రెండో ఉద్ధృతిని తట్టుకునేందుకు సన్నద్ధం

దూసుకెళుతున్న హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌పై కొవిడ్‌ రెండో ఉద్ధృతి ప్రభావం ఏ మేరకు ఉంటుంది? నిర్మాణ-పనులు యధాప్రకారం కొనసాగేనా? కొనుగోలుదారులు ప్రాజెక్టు సందర్శనకు వచ్చేనా? రిజిస్ట్రేషన్లు ఎప్పటిలాగే జరిగేనా? మున్ముందు మార్కెట్‌ ఎలా ఉంటుంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు కొనుగోలుదారుల నుంచి పరిశ్రమ వర్గాలు ఎదుర్కొంటున్నాయి. లాక్‌డౌన్‌ విధించనంత వరకు పెద్దగా ప్రతికూల ప్రభావమేమీ ఉండదని

Published : 17 Apr 2021 02:08 IST

ఈనాడు, హైదరాబాద్‌

దూసుకెళుతున్న హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌పై కొవిడ్‌ రెండో ఉద్ధృతి ప్రభావం ఏ మేరకు ఉంటుంది? నిర్మాణ-పనులు యధాప్రకారం కొనసాగేనా? కొనుగోలుదారులు ప్రాజెక్టు సందర్శనకు వచ్చేనా? రిజిస్ట్రేషన్లు ఎప్పటిలాగే జరిగేనా? మున్ముందు మార్కెట్‌ ఎలా ఉంటుంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు కొనుగోలుదారుల నుంచి పరిశ్రమ వర్గాలు ఎదుర్కొంటున్నాయి. లాక్‌డౌన్‌ విధించనంత వరకు పెద్దగా ప్రతికూల ప్రభావమేమీ ఉండదని నిర్మాణదారులు అంటున్నారు. పనిచేసే కార్మికుల దగ్గర్నుంచి.. కొనుగోలుదారుల వరకు.. వారి భద్రతకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబుతున్నారు.
కొవిడ్‌ లాక్‌డౌన్‌ నుంచి అత్యంత వేగంగా కోలుకున్న మార్కెట్లలో హైదరాబాద్‌ ముందుంది. విక్రయాలు, కొత్త ప్రాజెక్టులతో మార్కెట్‌ పూర్వ స్థాయికి చేరుకుంది. అంతకంటే మెరుగ్గానే ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనూ గృహ నిర్మాణంలో విక్రయాలు, కొత్త ప్రాజెక్టులపై పలు స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థలు సానుకూల నివేదికలు ఇచ్చాయి. ఇలాంటి తరుణంలో కొవిడ్‌ రెండో ఉద్ధృతితో పాజిటివ్‌ కేసులు భారీగా పెరుగుతుండటంతో కొంత గుబులు మొదలైంది. నిర్మాణ రంగంలోని వారు పలువురు, రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో సిబ్బంది కొవిడ్‌ బారిన పడ్డారు. ఇవన్నీ ఒకింత ఆందోళన కలిగిస్తున్నాయి.

రవాణాపై ప్రభావంతో..
నిర్మాణ రంగంలో ముడిసరుకు వేర్వేరు ప్రాంతాల నుంచి హైదరాబాద్‌ చేరుకుంటుంది. ఇక్కడ ఎలాంటి ఆంక్షలు లేకపోయినా.. కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ నిబంధనలతో రవాణాపై కొంత మేర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోందని ఓ బిల్డర్‌ అన్నారు. ప్రస్తుతానికి ఇది పెద్ద సమస్య  కాదని..  మున్ముందు కేసులు పెరిగి లాక్‌డౌన్‌ వరకు వెళితేనే ఇబ్బందని అన్నారు.
సెంటిమెంట్‌ ఆధారంగానే..
కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు మరింత పెరిగితే మాత్రం విక్రయాలపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. రియల్‌ ఎస్టేట్‌ కొనుగోలుదారుల సెంటిమెంట్‌ ఆధారంగానే నడుస్తుంది. ఉగాది తర్వాత కొత్త ఇళ్లు, స్థలాలు కొనే ఆలోచనల్లో చాలామంది ఉన్నారు. వీరంతా తమకు నచ్చిన బడ్జెట్‌లో స్థిరాస్తుల అన్వేషణలో ఉన్నారు. కేసులు పెరిగితే బయటికి వచ్చేందుకు సాహసించక పోవచ్చు. కొనుగోలు నిర్ణయాన్ని కొంతకాలం వాయిదా వేసే సూచనలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితులను ముందే అంచనా వేస్తున్న బడా సంస్థలు వర్చువల్‌గానే ప్రాజెక్టు సందర్శన.. ఆన్‌లైన్‌లోనే చెల్లింపులు చేసే ఏర్పాట్లు చేశాయి.
చిన్న బిల్డర్లు తట్టుకోలేరు..
గత ఏడాది కొవిడ్‌ సమయంలో విధించిన లాక్‌డౌన్‌తో చిన్న బిల్డర్లు చాలా వరకు దెబ్బతిన్నారు. నిర్మాణ కూలీల కొరత, రవాణా సమస్యలు, ముడిసరకుల ధరలు పెరగడంతో పలు ప్రాజెక్టులు మధ్యలోనే నిలిచిపోయాయి. వెంచర్లు సైతం పూర్తిగా అభివృద్ధి చేయలేక చేతులెత్తేశారు.   మరికొందరు అతి కష్టం మీద పూర్తిచేసే పనిలో ఉన్నారు.  రెండో ఉద్ధృతిలో కేసుల పెరుగుదల వీరిని ఆందోళనకు గురిచేస్తోంది.  కొనుగోళ్లు మందగిస్తే నిధుల సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది.  ప్రాజెక్టులు మరింత ఆలస్యం అయితే ఆర్థికంగా భారమూ పెరుగుతుందని చిన్న బిల్డర్లు అంటున్నారు.

కొందరు బిల్డర్లు తీసుకుంటున్న జాగ్రత్తలు

కొవిడ్‌ రెండో ఉద్ధృతిలో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. అవి ఎక్కువున్నా ప్రభావం తక్కువగా ఉండటం కొంత ఊరట. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టు సైట్లలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం.  క్రితం ఏడాదితో పోలిస్తే ఇప్పుడు నిర్మాణ రంగం కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉంది.
* కార్మికులను ఒక చోట నుంచి మరో చోటకు బస్సుల్లో తరలిస్తుంటారు. ఇప్పుడు ఎక్కడివారు అక్కడే పనిచేసేలా చర్యలు చేపట్టాం.
* టీకా వేసుకున్న వారికే సైట్‌ నుంచి బయటికి వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నాం.
* మాస్క్‌ పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం తప్పని సరి చేశాం. ఎప్పటికప్పుడు సైట్లలో శానిటైజేషన్‌ చేస్తున్నాం.
* కార్మికుల్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించి.. పాజిటివ్‌ వస్తే విడిగా ఉంచేందుకు ఏర్పాటు చేస్తున్నాం.
* సంఘాల సమావేశాలు కూడా రద్దు చేసుకున్నాం.. ఆన్‌లైన్‌ చర్చలకే పరిమితం అవుతున్నాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని