చదరపు గజం రూ.పదివేల నుంచి..

నగరంలో రూ.పదివేలకు గజం స్థలం ఎక్కడైనా దొరుకుతుందా..? అవుటర్‌ రింగ్‌రోడ్డు గ్రోత్‌ కారిడార్‌ బయట ఈ ధరలకు స్థలాలు అందుబాటులో ఉన్నాయి. కొత్త వెంచర్లలో రూ.12వేల నుంచి చెబుతుంటే.. పాత వెంచర్లలో రూ.పదివేలు, అంతకంటే తక్కువ ధరకే కొన్ని ప్రాంతాల్లో స్థలాలు దొరుకుతున్నాయి...

Published : 31 Jul 2021 01:00 IST

విల్లా ప్రాజెక్టులతో ఆ ప్రాంతాలకు పెరుగుతున్న ఆదరణ

‘గ్రోత్‌’ కారిడార్‌ బయట అందుబాటు

ఈనాడు, హైదరాబాద్‌

నగరంలో రూ.పదివేలకు గజం స్థలం ఎక్కడైనా దొరుకుతుందా..? అవుటర్‌ రింగ్‌రోడ్డు గ్రోత్‌ కారిడార్‌ బయట ఈ ధరలకు స్థలాలు అందుబాటులో ఉన్నాయి. కొత్త వెంచర్లలో రూ.12వేల నుంచి చెబుతుంటే.. పాత వెంచర్లలో రూ.పదివేలు, అంతకంటే తక్కువ ధరకే కొన్ని ప్రాంతాల్లో స్థలాలు దొరుకుతున్నాయి. వచ్చే ఐదు పదేళ్లలో ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి,  పిల్లల భవిష్యత్తు దృష్ట్యా దీర్ఘకాలానికి పెట్టుబడి పెట్టాలనుకునే వారికి, బట్జెట్‌ శ్రేణిలో స్థలాలు గ్రోత్‌ కారిడార్‌ వెంట అందుబాటులో ఉన్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించి ‘ఈనాడు’ అందిస్తున్న ప్రత్యేక కథనం.

* అవుటర్‌కు అటు ఇటు ఒక కిలోమీటరు పొడవునా గ్రోత్‌ కారిడార్‌ ఉంటుంది. ఇందులో వాణిజ్య, వ్యాపార, విద్యా, నివాస, వినోద కేంద్రాలను వేటినైనా నిర్మించుకోవచ్చు. మల్టీజోన్‌గా ఉండటంతో డిమాండ్‌ అధికంగా ఉంది.  ఇప్పటికే వీటిలో లేఅవుట్లు వేసి చాలాకాలం క్రితమే స్థలాలు విక్రయించారు. ఇప్పుడు అక్కడ నిర్మాణాలు వస్తున్నాయి. అవుటర్‌కు ఇరువైపులా గ్రోత్‌కారిడార్‌లో ఇదే పరిస్థితి. బడ్జెట్‌లో దొరకాలంటే గ్రోత్‌కారిడార్‌ బయట వరకు వెళ్లాల్సిందే.

*  శంషాబాద్‌ నుంచి కొహెడ వరకు అవుటర్‌ గ్రోత్‌ కారిడార్‌ బయట పలు సంస్థలు కొత్త వెంచర్లు వేశాయి. కొన్ని సంస్థలు పాత వెంచర్లలో మిగిలిన ఫ్లాట్లను విక్రయిస్తున్నాయి. ఇంకొన్ని చోట్ల రీసేల్స్‌ జరుగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో ఫార్మాసిటీ పేరుతోనే ఎక్కువగా రియల్‌ వ్యాపారం జరుగుతోంది. 

* అవుటర్‌లో ప్రధాన కూడళ్లుగా ఉన్న శంషాబాద్‌, తుక్కుగూడ, బొంగుళూరు, పెద్ద అంబర్‌పేట కేంద్రాల నుంచి ఎనిమిది నుంచి పదికిలోమీటర్ల దూరంలో ఎక్కువగా నివాస వెంచర్లు అందుబాటులో ఉన్నాయి. దాదాపు అన్నీ  హెచ్‌ఎండీఏ వెంచర్లే. విజయవాడ జాతీయ రహదారి, నాగార్జున సాగర్‌ రహదారి, శ్రీశైలం, బెంగళూరు జాతీయ రహదారులకు ఈ వెంచర్లు ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అవుటర్‌ నుంచి ప్రతిపాదిత వంద అడుగుల రహదారులు ఉన్నాయి. భవిష్యత్తులో ఈ రహదారులు వేస్తే ఆయా లేఅవుట్లకు అవుటర్‌ సైతం మూడు నుంచి ఐదు కిలోమీటర్ల లోపలే ఉంటుంది.

* శంషాబాద్‌ దాటాక అవుటర్‌ బయట నందిపల్లె, నాగారం, మన్సాన్‌పల్లి, గంగారం తండా, కొత్త తండా వరకు కొత్త వెంచర్లు ఎక్కువగా లేవు. పాత వెంచర్లలో చదరపు గజం రూ.పదివేల లోపు దొరుకుతున్నాయి. రూ.ఐదారు వేలకు దొరుకున్న స్థలాలు అందుబాటులో ఉన్నాయి. త్రిపుల్‌ వన్‌ జీవో కొంత ప్రతికూలంగా ఉన్నా.. అవుటర్‌కు చేరువగా ఉండటం, మహేశ్వరంలో హార్డ్‌వేర్‌ పార్కు రావడంతో రహదారుల విస్తరణ, భవిష్యత్తులో ఇక్కడికి చేరువలో రాబోయే టౌన్‌షిప్పు ప్రాజెక్టుతో ప్రాంతం రూపురేఖలు మారిపోతాయని అంచనా స్థిరాస్తి వర్గాలు అంచనా వేస్తున్నాయి.  ఇక్కడ సైతం అవుటర్‌కు, అప్రోచ్‌ రోడ్డుకు దగ్గరలో ఉన్న స్థలాలు ఎక్కువ ధర పలుకుతున్నాయి.

* తుక్కుగూడ నుంచి అవుటర్‌ బయట కుడివైపు మహేశ్వరం మార్గంలో సిరిగిరిపురం, గంగారం, పులిమామిడి మార్గంలో వెంచర్లు ఉన్నాయి. కొత్తవాటిలో చదరపు గజం రూ.12వేల నుంచి చెబుతున్నారు. పాతవాటిలో రూ.పదివేలకు విక్రయిస్తున్నారు. మహేశ్వరం ఊరికి చేరువలో కాస్త ఎక్కువ ధరే ఉంది. శ్రీశైలం రహదారికి చేరువయ్యేకొద్దీ చదరపు గజం రూ.పాతికవేల వరకు చెబుతున్నారు. ఈ మార్గంలో ఎక్కవగా పాత వెంచర్లే ఉన్నాయి. విల్లా ప్రాజెక్టులు చేపడుతున్నారు. హర్షగూడ, మంఖాల్‌, ఇమాంగూడ అవుటర్‌కు చేరువలో ఉన్నాయి. ఇక్కడ వెంచర్లలో ఇళ్లు రూ.కోటిపైనే చెబుతున్నారు. ఫార్మాసిటీ ప్రారంభంతో ఈప్రాంతానికి మరింత డిమాండ్‌ ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. మహేశ్వరంలో హార్డ్‌వేర్‌ పార్కులో కంపెనీలు వస్తుండటంతో నిర్మాణాలు పెరుగుతున్నాయి. 

* బొంగుళూరు నుంచి సాగర్‌ రహదారి కుడివైపు మంగల్‌పల్లి వైపు గతంలోనే పెద్ద ఎత్తున వెంచర్లు వేశారు. రీసేల్స్‌ జరుగుతున్నాయి. చదరపు గజం రూ.పదిహేను వేల వరకు చెబుతున్నారు. ప్రధాన రహదారిపైన ధర ఇంకా ఎక్కువే ఉందంటున్నారు. లోపలికి వెళితే పదివేల ధరల్లోనే దొరుకుతున్నాయి. సాగర్‌ నుంచి శ్రీశైలం మార్గం వరకు పాత రహదారి ఉంది. కొంగరకలాన్‌లోని కొత్త కలెక్టరేట్‌ వరకు విశాలమైన రహదారి ఉండటం, అవుటర్‌కు చేరువలో ఉండటం కలిసొచ్చే అంశం. కలెక్టరేట్‌, ఫార్మాసిటీ ఫ్రారంభం తర్వాత ఈ ప్రాంతం మరింత వృద్ధి పథంలో ఉంటుందని చెబుతున్నారు.

* బొంగుళూరు నుంచి సాగర్‌ రహదారి ఎడమవైపు రాందాస్‌పల్లి మార్గంలోనూ బడ్జెట్‌ ధరల్లో వెంచర్లు అందుబాటులో ఉన్నాయి. అవుటర్‌ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో కొండల మధ్య వెంచర్లు ఉన్నాయి. అక్కడ కూడా పదివేలపైన చదరపు గజం ధర చెబుతున్నారు. అవుటర్‌కు చేరువలో ఉన్న వాటిలో చదరపు గజం రూ.12వేల నుంచి రూ.15వేల వరకు ఉంటోంది. ప్రస్తుతానికి అవుటర్‌ వరకు చిన్న రహదారులు ఉన్నాయి. భవిష్యత్తులో వంద అడుగుల రహదారికి విస్తరించే అవకాశం ఉందని చెబుతున్నారు. చేరువలో బీడీఎల్‌, ఆక్టోపప్‌ వంటి సంస్థలు ఉన్నాయి. భవిష్యత్తులో రహదారులు విస్తరిస్తే అటు విజయవాడ, ఇటు నాగార్జునసాగర్‌కు అనుసంధానం పెరుగుతుందని చెబుతున్నారు.

* తక్కుగూడ నుంచి అవుటర్‌ బయట ఎడమ వైపు లేమూరు మార్గంలో కొత్త వెంచర్లు ఎక్కువగా వస్తున్నాయి. రహదారి విస్తరణతో రెండుమూడేళ్లకే చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇప్పటికే పలు ప్రముఖ సంస్థల విల్లా ప్రాజెక్టులు వస్తుండటంతో ఈ మార్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సరస్వతిగూడ, ఆగర్మియగూడ, లేమూరు, రాచలూరు ప్రాంతాల్లో చదరపు గజం కొత్త వెంచర్లలో రూ.14వేల నుంచి చెబుతున్నారు. పాతవాటిలో ఇంకా తక్కువ ధరకే విక్రయిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని