పోడియం పార్కింగ్‌ ఇలా

బహుళ అంతస్తుల సముదాయాల్లో పోడియం పార్కింగ్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎకరంపైన స్థలంలో నిర్మించే అపార్ట్‌మెంట్లలో వాహనాలు నిలిపేందుకు మూడు నాలుగు సెల్లార్లు తవ్వే పనిలేకుండా పైనే రెండు మూడు అంతస్తుల్లో పార్కింగ్‌ చేసుకునేలా వెలుసుబాటు ఇచ్చింది. ఈ  మేరకు భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు చేసింది....

Published : 10 Jul 2021 02:21 IST

ఈనాడు, హైదరాబాద్‌

హుళ అంతస్తుల సముదాయాల్లో పోడియం పార్కింగ్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎకరంపైన స్థలంలో నిర్మించే అపార్ట్‌మెంట్లలో వాహనాలు నిలిపేందుకు మూడు నాలుగు సెల్లార్లు తవ్వే పనిలేకుండా పైనే రెండు మూడు అంతస్తుల్లో పార్కింగ్‌ చేసుకునేలా వెలుసుబాటు ఇచ్చింది. ఈ  మేరకు భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు చేసింది. పోడియం పార్కింగ్‌ను స్థిరాస్తి సంఘాలు స్వాగతిస్తుండగా.. ఎకరంలోపు కట్టే అపార్ట్‌మెంట్లకు సైతం వర్తింప చేయాలని చిన్న బిల్డర్లు కోరుతున్నారు.

నగరంలో గతేడాది భారీ వర్షాలతో చాలావరకు బహుళ అంతస్తుల గృహ, వాణిజ్య సముదాయాల్లోని సెల్లార్లలోకి వరద చేరింది. పార్కింగ్‌ కోసం నగరంలో మూడు, నాలుగు సెల్లార్లు తవ్వుతున్నారు. అధిక వర్షాలు పడినప్పుడు ఇవి నీటి ఊటలుగా మారుతున్నాయి. దీంతో రోజుల తరబడి భవన పునాదులు వరదకు తడుస్తూ ప్రమాదకరంగా మారాయి. ముఖ్యంగా ఆకాశహర్మ్యాల ప్రాజెక్టుల్లో, వాణిజ్య సముదాయాల్లో మూడు నాలుగు సెల్లార్లు నిర్మిస్తున్నారు. వీటిని తవ్వే క్రమంలో పొరుగున ఉన్న భవనాలు కూలడం, వానాకాలంలో మట్టిపెళ్లలు పడి కూలీలు మృత్యువాత పడటం, రాతినేల వస్తే క్రషర్లు ఉపయోగించడం, తవ్విన మట్టిని చెరువుల్లో పోస్తుండటం వంటి సమస్యలతో ప్రభుత్వం కొత్తగా పోడియం పార్కింగ్‌కు అనుమతి ఇచ్చింది.

నిబంధనలు ఇలా.. 

* ఎకరంపైన స్థలంలో నిర్మించే బహుళ అంతస్తుల గృహ సముదాయాలు రెండు సెల్లార్లకు మించి వెళ్లడానికి వీల్లేదు. వీరు 15 మీటర్ల ఎత్తు వరకు అంటే ఐదు అంతస్తుల వరకు పోడియం పార్కింగ్‌కు కేటాయించుకోవచ్చు. వాణిజ్య భవనాలకు మూడు సెల్లార్ల వరకు అనుమతిస్తారు.

* పది ఎకరాల విస్తీర్ణంలో 4 టవర్లు కట్టినా ఒకటే పోడియం నిర్మించుకోవచ్చు. పది ఎకరాలు దాటితే మాత్రం మరో పోడియం ఉండాల్సిందే.

* అప్రోచ్‌ రోడ్డును బట్టి భవనం ఎత్తుకు అనుమతి ఇస్తారు. పోడియం పార్కింగ్‌ ఎత్తు ఇందులోంచి మినహాయిస్తారు

* 18 అంతస్తుల లోపు భవనమైతే (55 మీటర్ల వరకు) పోడియం అంతస్తుల చుట్టూ 7 మీటర్ల సెట్‌బ్యాక్‌ తప్పనిసరి. ఫైర్‌ ఇంజిన్లు చుట్టూ తిరిగేందుకు వీలుగా మూలల్లో 12 మీటర్ల సెట్‌బ్యాక్‌ వదలాలి

* 55 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు నిర్మించే భవనాల్లో పోడియం అంతస్తుల చుట్టూ 9 మీటర్ల సెట్‌బ్యాక్‌ ఉండాలి. మూలల్లో 14 మీటర్లు ఖాళీ స్థలం వదలాలి. ఈ మేరకు పోడియం ఫ్లోర్‌ డిజైన్‌ రూపొందించుకోవాలి.

* పోడియంపైన నిర్మించే టవర్లకు బిల్డింగ్‌ నిబంధనల మేరకే సెట్‌బ్యాక్‌ వదలాలి. ప్రహరీ నుంచి టవర్ల వరకు 43 అడుగులు వదలాల్సి ఉంటుంది.

* పోడియం అంతస్తులను పూర్తిగా పార్కింగ్‌కే ఉపయోగించాలి. సందర్శకుల లాబీ, డ్రైవర్ల గదులు, మరుగుదొడ్ల వరకు నిర్మించుకోవచ్చు. ఫ్లోర్‌ ఏరియాలో నిర్దిష్ట శాతం వరకు మాత్రమే వీటికి అనుమతి ఉంది.

* పోడియం, రైట్‌ ఆఫ్‌ వే(దారి) మధ్యలో ఎలాంటి గోడల నిర్మాణం చేపట్టరాదు.

వ్యయం పెరుగుతుంది

తక్కువ విస్తీర్ణంలో కట్టే అపార్ట్‌మెంట్లలో పోడియం పార్కింగ్‌ అంటే నిర్మాణ వ్యయం పెరుగుతుందని క్రెడాయ్‌ తెలంగాణ అధ్యక్షుడు సీహెచ్‌ రాంచంద్రారెడ్డి అన్నారు. సాధారణంగా భవనం చుట్టూ 3 నుంచి 3.5. మీటర్ల సెట్‌బ్యాక్‌ వదిలి కడుతుంటారు. సెల్లారులో పార్కింగ్‌తో ఈ మేరకు కింద స్థలం కలిసి వస్తుంది. అదే పోడియం పార్కింగ్‌ అయితే నిర్మాణం చేపట్టిన మేరకే పార్కింగ్‌ స్థలం వస్తుంది. ఇందులో కొంత ర్యాంపులకు పోతుంది.  రెండు సెల్లార్లకు బదులు రెండున్నర నుంచి మూడు స్టిల్ట్‌ల మేర పార్కింగ్‌ కేటాయించాల్సి వస్తుందన్నారు. ఈ మేరకు ఎత్తు పెరిగేకొద్దీ నిర్మాణ వ్యయం పెరుగుతుంది. ఎకరం పైన విస్తీర్ణంలో కట్టే గృహ, వాణిజ్య నిర్మాణాలన్నింటికీ పోడియం పార్కింగ్‌ వర్తిస్తుందనేది జీవోని బట్టి తెలుస్తుంది. వాణిజ్య భవనాల్లో గ్రౌండ్‌ ఫ్లోర్‌ చాలా ముఖ్యం. ఈ స్థలం మినహాయించి పైన పార్కింగ్‌ కట్టొచ్చా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉందన్నారు. ప్రభుత్వం నిబంధనలు మారుస్తూ జీవో ఇచ్చినప్పుడు సందేహాల నివృత్తికి తర్వాత తదుపరి ఉత్తర్వులు ఇస్తుంటుంది. త్వరలోనే స్పష్టత వస్తుందని భావిస్తున్నామని రాంచంద్రారెడ్డి పేర్కొన్నారు. .

అంటే ఏంటి?

ప్రస్తుతం సాధారణ అపార్ట్‌మెంట్లలో ఒక సెల్లార్‌, స్టిల్ట్‌ వరకు పార్కింగ్‌ వదిలి ఆపైన గృహ సముదాయం కడుతున్నారు. ఆకాశహర్మ్యాల్లో పార్కింగ్‌ కోసం మూడు నాలుగు సెల్లారు నిర్మిస్తున్నారు. పోడియం పార్కింగ్‌లో రెండు సెల్లార్లకు మించి వెళ్లకుండా స్టిల్ట్‌, ఆపైన మొదటి, రెండు, మూడు అంతస్తుల్లోనూ పార్కింగ్‌కు కేటాయించవచ్చు. ఆపైన ఇళ్లు వస్తాయి. భవనం ఎత్తు పెరుగుతుంది.

చిన్న బిల్డర్లకు వర్తింపజేయాలి 

ఎకరంపైన విస్తీర్ణంలో కట్టే భవనాలకే పోడియం పార్కింగ్‌కు అవకాశం ఇవ్వడంతో పెద్ద బిల్డర్లకే ప్రయోజనమని నరెడ్కో వెస్ట్‌ జోన్‌ బిల్డర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి లయన్‌ ప్రేమ్‌కుమార్‌ అన్నారు. నిజానికి సెల్లార్ల సమస్య ఎక్కువగా చిన్న బిల్డర్లకే ఉంది. ఓఆర్‌ఆర్‌ లోపల ఎకరం లోపు స్థలంలో కట్టే బిల్డర్లే ఎక్కువగా ఉంటారు. మరీ ముఖ్యంగా 900 గజాల కంటే ఎక్కువ స్థలంలో కట్టే భవనాల కోసం సెల్లార్లు తవ్వాలంటే నగరంలో నరకం కనిపిస్తోందని ఆయన అన్నారు. బండరాళ్లను బ్లాస్టింగ్‌ చేయలేని పరిస్థితి. కూకట్‌పల్లి నుంచి చందానగర్‌ దాకా సెల్లార్ల కోసం నాలుగు అడుగులు తవ్వగానే బండరాళ్లు వస్తున్నాయి. సెల్లార్లు తవ్వకుండా స్టిల్ట్‌ ఆపైన ఒక అంతస్తు పార్కింగ్‌ వదిలిపెడితే అగ్నిమాపక శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి వస్తోంది. 18మీటర్లు దాటితే ఫైర్‌ ఎన్వోసీ తప్పనిసరి. 21 మీటర్లకు పెంచితే చిన్న బిల్డర్లు సైతం సెల్లార్లకు వెళ్లకుండా స్టిల్ట్‌ ఆపైన ఒకటి రెండు అంతస్తులతో పోడియం పార్కింగ్‌ చేపట్టేందుకు అవకాశం ఉంటుందని ప్రేమ్‌కుమార్‌ అన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు 21 మీటర్ల వరకు ఫైర్‌ ఎన్వోసీ లేకుండా అనుమతి ఇస్తున్నా.. తెలంగాణలో మాత్రం ఇవ్వడం లేదు.  ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని చిన్న బిల్డర్లకు పోడియం పార్కింగ్‌కు అనుమతి ఇవ్వాలి. డ్రైవ్‌ వే నుంచి ఒక ర్యాంపు ఇస్తే సరిపోతుందని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని