కలిసి ఉంటే కలదు సౌకర్యం

మారుతున్న జీవనశైలికి అనుగుణంగా నివాసాలు ఉండాలని ఈతరం కోరుకుంటోంది. అందుకోసం నగరంలో గేటెడ్‌ కమ్యూనిటీ బహుళ అంతస్తుల నివాసాల వైపు మొగ్గు చూపుతున్నారు. గేటు దాటాల్సిన పనిలేకుండా కుటుంబంలోని అందరి అవసరాలు ప్రాంగణం లోపల తీర్చేలా ఏర్పాట్లు....

Published : 17 Jul 2021 02:09 IST

పెరుగుతున్న గేటెడ్‌ కమ్యూనిటీ బహుళ అంతస్తుల ప్రాజెక్టులు

ఈనాడు, హైదరాబాద్‌

మారుతున్న జీవనశైలికి అనుగుణంగా నివాసాలు ఉండాలని ఈతరం కోరుకుంటోంది. అందుకోసం నగరంలో గేటెడ్‌ కమ్యూనిటీ బహుళ అంతస్తుల నివాసాల వైపు మొగ్గు చూపుతున్నారు. గేటు దాటాల్సిన పనిలేకుండా కుటుంబంలోని అందరి అవసరాలు ప్రాంగణం లోపల తీర్చేలా ఏర్పాట్లు చేస్తుండటంతో వీటిలో ఫ్లాట్లు కొంటున్నారు. కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన ఉండటంతో కొన్నేళ్లుగా కొత్త ప్రాజెక్టుల్లో అత్యధికం గేటెడ్‌ కమ్యూనిటీలే ఉంటున్నాయని స్థిరాస్తి వర్గాలు అంటున్నాయి. 

నగరంలో ఇదివరకు పెద్ద కాలనీలు ఉండేవి. విశాలమైన రహదారులు, చెట్లు, పార్కులు, కమ్యూనిటీ హాళ్లతో ప్రశాంతమైన వాతావరణంలో అక్కడ ఇళ్లు కొన్నవారు నివసించేవారు. జనాభా పెరిగే కొద్దీ చాలా కాలనీల్లో వాణిజ్య భవనాలు రావడం మొదలైంది. వ్యక్తిగత ఇళ్లు సైతం బహుళ అంతస్తులుగా మారిపోతున్నాయి. రహదారులపై వాహనాల రద్దీ పెరిగింది.  ఉదయం పూట భయం లేకుండా కనీసం వాకింగ్‌ చేసే పరిస్థితులు లేవు. పైగా ఎక్కడికి వెళ్లాలన్నా వాహనం బయటికి తీయాల్సిందే. ఈ నేపథ్యంలో ఇళ్లు కొనేవారి అవసరాలు గుర్తించిన స్థిరాస్తి సంస్థలు ఇంటిల్లిపాదికీ కావాల్సిన సౌకర్యాలను ప్రాంగణంలోనే ఏర్పాటు చేసేలా గేటెడ్‌ కమ్యూనిటీలను నిర్మిస్తున్నాయి.

సకలం అక్కడే..

ఉదయం లేవగానే నడిచేందుకు వాకింగ్‌ ట్రాక్‌లు.. అక్కడే జిమ్‌, వారాంతంలో ఆడుకునేందుకు ఇండోర్‌, అవుట్‌డోర్‌ ఆట స్థలాలు.. పిల్లలకు, పెద్దలకు ప్రత్యేకంగా పార్క్‌లు, ఒంటరితనం లేకుండా అందరితో కలిసిపోయి సేద తీరేందుకు క్లబ్‌హౌస్‌.. ఇంటిల్లిపాది అవసరాల కోసం సూపర్‌మార్కెట్లు, ఫుడ్‌ కోర్టులు, బంధుమిత్రులు వస్తే ఉండేందుకు అతిథి గృహాల వరకు ఒక్కటేమిటి సకలం లోపలే లభించేలా నిర్మాణాలు చేపడుతుండటంతో వీటి వైపు ఆకర్షితులవుతున్నారు. కమ్యూనిటీలో కలిసి ఉంటే కలదు ప్రయోజనమని నిరూపిస్తున్నారు.

రక్షణకు ఢోకా ఉండదని..

గేటెడ్‌ కమ్యూనిటీ బహుళ అంతస్తుల ప్రాజెక్టులు ఎక్కువగా రెండు మూడు ఎకరాలు మొదలు ఆపై పదుల సంఖ్యలోని ఎకరాల్లో నిర్మాణం చేపడుతున్నారు. 5 నుంచి 40 అంతస్తుల వరకు ఉంటున్నాయి. ఎక్కువగా ఇవి భవిష్యత్తులో అభివృద్ధి చెందబోయే ప్రాంతాల్లోనే చేపడుతున్నారు. ఇలాంటి చోట భద్రత దృష్ట్యా వ్యక్తిగత ఇళ్లకంటే బహుళ అంతస్తులు అందునా గేటెడ్‌ కమ్యూనిటీ మేలు అంటున్నారు. వీటిలో మూడంచెల భద్రతా వ్యవస్థ ఉండటమే వీరి భరోసాకి కారణం. 24 గంటలపాటూ కాపలాదారులు ఉంటారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది.  ఎవరైనా కొత్తవారు కమ్యూనిటీలోకి ప్రవేశించాలంటే ఇంటి యజమాని అనుమతిస్తేనే లోపలికి పంపిస్తారు. పైగా భార్యభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తుండటంతో  ఉదయం నుంచి రాత్రివరకు ఇంటి భద్రత గురించి.. పిల్లల సంరక్షణ గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. చిన్నారుల కోసం పిల్లల బడులు ఉంటాయి. ధైర్యంగా ఇంటిని, పిల్లలను విడిచి కొలువు చేసుకోవచ్చు అనే ధీమా కూడా వీటిలో కొనడానికి కారణం అంటున్నారు బిల్డర్లు.

బడ్జెట్టే ప్రధానం..

గేటెడ్‌ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్‌ విస్తీర్ణం, ప్రాజెక్టు ప్రాంతాన్ని బట్టి ధరలు ఉన్నాయి. రూ.60 లక్షలు మొదలు రూ.నాలుగైదు కోట్ల వరకు ధర పలుకుతున్నాయి. శివార్లలో బడ్జెట్‌ ధరల్లో నిర్మిస్తుంటే.. నగరంలో, ఐటీ కారిడార్‌లో ప్రీమియం ప్రాజెక్టులు చేపడుతున్నారు. ఐటీ కారిడార్‌లో ఆకాశహర్మ్యాలను నిర్మిస్తుంటే.. మిగతా ప్రాంతాల్లో ఐదు అంతస్తుల్లోనే భారీ ప్రాజెక్టులు కడుతున్నారు. వీటిలో నిర్వహణను ప్రత్యేకంగా ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌కు ఇస్తుంటారు. పారిశుద్ధ్యం దగ్గర్నుంచి మరమ్మతుల వరకు అన్నీ వీరే చూసుకుంటారు కాబట్టి వీటికోసం ఫ్లాట్‌ యజమానులు సమయం వృథా చేసుకోకుండా కుటుంబం, వృత్తిపైన కేటాయించేందుకు అవకాశం ఉంటుందని నిర్మాణదారులు అంటున్నారు.

వీటికి డిమాండ్‌..

ఆధునిక బహుళ అంతస్తుల నివాసాల్లో విశాలమైన కారిడార్లు ఉంటాయి. అపార్ట్‌మెంటే అయినా వ్యక్తిగత గృహం మాదిరి ప్రైవసీకి ఇబ్బంది లేకుండా నిర్మిస్తున్నారు. కొన్ని ప్రాజెక్టుల్లో ఫ్లోర్‌ మొత్తం ఒకే ఫ్లాట్‌ ఉంటుంది. వీటిలోనే డ్లూప్లెక్స్‌లు కడుతున్నారు. అయితే ఎక్కువగా 2.5 పడకల, 3 పడకల గదులకు డిమాండ్‌ అధికంగా ఉంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని