పెట్టుబడుల భాగ్యనగరం

నగరంలో స్థిరాస్తి కార్యకలాపాలు ఊపందుకున్నాయి. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేస్తుండటంతో లావాదేవీలు పుంజుకున్నాయి. కొవిడ్‌ సంక్షోభం నుంచి త్వరగానే బయటపడటంతో హైదరాబాద్‌ చుట్టుపక్కల పెట్టుబడులు పెట్టేందుకు ....

Published : 30 Jan 2021 03:18 IST

ఈనాడు, హైదరాబాద్‌

గరంలో స్థిరాస్తి కార్యకలాపాలు ఊపందుకున్నాయి. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేస్తుండటంతో లావాదేవీలు పుంజుకున్నాయి. కొవిడ్‌ సంక్షోభం నుంచి త్వరగానే బయటపడటంతో హైదరాబాద్‌ చుట్టుపక్కల పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రా ప్రాంతవాసులే కాదు ఉత్తరాదివాసులూ ఇటే చూస్తున్నారు. ప్రవాస భారతీయుల పెట్టుబడులు ఇక్కడికే వస్తున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తుండటంతో అవుటర్‌ చుట్టుపక్కల ప్రాంతాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఐటీ కారిడార్‌ చుట్టుపక్కల ఇటీవల పలు కొత్త లింకు రోడ్లు వచ్చాయి. రేడియల్‌ రోడ్లు చివరి దశలో ఉన్నాయి. లాక్‌డౌన్‌కు ముందు.. ఇప్పటికి ఆ ప్రాంతాల్లో  మౌలిక వసతుల రాకతో స్పష్టమైన మార్పు కనబడుతోంది. పశ్చిమ హైదరాబాద్‌లోనే కాదు నగరంలోని ఇతర ప్రాంతాల్లోనూ కొత్త ప్రాజెక్ట్‌లు వస్తున్నాయి. విజయవాడకు జాతీయ రహదారి మార్గంలో బాట సింగారంలో లాజిస్టిక్స్‌ పార్కు అందుబాటులోకి వచ్చింది. అవుటర్‌ చుట్టుపక్కల మరిన్ని లాజిస్టిక్‌ హబ్స్‌ రాబోతున్నాయి. శ్రీశైలం రహదారి మార్గంలో ఫార్మా సిటీ రాకతో చుట్టుపక్కల వ్యాపార కార్యకలాపాలు వేగం అందుకున్నాయి. గచ్చిబౌలి, కోకాపేట చుట్టుపక్కల కొత్త ఐటీ కార్యాలయాలు వస్తూనే ఉన్నాయి. ఉత్తర హైదరాబాద్‌ ప్రాంతం కొంపల్లి వైపు ఐటీ టవర్ల ఏర్పాటు, గ్రిడ్‌ పాలసీతో అన్నివైపుల అభివృద్ధికి అవకాశం ఉంటుందనే ఆశాభావంతో కొనుగోలుదారులు ముందుకు వస్తున్నారు.

సొంతింటి దిలాసా
కొవిడ్‌తో నగరవాసులకు ఎదురైన అనుభవాలతో సొంతింటి అవసరాన్ని ఎక్కువ మంది గుర్తించారని బిల్డర్లు అంటున్నారు. వీరంతా ఇళ్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఉన్నవాళ్లు మరింత పెద్ద ఇంటి ఆలోచనలు చేస్తున్నారు. రెండు పడక గదుల్లో ఉన్నవారు మూడు పడక గదుల ఇంటికి మారుతున్నారు. నగరంలో ఉన్నవారు కొవిడ్‌ రక్షణ దృష్ట్యా శివార్లలో విల్లాలను కోరుకుంటున్నారు. లాక్‌డౌన్‌ కాలంలో ఎక్కువ లావాదేవీలు ఈసారి విల్లా ప్రాజెక్ట్‌ల్లోనే జరిగాయని డెవలపర్లు అంటున్నారు. యాబై లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు విల్లాల ధరలు పలుకుతున్నాయి. ఓఆర్‌ఆర్‌ చేరువలో అందుబాటు ధరల్లో ఇళ్లు పెద్ద సంఖ్యలో నిర్మాణంలో ఉన్నాయి. ఇక్కడ రూ.40 నుంచి 50 లక్షల ధరల శ్రేణిలో అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు విక్రయిస్తున్నారు. సకల సౌకర్యాలతో నిర్మిస్తున్న గేటెడ్‌ కమ్యూనిటీల్లో రూ.80 లక్షల నుంచి రూ.కోటిపైగా చెబుతున్నారు. వీటిలో కొనుగోలుకు ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. సిద్ధంగా ఉన్న ఇళ్లకు మంచి డిమాండ్‌ ఉంది. ప్రస్తుతం కొత్తగా మొదలైన ప్రాజెక్టుల్లో ఇప్పుడున్న ధరల్లో ఇళ్లు దొరికే అవకాశం లేదని నిర్మాణదారులు అంటున్నారు. సిమెంట్‌, స్టీలు ధరల కారణంగా చదరపు అడుగు నిర్మాణ వ్యయం పెరిగిందని చెబుతున్నారు. గృహరుణ వడ్డీ రేట్లు సైతం ప్రస్తుతం అత్యల్పంగా 6.90 శాతం ఉండటంతో సొంతింటి అవకాశాలు మెరుగయ్యాయని స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థలు అంటున్నాయి.


భవిష్యత్తు భరోసా

కొవిడ్‌తో లాక్‌డౌన్‌లో పూర్తిగా స్తంభించిన వాటిలో వెంచర్లు ఒకటి. అన్‌లాక్‌లోనూ కొద్దినెలల పాటూ లావాదేవీలు పెద్దగా జరగలేదు. ధరణితో లింకుతో ఫాంల్యాండ్‌ లావాదేవీలపై ప్రభావం పడింది. కానీ ఇటీవల వీటిలోనూ కార్యకలాపాలు పుంజుకున్నాయి. పాత వెంచర్లలో ఇదివరకు మిగలిన స్థలాల అమ్మకాలు వేగంగా జరుగుతున్నాయని రియల్టర్లు అంటున్నారు. మొదట్లో కొవిడ్‌ ముందు ధరలకే విక్రయించినా.. ఇటీవల పెరిగినట్లు చెబుతున్నారు. భూముల ధరలు పెరగడంతో వెంచర్లపైనా ఈ ప్రభావం పడింది. పలు కొత్త వెంచర్లు భూమి చదును చేసే దశలో ఉన్నాయి. తుది అనుమతి రాకముందే పలువురు బుక్‌ చేసుకుంటున్నారు. స్థలాలతో పాటూ ప్రస్తుతం ఎక్కువ మంది దృష్టి భూములపై పడింది. సిటీ నుంచి వంద కిలోమీటర్ల పరిధిలో తమ బడ్జెట్‌లో దొరికే భూముల కోసం చూస్తున్నారు. ఈ పరిధిలో ఎక్కడా 25 లక్షలకు లోపల ఎకరా భూమి దొరకడం లేదు. రెండు, మూడేళ్ల క్రితం వరకు ఇందులో సగం ధరనే పలికేవి. ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అందడం, రహదారుల విస్తరణ ప్రణాళికలు, ఫార్మా సిటీతో పాటూ పలు ప్రాంతాల్లో కొత్త కంపెనీలు రాకతో వాటి చుట్టుపక్కల భూముల ధరలకు రెక్కలొచ్చాయి. అయినా భవిష్యత్తు దృష్ట్యా పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ‘ప్రస్తుతం మార్కెట్‌ బాగుంది. ఐటీ రంగంలో వృద్ధి 13 శాతంగా ఉంది. దేశ సగటు 8.5 శాతం కంటే తెలంగాణలో ఎక్కువ. ఫార్మా రంగంలోనూ వృద్ధి ఉంది. ఏ రకంగా చూసినా వృద్ధి చెందుతున్న నగరంగా అందరి దృష్టిని హైదరాబాద్‌ ఆకర్షిస్తోంది. ఆంధ్రా, తెలంగాణ వాసులే కాదు వేర్వేరు ప్రాంతవాసులు స్థిరనివాసం ఏర్పాటు చేసుకునేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్‌ వైపే చూస్తున్నారు. ఉత్తరాదివాసులు ఇదివరకు ఎక్కువగా దిల్లీ చుట్టుపక్కల పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపేవారు. దిల్లీలో కాలుష్యం పెరగడం, బెంగళూరు రద్దీగా మారడంతో వారందరూ హైదరాబాద్‌నే ఎంచుకుంటున్నారు. ముంబయిలో అందనంత ఎత్తులో ధరలు ఉంటాయి. ఇవే కాదు ఇక్కడి కాస్మోపాలిటన్‌ సంస్కృతి కూడా అందర్ని ఆకట్టుకుంటోంది. భాష సమస్య లేదు. అన్ని ప్రాంతాల రుచులు ఇక్కడ లభ్యం. వీటి దృష్ట్యా పెట్టుబడులకు హైదరాబాద్‌ మొదటి ఎంపిక అవుతోంది’ అని తెలంగాణ డెవలపర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జి.వి.రావు అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని