుల్లో సగానికిపైగా గత త్రైమాసికంలో వచ్చాయి. 2019లో 6,8 బిలియన్‌ యూఎస్‌ డాలర్ల

Published : 23 Jan 2021 01:24 IST

కార్యాలయాలు, వేర్‌ హౌసింగ్‌లోనే పీఈ పెట్టుబడులు ఎక్కువ
గృహ నిర్మాణంలో పెరుగుతున్న ఈక్విటీ వాటా

ఈనాడు, హైదరాబాద్‌: స్థిరాస్తి రంగంలో ప్రైవేటు ఈక్విటీ (పీఈ)ల రాక మొదలైంది. కొవిడ్‌తో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందగమనంతో ఈ రంగంలో పెట్టుబడులకు గత ఏడాది మొదట్లో విదేశీ సంస్థలు ఆసక్తి చూపకున్నా.. చివర్లో మార్కెట్లు కోలుకోవడంతో విశ్వాసం పెరిగింది. వార్షిక పెట్టుబడుల్లో సగానికిపైగా గత త్రైమాసికంలో వచ్చాయి. 2019లో 6,8 బిలియన్‌ యూఎస్‌ డాలర్ల ప్రైవేటు ఈక్విటీలు పెట్టుబడులు రాగా.. 2020లో కొవిడ్‌తో 4.1 బిలియన్‌ యూఎస్‌ డాలర్లకు తగ్గింది. ఇందులో చివరి త్రైమాసికంలోనే 2.6 బిలియన్‌ యూఎస్‌డాలర్ల పీఈలు వచ్చాయని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా సంస్థ పేర్కొంది.
* పదేళ్ల కాలంలో పీఈ పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని వెల్లడించింది. 2011లో కార్యాలయాల భవనాల్లో 11 శాతంగా ఉన్న పీఈ పెట్టుబడులు 2020 నాటికి 62 శాతానికి, వేర్‌హౌసింగ్‌లో 6శాతం నుంచి 24 శాతానికి పెరిగాయి.
* గత పదేళ్లలో హైదరాబాద్‌ పీఈ పెట్టుబడుల ఆకర్షణలో మూడో స్థానంలో నిల్చింది. 2160 మిలియన్‌ యూఎస్‌ డాలర్లను వాణిజ్య, కార్యాలయ, గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టారు.
* గృహ నిర్మాణంలో పీఈ పెట్టుబడుల పోకడలను చూస్తే గత నాలుగేళ్లలో చాలావరకు తగ్గాయి. రెండేళ్లుగా చూస్తే ఈక్విటీ శాతం పెరగడం విశేషం. 2019లో 35 శాతం ఈక్విటీ వాటా ఉంటే 2020 నాటికి 52 శాతానికి పెరిగింది.
* రిటైల్‌లో 2019తో పోలిస్తే 2020లో 79 శాతం తగ్గాయి. కొవిడ్‌తో రిటైల్‌ దెబ్బతిన్న సంగతి తెలిసిందే. వచ్చే పెట్టుబడుల్లోనూ ఎక్కువగా సింగపూర్‌, యూఎస్‌, కెనడా నుంచి వస్తున్నాయి.
* వేర్‌హౌసింగ్‌లో విస్తరణకు అవకాశం ఉండటంతో సింగపూర్‌, యూఏఈ, జర్మనీ, యూఎస్‌, కెనడా, ఫ్రాన్స్‌తో పాటూ చైనా నుంచి పెట్టుబడులు వచ్చాయి.
* దేశంలోకి 2020లో వచ్చిన ప్రైవేటీ ఈక్విటీల్లో 11 శాతం వరకు రియల్‌ ఎస్టేట్‌లోకే వచ్చాయి.


రాబడి ఎక్కువ ఉండటంతో...
ప్రైవేటు ఈక్విటీ పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువగా విదేశీ సంస్థలు ముందుకొస్తుంటాయి. ఆయా దేశాల్లో వడ్డీరేట్లు మూడు, నాలుగు శాతం లోపే ఉంటాయి. అదే మన స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెడితే 6 నుంచి 8 శాతం రాబడికి అవకాశం ఉంటుంది. రెండింతల రాబడికి అస్కారం ఉండటంతో ఎక్కువగా కార్యాలయ స్థలాల్లో పెడుతుంటారు. ఇందులో డెట్‌ అప్పు రూపంలో, వాటాగా ఈక్విటీ రూపంలో పెట్టుబడి పెడుతుంటారు. నిర్మాణం ప్రారంభంలో, పూర్తయ్యాక.. వేర్వేరు దశల్లో వీరు పెట్టుబడి పెడుతుంటారు. లాభాలు స్వీకరించి వైదొలుగుతుంటారు. దేశీయ పీఈ సంస్థలు కార్యాలయాల స్థలాల్లో ప్రైవేటు ఈక్విటీ పెట్టుబడులకు అంతగా ఆసక్తి చూపించరు. మన ద్రవ్యోల్బణమే 8 శాతం. పెట్టుబడి పెట్టేవారు అంతకు మించి రావాలని ఆశిస్తారు. వీరు గృహ నిర్మాణంలో అధిక రాబడి కోసం డెట్‌రూపంలో పెడుతుంటారు. బ్యాంకు వడ్డీ కంటే ఎక్కువ వసూలు చేస్తుంటారు

- ఎ.సుమంత్‌రెడ్డి, అధ్యక్షుడు, నేషనల్‌ రియల్టర్స్‌ అసోసియేషన్‌



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని