శివారు వైపు మొగ్గు

పని ప్రదేశానికి దగ్గరలో ఉండాలి.. మెరుగైన రవాణా సదుపాయాలుండాలి.. ఆసుపత్రులు, పాఠశాలలు, సూపర్‌ మార్కెట్లు, మాల్స్‌, మల్టీప్లెక్స్‌లు చేరువలో ఉండాలి.. ఇవన్నీ కావాలంటే ఒకప్పుడైతే నగరంలోనే సాధ్యం. ఇప్పుడు ఎక్కడికక్కడ శివార్లలోనూ మౌలిక వసతులు మెరుగుపడటం, సోషల్‌ ఇన్‌ఫ్రా అందుబాటులోకి రావడంతో శివార్లలోనే సొంతిల్లు కొనుగోలుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. దేశంలోని ఇతర నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో ఈ ట్రెండ్‌ ఎక్కువగా కనిపిస్తోందని బిల్డర్లు అంటున్నారు.

Updated : 15 May 2021 06:53 IST

ఈనాడు, హైదరాబాద్‌

పని ప్రదేశానికి దగ్గరలో ఉండాలి.. మెరుగైన రవాణా సదుపాయాలుండాలి.. ఆసుపత్రులు, పాఠశాలలు, సూపర్‌ మార్కెట్లు, మాల్స్‌, మల్టీప్లెక్స్‌లు చేరువలో ఉండాలి.. ఇవన్నీ కావాలంటే ఒకప్పుడైతే నగరంలోనే సాధ్యం. ఇప్పుడు ఎక్కడికక్కడ శివార్లలోనూ మౌలిక వసతులు మెరుగుపడటం, సోషల్‌ ఇన్‌ఫ్రా అందుబాటులోకి రావడంతో శివార్లలోనే సొంతిల్లు కొనుగోలుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. దేశంలోని ఇతర నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో ఈ ట్రెండ్‌ ఎక్కువగా కనిపిస్తోందని బిల్డర్లు అంటున్నారు.
నగరంలో భూముల లభ్యత తగ్గిపోవడం.. ఉన్న వాటి ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో నిర్మాణదారులు ఎక్కువగా శివారు ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. ఎకరాల విస్తీర్ణంలో గేటెడ్‌ కమ్యూనిటీలను నిర్మిస్తున్నారు. వీటిలో అన్ని వసతులు ఉండటంతో ప్రత్యేకించి నవతరం ఎక్కువగా మొగ్గుచూపుతోంది. 30-40 ఏళ్ల వయసు వారు శివార్లలో సౌకర్యాలున్న ఇళ్లవైపు ఆసక్తి చూపిస్తున్నారు. వీరి వాటానే గరిష్ఠంగా 85 శాతం వరకు ఉందని కొనుగోలుదారుల ఆలోచనలకు దగ్గరగా తాము నిర్మాణాలు చేపడుతున్నామని నిర్మాణదారులు అంటున్నారు.

ఇంటి నుంచే పనితో..
కొవిడ్‌తో కొనుగోలుదారుల ఆలోచనల్లో మార్పులొచ్చాయి. ఇంటి నుంచే పనికావడంతో శివార్లలో నచ్చిన ప్రాంతంలో బడ్జెట్‌లో దొరికిన ఇళ్లను కొనేందుకు ఇష్టపడుతున్నారు. ఐటీ రంగంలో మున్ముందు కూడా వర్క్‌ ఫ్రం హోం ఉంటుందనే సంకేతాలతో అవుటర్‌ చుట్టుపక్కల, మరికొందరు అవుటర్‌ బయట విల్లాలు, వ్యక్తిగత ఇళ్లు కొనుగోలు చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఇటీవల అపార్ట్‌మెంట్ల నిర్మాణం పెరిగింది.  సామాన్య, మధ్య తరగతి నుంచి నుంచి ఉన్నత వర్గాలకు తగ్గ స్థిరాస్తుల కొనుగోలుకు శివారు ప్రాంతం వేదికవుతోంది.

కావాల్సినట్లుగా...
యువతరం.. ఇంటి విషయంలో ఏమాత్రం రాజీపడటం లేదు. విశాలంగా తాము అనుకున్నట్లుగా ఉండాలని కోరుకుంటోంది. అలాంటి ఇళ్లకే మొగ్గు చూపిస్తోంది. విశాలమైన రెండు పడకల గది తమ ప్రాధాన్యమని యువకులు చెబుతున్నారు. తమ బడ్జెట్‌లో ఉంటే మూడు పడకల గదిని ఎంపిక చేసుకుంటున్నారు. ఇలాంటి ఇంటి కోసం రూ.60 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు వెచ్చించేందుకు సిద్ధపడుతున్నారు. విలాసవంతమైన ఇంటికి రూ.కోటిపైన పెడుతున్నారు. ఈ మేరకు కొంత బడ్జెట్‌ను సైతం  పెంచుతున్నారని బిల్డర్లు అంటున్నారు. అదే సమయంలో రుణ భారం కాకుండా ఉన్నంతలోనే కొనుగోలు చేస్తున్న వారు ఉన్నారు. ఈ పోకడలు కొవిడ్‌ అనంతరం కనిపించాయి.

భవిష్యత్‌ కోసం..
కొవిడ్‌ అనంతరం ఫ్లాట్లు, స్థలాలు, భూముల ధరల్లో పెరుగుదల కనిపించింది. ఫలితంగా కొందరు ఇల్లు కొనే ఆలోచన వాయిదా వేసుకుని తమ దగ్గర ఉన్న సొమ్ముతో స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. సొంతింటి కలను వాయిదా వేసుకుని భూముల ధరలు భవిష్యత్‌లో మరింత పెరుగుతాయనే అంచనాతో వీటిపై పెట్టుబడి పెడుతున్నారు. తమ వద్ద ఉన్న సొమ్ముకు పెరిగిన ధరలకు ఇల్లు వచ్చే పరిస్థితి లేదని మరికొందరు స్థలాల వైపు చూస్తున్నారు. భవిష్యత్తులో ఆ స్థలంలోనే ఇంటిని నిర్మించుకునే ఆలోచనలో కొందరుంటే.. మరికొందరు ధరలు పెరగగానే అమ్మేసి నచ్చిన చోట ఇల్లు కొనాలనే ఉద్దేశంతో ఉన్నారు.

ఇటీవలి అధ్యయనం ప్రకారం..

కొవిడ్‌ అనంతరం పరిస్థితులపై దేశవ్యాప్తంగా బిల్డర్లతో నో బ్రోకర్‌ హుడ్‌ సంస్థ సర్వే చేపట్టగా...
* 59 % శివార్లలో ఇళ్లకు అధిక డిమాండ్‌
* 59%  రెండు పడక గదుల ఇళ్లకు మొగ్గు
* 17 % మూడు పడక గదుల ఇళ్ల వైపు
* 85% కొనేవారిలో అత్యధికంగా 30 నుంచి 40 ఏళ్ల వయసు వారు  
* 53 % ధరల్లో 5 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నామన్న నిర్మాణదారులు  
* 40% ఐదు నుంచి పదిశాతం తగ్గింపు ఆఫర్లు ఇచ్చామన్న బిల్డర్లు  
* 87 % రాయితీలతో విక్రయాలు పెరిగాయని అని చెప్పినవారు  
* 59%  నచ్చిన ఇంటికోసం బడ్జెట్‌ కేటాయింపు పెరిగిందని చెప్పిన బిల్డర్లు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని