Real Estate: కొంతకాలం అంతంతే!

కొవిడ్‌ రెండో ఉద్ధృతి స్థిరాస్తి రంగంపై ప్రభావం చూపుతోంది. కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తుండటంతో ఇప్పటికే విక్రయాలు మందగించాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా స్థిరాస్తి సంస్థలు సైతం మార్కెటింగ్‌ దూకుడును తగ్గించాయి. కొవిడ్‌ భయంతో కొనుగోలుదారులు ప్రాజెక్టులను సందర్శించేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. కొన్ని బడా సంస్థలు మాత్రం వర్చువల్‌ ....

Updated : 08 May 2021 07:09 IST

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ రెండో ఉద్ధృతి స్థిరాస్తి రంగంపై ప్రభావం చూపుతోంది. కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తుండటంతో ఇప్పటికే విక్రయాలు మందగించాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా స్థిరాస్తి సంస్థలు సైతం మార్కెటింగ్‌ దూకుడును తగ్గించాయి. కొవిడ్‌ భయంతో కొనుగోలుదారులు ప్రాజెక్టులను సందర్శించేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. కొన్ని బడా సంస్థలు మాత్రం వర్చువల్‌ విధానంలో సందర్శించేలా ప్రత్యామ్నాయ విధానాలను అవలంబిస్తూ విక్రయాలపై ప్రభావం పడకుండా చూసుకుంటున్నాయి. ఎక్కువ సంస్థలు కొవిడ్‌ ఉద్ధృతి ఎప్పుడు తగ్గుతుందా అని వేచిచూసే ధోరణిలో ఉన్నాయి. మరికొంతకాలం అనిశ్చితి తప్పదని అంటున్నారు.  
ఎప్పటి వరకో..
విక్రయాలు, కొత్త ప్రాజెక్టులతో ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో మంచి ఊపు మీదున్న హైదరాబాద్‌ మార్కెట్‌కు రెండో త్రైమాసికం ఆరంభంలోనే కొవిడ్‌ దెబ్బ కొట్టింది. ఎంతకాలం ఈ పరిస్థితి ఉంటుందో తెలియడం లేదని బిల్డర్లు ఆందోళన చెందుతున్నారు. కొవిడ్‌ భయాలతో పూర్తి స్థాయిలో ప్రాజెక్టు పనులు చేపట్టలేకపోతున్నారు. విక్రయాలు మందగించడంతో చిన్న సంస్థలు, చిన్న బిల్డర్లు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొవిడ్‌ కారణంగా గత ఏడాది వాయిదా పడిన పనులను పూర్తిచేసేందుకు సన్నద్ధం అయిన దశలో రెండో ఉద్ధృతితో మరోసారి ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. వీరి వద్ద ఇళ్లు కొనుగోలు చేసినవారు ఎప్పటికి తమ చేతికి వస్తుందా అని  ఎదురుచూస్తున్నారు.  
నిర్మాణాల కొనసాగింపు...
రాష్ట్రంలో లాక్‌డౌన్‌ లేకపోవడంతో నిర్మాణ పనులు దాదాపుగా ఎప్పటిలాగే కొనసాగుతున్నాయి. ఒక్కో ప్రాజెక్టులో 50 నుంచి ఆరు వేల మంది వరకు కూలీలు పనిచేస్తున్నారు. పెద్ద సంస్థలు భవన నిర్మాణ కూలీలకు ప్రత్యేక క్యాంపుల్లో ఆశ్రయం కల్పిస్తున్నాయి. ఎవరికైనా జ్వరం, ఇతరత్రా అనారోగ్యం ఉంటే వెంటనే పరీక్షలు చేయించి అక్కడే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ గదుల్లో ఆశ్రయం కల్పిస్తున్నామని ఆయా సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. కొన్నిచోట్ల మాత్రం కొవిడ్‌ భయాలతో కూలీలు స్వగ్రామాలకు తిరిగి వెళ్లిపోయారు. వీరి సంఖ్య చాలా స్పల్పమని నిర్మాణదారులు అంటున్నారు. ఐటీ కారిడార్‌లో రాత్రి కర్ఫ్యూ సమయంలోనూ పనుల చేస్తుండటంపై స్థానికులు అభ్యంతరాలు తెలపడంతో పనులపై ప్రభావం పడింది. వందశాతం పనులు జరుగుతున్నాయని చెప్పలేం కానీ నిర్మాణ పరంగా పెద్దగా ఇబ్బంది ప్రస్తుతానికి లేదని నిర్మాణదారులు అంటున్నారు.  

ఇతర రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ ప్రభావంతో..
నిర్మాణ పనుల్లో ఉపయోగించే సామగ్రి వేర్వేరు ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వస్తుంది. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్లు, వారాంతపు కట్టడులు అమల్లో ఉన్నాయి. వీటి ప్రభావం పెద్దగా లేదని స్థిరాస్తి సంఘాలు అంటున్నాయి. సిమెంట్‌, స్టీలు, ఇసుక స్థానికంగానే లభిస్తోందని.. టైల్స్‌ గుజరాత్‌ నుంచి ఎక్కువగా వస్తాయని, కూలీల్లో ఎక్కువగా పశ్చిమ బెంగాల్‌ వాసులున్నారని.. ఆయా రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ లేదని చెప్పారు. స్టీల్‌ ప్లాంట్లలోని ఆక్సిజన్‌ను కొవిడ్‌ రోగులకు తరలించడంతో ఈ ప్రభావం స్టీల్‌ ధరలపై ఉందని.. చాలా పెరిగాయని వాపోతున్నారు. కొవిడ్‌కు ముందు నుంచే వీటి ధరల్లో పెరుగుదల ప్రారంభమైందని..నిర్మాణ వ్యయం అధికమవడానికి ఇది కారణమైందని చెప్పారు. వాహనాల డ్రైవర్లు కొవిడ్‌ బారిన పడటం,  ఎక్కువ మంది అందుబాటులో లేకపోవడంతో సరకు చేరడం ఆలస్యం అవుతుంది తప్ప పెద్దగా ప్రస్తుతానికి ముడి సరకుల పరంగా ఇబ్బందుల్లేవన్నారు. వాటి ధనల పెరుగుదలే కొంత ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు.
ఎదురుచూపులు..
స్థిరాస్తి రంగంలో ఆయా సంస్థలు తమ ఉద్యోగులకు, కార్మికులకు టీకాను ఉచితంగా వేయించేందుకు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు తమ ఖర్చుతో టీకాలు వేయించనున్నట్లు ప్రకటించాయి. మే 1 నుంచి  సన్నద్ధం అయినా..టీకాల కొరతతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆయా సంస్థలు ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదిస్తున్నా.. టీకాలపై స్పష్టత ఇవ్వడం లేదని స్థిరాస్తి సంఘాల ప్రతినిధులు అంటున్నారు.  కొవిడ్‌ రెండో ఉద్ధృతిలో రియల్‌ ఎస్టేట్‌ సంస్థల్లోని సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు చాలామంది కొవిడ్‌ బారిన పడ్డారు. టీకాలు వేయించడం ద్వారా వ్యాప్తిని అడ్డుకోవచ్చని ఆయా కంపెనీలు భావించినా అందుబాటులో లేకపోవడంతో ఎంతకాలం ఎదురుచూడాల్సి వస్తుందోనని వాపోతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు