Published : 26 Jun 2021 02:03 IST

సొంతింటికి శ్రావణ ముహూర్తం

ఈనాడు, హైదరాబాద్‌

స్థిరాస్తి కార్యకలాపాలు గాడిలో పడ్డాయి. కొవిడ్‌ కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ తొలగించడంతో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. వైరస్‌ వ్యాప్తి భయాలతో ఇన్నాళ్లు వాయిదా పడిన స్థిరాస్తుల కొనుగోళ్లు, ఒప్పందాలు గత వారం రోజులుగా వేగం అందుకున్నాయి. ఇంతటి సంక్షోభ సమయంలోనూ కొన్ని ప్రాంతాల్లో స్థిరాస్తుల ధరలు పెరగడంతో మరింత ఆలస్యం చేయవద్దని సొంతింటి కొనుగోళ్లకు సిద్ధపడుతున్నారు. శ్రావణమాసంలో గృహప్రవేశం చేసేలా తొందరపడుతున్నారు.

వేచిచూసే కొద్దీ ధరలు పెరగడమే తప్ప ఎక్కడా తగ్గడం లేదు. దేశంలోని మిగతా నగరాల్లో కొవిడ్‌ అనంతరం స్థిరాస్తుల ధరలు దిగి వచ్చాయి. మన దగ్గర లాక్‌డౌన్‌ మొదటి వేవ్‌ అనంతరం ఎక్కడా తగ్గినా దాఖలాలు కనిపించలేదు. పైగా కొన్ని ప్రాంతాల్లో పెరుగుదల ఉంది. రెండోవేవ్‌ అనంతరం కూడా  ఇంచుమించు ఇలాంటి పరిస్థితే పునరావృతం అవుతోందని మార్కెట్లోని ధరలు చెబుతున్నాయి. దీంతో సొంతింటిపై నిర్ణయం తీసుకునేందుకు సిద్ధపడుతున్నారు. కొనుగోలు చేసే ప్రాంతాలను, అక్కడి ప్రాజెక్ట్‌లను సందర్శించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.

కొత్త ప్రాజెక్టుల ప్రణాళికలు

రాబోయే రోజుల్లో మార్కెట్‌ మరింత పుంజుకుంటుందనే అంచనాలతో నగరంలోని పలు ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్ట్‌లు ప్రారంభించేందుకు నిర్మాణ సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు భూములు ఉండటం వల్ల, లేని చోట డెవలప్‌మెంట్‌ పద్ధతిలో వెంచర్లు వేస్తున్నాయి. ఒక ప్రముఖ సంస్థ ద్వితీయార్థంలో ఒకేసారి పలు ప్రాజెక్టులు ప్రకటించేందుకు సన్నద్ధం అవుతోంది. భూముల వేలంలో స్థలాలు దక్కించుకుని ఆయా ప్రాంతాలకు విస్తరించాలనే ప్రణాళికలో మరికొన్ని సంస్థలు ఉన్నాయి.

శివార్ల వైపే..

నగరంలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేయడంతో శివారు ప్రాంతాల నుంచి ప్రధాన నగరానికి అనుసంధానం మెరుగైంది. ఫ్లైఓవర్లు, ఓఆర్‌ఆర్‌ నుంచి రేడియల్‌ రోడ్లు, లింక్‌రోడ్లు, ప్రతిపాదిత ఎక్స్‌ప్రెస్‌ వేలతో ఆ ప్రాంతాల రూపురేఖలు నెలల వ్యవధిలో మారుతున్నాయి. దీంతో ఇక్కడ ఇళ్లు, భూముల ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. అయినా వేర్వేరు వర్గాలకు తగ్గ బడ్జెట్‌లో ఈ ప్రాంతాల్లో స్థలాలు, వ్యక్తిగత ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, విల్లాలు లభిస్తుండటంతో శివార్లవైపే చూస్తున్నారు. రూ.30 లక్షలకు కూడా ఇక్కడ ఫ్లాట్లు లభిస్తున్నాయి. రూ.80 లక్షల నుంచి రూ.కోటిన్నర ధరల శ్రేణిలో విల్లాలు దొరుకుతున్నాయి. ఓఆర్‌ఆర్‌ చేరువలో ఉండటంతో కొవిడ్‌ అనంతరం వీటికి మంచి డిమాండ్‌ ఏర్పడింది. శ్రావణమాసంలో గృహప్రవేశ ముహూర్తాలు ఉండటంతో ఇప్పుడు  కొంటే తప్ప అప్పటివరకు ఇల్లు సిద్ధం కాదని ఉద్దేశంతో ఎక్కువ మంది వస్తున్నారని ఒక రియల్టర్‌ అన్నారు.

పెట్టుబడి దృష్ట్యా

హైదరాబాద్‌ బయట పలు సంస్థలు పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తున్నాయి. తాజాగా ఒక సంస్థ రూ.2100 కోట్ల పెట్టుబడికి ముందుకొచ్చింది. కొవిడ్‌ ముప్పు తొలగితే మరిన్ని సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టబోతున్నాయి. ఐటీ సంస్థల విస్తరణ, డాటా సెంటర్లు, ఫార్మా సిటీ ప్రయత్నాలు, ప్రాంతీయ వలయ రహదారికి పడుతున్న అడుగులతో మున్ముందు మరింత వృద్ధికి, ఉపాధికి అవకాశం ఉంది. దీంతో వీటి కేంద్రంగా పలు రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు వెంచర్లు వేశాయి.  ఓఆర్‌ఆర్‌ బయట ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తున్నారు. వరంగల్‌, శ్రీశైలం, సాగర్‌ రహదారులు, విజయవాడ, బెంగళూరు జాతీయ రహదారి, మేడ్చల్‌ మార్గం, ముంబయి జాతీయ రహదారి చుట్టుపక్కల ఆవాసాలు విస్తరించడంతో ఇక్కడ కొంటున్నారు. పెట్టుబడి కోసం ఆయా ప్రాంతాల్లో కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు.


పాత ఇళ్లకు గిరాకీ..

కొత్త ఇళ్ల ధరలు నగరంలో అన్ని వర్గాలకు అందుబాటులో లేవు. మౌలిక వసతులున్న ప్రాంతంలో అన్ని సౌకర్యాలున్న ఫ్లాట్‌ కొనుగోలు చేయాలన్నా రూ.కోటి వరకు అవుతోంది. సాధారణ అపార్ట్‌మెంట్లలోనూ రూ.60 లక్షల వరకు చెబుతున్నారు. దీంతో రూ.నలభై, యాభై లక్షల లోపు మాత్రమే ఇంటి కోసం వ్యయం చేయగలిగిన వారు పాత ఫ్లాట్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. మూడునెలలుగా స్తబ్ధుగా ఉండటంతో ప్రస్తుతం వీటి లావాదేవీలు కూడా లాక్‌డౌన్‌ అనంతరం పెరిగాయి. ప్రస్తుతం జరుగుతున్న రిజిస్ట్రేషన్లలో వీటి వాటా ఎక్కువే ఉంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని