విల్లాసాల ఖిల్లాలు

గేటెడ్‌ కమ్యూనిటీ విల్లాలకు ఇటీవల డిమాండ్‌ మరింత పెరిగింది. ప్రశాంతమైన వాతావరణం.. ఆహ్లాదకరమైన పరిసరాలు.. చుట్టూ పచ్చదనం.. మూడంచెల భద్రతా వ్యవస్థ.. సకల సౌకర్యాలు.. ఆధునిక హంగుల కలబోతగా నిర్మిస్తున్న...

Published : 03 Jul 2021 01:09 IST

గేటెడ్‌ కమ్యూనిటీ విల్లాలకు ఇటీవల డిమాండ్‌ మరింత పెరిగింది. ప్రశాంతమైన వాతావరణం.. ఆహ్లాదకరమైన పరిసరాలు.. చుట్టూ పచ్చదనం.. మూడంచెల భద్రతా వ్యవస్థ.. సకల సౌకర్యాలు.. ఆధునిక హంగుల కలబోతగా నిర్మిస్తున్న విల్లాల్లో నివాసానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. కాలంతో పాటూ వచ్చిన మార్పులకు అనుగుణంగా తమ జీవనశైలిని కొనసాగించేందుకు వీటిల్లోకి మారిపోతున్నారు.

నగరం మధ్యలో, వాణిజ్య కేంద్రాలకు దగ్గరగా నివాసం ఉండాలని ఇదివరకు కోరుకునేవారు. ఇప్పుడు కొనుగోలుదారుల ఆలోచనలు మారాయి. ట్రాఫిక్‌కు, కాలుష్యానికి దూరంగా నివసించాలని భావిస్తున్నారు. నగర శివార్ల వైపు చూస్తున్నారు. సాధారణంగా శివార్లలో నివాసాలు విసిరేసినట్లుగా ఉంటాయి. సౌకర్యాలు అంతంతమాత్రమే. ప్రస్తుతం ఇక్కడి విల్లా ప్రాజెక్టులు కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. పది నుంచి వంద ఎకరాల విస్తీర్ణంలో వంద నుంచి ఐదు వందల విల్లాలు ఒకేచోట నిర్మిస్తుండటంతో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. క్లబ్‌ హౌస్‌, ఈత కొలను, ఆట స్థలాలు, అతిథుల కోసం ప్రత్యేక గదులు, పెద్దల కోసం పార్కులు నిర్మిస్తున్నారు. కొత్తగా కొంత స్థలం విద్యాసంస్థల కోసం కేటాయించి ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ను ఏర్పాటు చేయిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల క్లినిక్‌లకు కేటాయిస్తున్నారు. ఇళ్లన్నీ ఒకే తరహాగా అందమైన ఎలివేషన్‌తో తీర్చిదిద్దడం.. ఆధునిక జీవనశైలికి నిర్మాణాలు అద్దం పడుతుంటంతో వీటిలో నివాసానికి ఇష్టపడుతున్నారు. ఐటీ ఉద్యోగులు,  వైద్యులు, ప్రవాస భారతీయులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారస్తులు, విశ్రాంత ఉద్యోగులు ఎక్కువగా విల్లాలను కొనుగోలు చేస్తున్నారని రియల్టర్లు అంటున్నారు. మధ్య తరగతి వారు సైతం తమ పాత ఇళ్లను, స్థలాలను విక్రయించి విల్లాలను కొనుగోలు చేస్తున్నారు.

అనుసంధానం పెరగడం..
రవాణా అనుసంధానం పెరగడం కూడా విల్లాలకు క్రేజ్‌ తీసుకొచ్చింది. నగరంలో రహదారి మౌలిక వసతులు గత ఐదేళ్లలో చాలా మెరుగయ్యాయి. దీంతో దూరం ఎంత అనేది పెద్దగా పట్టించుకోవడం లేదు. విల్లాలు కొనేవారిలో ఎక్కువ మందికి కార్లు ఉండటంతో వీరు ఎక్కడికైనా గంటలో చేరిపోతున్నారు. నగర ట్రాఫిక్‌లో గంటల తరబడి ప్రయాణించే కంటే దూరమైనా సరే ఓఆర్‌ఆర్‌ మీదుగా అంతకంటే వేగంగానే గమ్యస్థానం చేరే అవకాశం ఉంది. దీంతో దూరాన్ని సైతం దగ్గరగానే భావిస్తున్నారు. శివార్లలోని ప్రధాన ప్రాంతాల్లో సోషల్‌ ఇన్‌ఫ్రా పెరగడం కూడా అటువైపు కదిలేలా చేస్తోంది. ఇదివరకు మల్టీఫ్లెక్స్‌లు, షాపింగ్‌కు రావాలంటే కోఠి, అమీర్‌పేట, ఆబిడ్స్‌, బేగంపేట, సికింద్రాబాద్‌ వరకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఎక్కడికక్కడ మైక్రో మార్కెట్లు ఏర్పడ్డాయి. అక్కడ రెస్టారెంట్లు, ఆసుపత్రులు, మల్టీఫ్లెక్స్‌ల వరకు అందుబాటులో ఉన్నాయి.  ఓఆర్‌ఆర్‌ నుంచి ఈ కేంద్రాలకు పది నిమిషాల నుంచి అరగంటలోనే చేరుకునేంత దగ్గరగా ఉంటున్నాయి. ఇవన్నీ విల్లా ప్రాజెక్టులకు కలిసి వస్తున్నాయి. 

ఓఆర్‌ఆర్‌ కేంద్రంగా..
నగరం చుట్టూ బాహ్య వలయ రహదారికి చేరువలో ఎక్కువగా విల్లా ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి.  ఓఆర్‌ఆర్‌ మీదుగా నగరంలోకి ఎక్కడికైనా చేరుకునే అవకాశం ఉండటం సానుకూలంగా మారింది. నగరానికి అన్నివైపులా శ్రీశైలం, సాగర్‌, విజయవాడ, వరంగల్‌, కరీంనగర్‌, ముంబయి రహదారులకు అటు ఇటు ఐదారు కిలోమీటర్ల లోపల ఓఆర్‌ఆర్‌ చేరువగా పెద్ద సంఖ్యలో విల్లాలు కడుతున్నారు. పటాన్‌చెరు, పాటికొల్లూరు, బీరంగూడ, బాచుపల్లి, మల్లంపేట, హయత్‌నగర్‌, సాహేబ్‌నగర్‌, తుర్కయంజాల్‌, యాచారం, తుక్కుగూడ, శంకర్‌పల్లి, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, కొల్లూరు, ఘట్‌కేసర్‌ వైపు ఎక్కువగా నిర్మిస్తున్నారు.

రెండో విల్లాను..
సొంతంగా నివాసం ఉండేందుకు ఒక విల్లాను, పెట్టుబడి దృష్ట్యా రెండో విల్లాను కొనుగోలు చేసేవారు పెరిగారు. కొన్ని ప్రాజెక్టుల్లో వీరి శాతం 30-40 వరకు ఉంటోంది. ప్రాజెక్టులో బుక్‌ చేసిన సమయానికి,  విల్లాలు పూర్తయ్యేసరికి ధరల్లో చాలా పెరుగుదల ఉంటోంది. కొన్నిసార్లు రెట్టింపు అవుతున్నాయి. ఈ కారణంగా కొందరు బుక్‌ చేసి మంచి ధర రాగానే విక్రయిస్తున్నారు. ఇది కూడా విల్లాల డిమాండ్‌కు ఒక కారణంగా కనిపిస్తోంది. ‘మా ప్రాజెక్టు మొదలెట్టినప్పుడు రూ.70-80 లక్షల మధ్యలో ధరలు ఉండేవి. రెండేళ్లలో పూర్తయ్యే సమయానికి వాటి ధరలు వందశాతం పెరిగాయి’ అని మరో రియల్టర్‌ తెలిపారు.

ఏడాదిలోనే సిద్ధం..
హైదరాబాద్‌లో కొనుగోలుదారులు సిద్ధంగా ఉన్న ఇళ్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. విల్లాలకు డిమాండ్‌ పెరగడానికి ఇది కూడా ఒక కారణం. విల్లాలను ఏడాది నుంచి గరిష్ఠంగా రెండేళ్లలో పూర్తి చేస్తున్నారు. ప్రాజెక్టు మొత్తం పూర్తి కాకపోయినా సదరు కొనుగోలుదారుడి విల్లా వరకు బిల్డర్లు సిద్ధం చేస్తున్నారు. అదే బహుళ అంతస్తుల భవనమైతే గేటెడ్‌ కమ్యూనిటీలో మూడునాలుగేళ్లు పడుతుంది. అంతకాలం ఎదురు చూడలేనివారు తమ బడ్జెట్‌లో దొరికితే విల్లాలను కొనేస్తున్నారు.


రూ.కోటి పైనే..

క్కో విల్లాను 137 చదరపు గజాలు మొదలు ఐదు వందల గజాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. అర ఎకరం నుంచి ఎకరం విస్తీర్ణంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులు సైతం ఉన్నాయి. విల్లా సొంతం చేసుకోవాలంటే పెరిగిన ధరల దృష్ట్యా రూ.కోటి పైన కావాలి. చాలా ప్రాజెక్టుల్లో ప్రస్తుతం రూ.1.40 కోట్ల నుంచి రూ.2 కోట్ల మధ్యలో చెబుతున్నారు. విస్తీర్ణం పెరిగే కొద్దీ ధర పెరుగుతుంది. తక్కువలో తక్కువ చదరపు అడుగు రూ.6వేల పైనే చెబుతున్నారు. కోకాపేటకు చేరువలో ఉన్న ప్రాంతాల్లో రూ.3 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు విల్లాలు పలుకుతున్నాయి. ఇక్కడ ధరలు ఎక్కువగా ఉండటంతో పటాన్‌చెరు, బీరంగూడ వైపు కొనుగోలుదారులు చూస్తున్నారు. ఇక్కడ రూ.కోటి నుంచి రూ.రెండు కోట్ల మధ్యలో దొరుకుతున్నాయి. సిటీలోని మిగతా అన్ని ప్రాంతాల్లోనూ  ఇదే స్థాయిలో ధరలు ఉన్నాయి. ‘లాక్‌డౌన్‌ అనంతరం విల్లాల గురించి తెలుసుకునే వారి సంఖ్య పెరిగింది. వారంలో 50-60 మంది అడుగుతున్నారు’ అని బిల్డర్‌ ఒకరు తెలిపారు.

- ఈనాడు, హైదరాబాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని