భారీతనం.. ఇంటికదే అందం!

గృహ నిర్మాణంలో ప్రస్తుతం కొత్త పోకడ నడుస్తోంది. భారీ ప్రాజెక్ట్‌లకే నిర్మాణదారులు పెద్దపీట వేస్తున్నారు. దశాబ్దాల అనుభవం ఉన్న సంస్థలే కాదు కొత్తగా మార్కెట్లోకి ప్రవేశించిన బిల్డర్లు సైతం భారీతనం ప్రదర్శిస్తున్నారు. వెయ్యి యూనిట్లకు(నివాసం) తగ్గకుండా కడుతున్నారు. రూ.45 లక్షల అందుబాటు ఇళ్లతో పాటూ కోటి రూపాయల వరకు పలికే విలాసవంతమైన నివాసాల వరకు ఇదే పోకడ ఉంటోంది.

Updated : 13 Feb 2021 01:20 IST

పెద్ద ప్రాజెక్ట్‌లవైపు నిర్మాణదారుల చూపు

హైదరాబాద్‌ మార్కెట్లో నయా పోకడ

ఈనాడు, హైదరాబాద్‌

గృహ నిర్మాణంలో ప్రస్తుతం కొత్త పోకడ నడుస్తోంది. భారీ ప్రాజెక్ట్‌లకే నిర్మాణదారులు పెద్దపీట వేస్తున్నారు. దశాబ్దాల అనుభవం ఉన్న సంస్థలే కాదు కొత్తగా మార్కెట్లోకి ప్రవేశించిన బిల్డర్లు సైతం భారీతనం ప్రదర్శిస్తున్నారు. వెయ్యి యూనిట్లకు(నివాసం) తగ్గకుండా కడుతున్నారు. రూ.45 లక్షల అందుబాటు ఇళ్లతో పాటూ కోటి రూపాయల వరకు పలికే విలాసవంతమైన నివాసాల వరకు ఇదే పోకడ ఉంటోంది.
భారీ ప్రాజెక్ట్‌లు ఇప్పటివరకు ఎక్కువగా ప్రీమియం ధరల్లోనే అందుబాటులో ఉండేవి. హంగులతో నిర్మించే వీటిలో రెండు పడకగదుల ఫ్లాట్‌ ప్రారంభ ధరనే రూ.70 లక్షలు. ఆపై విస్తీర్ణాన్ని బట్టి ధర పెరుగుతూ ఉంటుంది. మొదట్లో రెండు మూడు రియల్‌ ఎస్టేట్‌ సంస్థలే ఎక్కువగా వీటిని నిర్మించేవి. ఇప్పుడు ఈ సంఖ్య పదుల సంఖ్యను దాటింది. ఒకదానితో ఒకటి పోటీపడేలా స్థానిక బిల్డర్లే నిర్మాణాలు చేపడుతున్నారు. బెంగళూరు, ఇతర ప్రాంతాలకు చెందిన స్థిరాస్తి సంస్థల రాకతోనూ పోటీపెరిగింది. నార్సింగిలో రెండు సంస్థలే మూడు వేల యూనిట్లు వచ్చే భారీ ప్రాజెక్ట్‌లకు ముందస్తు బుకింగ్స్‌ చేపట్టాయి. సనత్‌నగర్‌లో ఒక సంస్థ 1100 యూనిట్ల ప్రాజెక్ట్‌ను ప్రకటించింది.విమానాశ్రయం మార్గంలో గగన్‌పహాడ్‌ వద్ద ఆకాశహార్మ్య గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఉంది.

మధ్యతరగతి అందుకునేలా..

ఖరీదైనవే కాదు అందుబాటు ధరల్లోనూ భారీ ప్రాజెక్ట్‌లు వస్తుండటంతో ప్రస్తుత పోకడను సామాన్య, మధ్యతరగతివారు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఐటీ కారిడార్‌ను దాటి ఆకాశహర్మ్యాలు, భారీ ప్రాజెక్ట్‌లు ఇప్పుడు రాజేంద్రనగర్‌, గగన్‌పహాడ్‌, ఎల్‌బీనగర్‌, ఉప్పల్‌, బాచుపల్లి, బహుదూర్‌పల్లి, పటాన్‌చెరు వరకు విస్తరించాయి. రాజేంద్రనగర్‌లో వెయ్యికిపైగా ఉన్న గృహసముదాయం ప్రాజెక్ట్‌లో మార్చి నుంచి కొనుగోలుదారులకు అందజేయబోతున్నారు. బొల్లారంలోనూ వెయ్యియూనిట్ల ప్రాజెక్ట్‌లో దశలవారీగా కొనుగోలుదారులకు అందజేసేందుకు నిర్మాణ పనులను వేగిరం చేశారు.  ప్రభుత్వం చేపట్టిన రెండు పడకగదుల ఇళ్లను స్థానిక బిల్డర్లే చేపట్టారు. 9 నుంచి పది అంతస్తుల వరకు నిర్మాణం చేపట్టారు. వీటిని కట్టిన అనుభవంతో పలువురు బిల్డర్లు తదుపరి ప్రాజెక్ట్‌లను భారీగా తీర్చిదిద్దుతున్నారు. కొనుగోలుదారుల్లో వచ్చిన ఆలోచనలు ఇందుక్కారణం. సాదాసీదా ఇళ్లలో కంటే ప్రాంగణంలోనే ఆటస్థలాలు, ఈతకొలను, సూపర్‌మార్కెట్‌, ఏటీఎం, వాకింగ్‌ ట్రాక్‌, ఇండోర్‌ గేమ్స్‌,  క్లబ్‌హౌస్‌ ఉండే ప్రాజెక్ట్‌ల వైపు మొగ్గుచూపుతున్నారు.  భారీ ప్రాజెక్ట్‌ల్లో బుకింగ్స్‌ను బట్టి ఒకటి, రెండు టవర్లను మొదట చేపట్టి ఐదేళ్లలో మొత్తం ప్రాజెక్ట్‌ను పూర్తిచేస్తున్నాయి. ఇదేళ్లయ్యాక మొదట్లో కొన్న కొనుగోలుదారుడు, ఆఖర్లో అమ్మిన బిల్డర్‌ ఇద్దరు ప్రయోజనం పొందుతున్నారు.

కొత్త బిల్డర్లు సైతం..

కొత్తగా ప్రవేశించిన నిర్మాణదారులు మొదట స్టాండ్‌లోన్‌ అపార్ట్‌మెంట్లు(సాధారణ) చేపట్టేవారు. 8 నుంచి 20 ఫ్లాట్ల సాధారణ అపార్ట్‌ట్‌మెంట్లు కొన్ని సంవత్సరాలపాటూ కట్టి విస్తరించేవారు. మారిన పరిస్థితులు, డిమాండ్‌తో కొత్తవాళ్లు సైతం భారీ ప్రాజెక్ట్‌లు చేపడుతున్నారు.  కొల్లూరు, తుక్కుగూడ ప్రాంతాల్లో వెయ్యి యూనిట్లకు తగ్గకుండా ప్రాజెక్ట్‌లను ప్రకటించారు. వీరి దూకుడు చూసి ఒకటి రెండు దశాబ్దాలుగా ఈ రంగంలో ఉన్న బిల్డర్లుతమని తాము మార్చుకోక తప్పదని అంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని