మలిదశలో.. మహదానందంగా..!
వృద్ధులకు ప్రత్యేక ఇళ్లు
వారి అవసరాలకు అనుగుణంగా నిర్మాణం
ఈనాడు, హైదరాబాద్: గృహ నిర్మాణంలో కొనుగోలుదారుల అవసరాలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు మార్పులు వస్తున్నాయి. జనాభాలో వృద్ధుల (సీనియర్ సిటిజన్లు) సంఖ్య పెరుగుతుండటంతో వీరి అవసరాలకు అనుగుణంగా నిర్మాణ సంస్థలు రిటైర్‌మెంట్ హోమ్స్ నిర్మిస్తున్నాయి. ఇంటి డిజైన్‌లో వారికి తగిన సౌకర్యాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రత్యేకంగా గేటెడ్ కమ్యూనిటీలను అభివృద్ధి చేస్తున్నాయి. నగరంలో చాలాకాలం క్రితమే ఈ పోకడ మొదలైనా.. ఇటీవల మరింత పుంజుకొంది. విదేశాల్లోని పద్ధతులను అనుకరిస్తూ.. మన అవసరాలకు కావాల్సిన విధంగా భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఉల్లాసంగా గడిపేలా ఈ ఇళ్లను తీర్చిదిద్దుతున్నారు. నిర్వహణ తేలిగ్గా ఉండేలా ఇంటిని తక్కువ విస్తీర్ణంలో నిర్మిస్తూ ఇతర అవసరాలకు ఎక్కువ స్థలం కేటాయిస్తున్నారు. విల్లాలైతే ఒకటే అంతస్తులో కడుతున్నారు. ఒకటి, రెండు పడకగదుల నిర్మాణాలే వీటిలో ఎక్కువ.
అవుటర్ చుట్టుపక్కల..
నగర జీవనశైలిలో వేగంగా వస్తున్న మార్పులను రియల్ ఎస్టేట్ రంగం అందిపుచ్చుకుంటోంది. ఒకప్పుడు యువతరం ఎక్కువగా ఉన్న నగరంగా పేరుండగా, క్రమంగా వృద్ధుల జనాభా ఎక్కువవుతోంది. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ప్రశాంతమైన జీవనం గడపాలని కోరుకునే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. గతంలో పిల్లలతో పాటే పెద్దలూ ఉండేవారు. ప్రస్తుతం పిల్లలు ఉన్నత విద్యకు, ఉద్యోగాలకు విదేశాలు, ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారు. వారు అక్కడే స్థిరపడుతుండడంతో వృద్ధులు ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో వారి అవసరాలను తీర్చేలా పలు సంస్థలు ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాయి. అపార్ట్‌మెంట్లు, విల్లా ప్రాజెక్టులను శివార్లలో అందుబాటులోకి తెస్తున్నాయి. నగరంలో ఎక్కడికైనా గంటలో చేరుకునే వీలుండే అవుటర్ చుట్టుపక్కల ఈ ప్రాజెక్టులు చేపడుతున్నారు.
నిర్మాణంలో జాగ్రత్తలు
సాధారణంగా వృద్ధాప్యంలో అనేక ఆరోగ్య సమస్యలు ఉంటాయి. పట్టుతప్పి స్నానాలగదిలో లేదా ఇతర గదుల్లో జారి పడిపోతుంటారు. ఇది కొన్నిసార్లు ప్రాణాపాయానికి దారి తీస్తుంది. ఈ విషయం దృష్టిలో ఉంచుకొని రిటైర్‌మెంట్ హోమ్స్‌లో టైల్స్ విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. యాంటీ స్కిడ్ టైల్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. స్నానాలగదిలో గ్రాబ్ బార్స్, మెట్లు, ఇతరత్రా అవసరమైన చోట్ల పట్టుకునేందుకు వీలుగా హ్యాండ్ బార్లు ఏర్పాటు చేస్తున్నారు. మోకాళ్ల నొప్పులతో మెట్ల ఎక్కలేక ఇబ్బంది పడేవారి కోసం అవసరమైన చోట ర్యాంపులు, వీల్‌ఛైర్ పట్టేలా తలుపుల వరకు నిర్మాణం.. వంటి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
సాంకేతికత దన్నుగా..
స్నానాల గది డోర్ లాక్ అయినా.. అక్కడే పడిపోయినా బయట ఉన్నవారికి తెలియకపోతే వారిని వెంటనే వెలుపలకు తీసుకొచ్చేందుకు అవకాశం ఉండదు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు, సిబ్బందికి సమాచారం చేరవేసే విధంగా స్నానాల గదిలో, లివింగ్ రూంలో ఇంటర్‌కామ్ సదుపాయం కల్పిస్తున్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇతరుల సాయం కోరేందుకు పడకగదుల్లో, స్నానాల గదుల్లో ప్యానిక్ బటన్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ మీట నొక్కితే ఎవరో ఒకరు వచ్చి పరిస్థితిని తెలుసుకొని కాపాడే అవకాశం ఉంటుందని నిర్మాణ సంస్థలు చెబుతున్నాయి.
ఎల్లవేళలా వైద్య సౌకర్యం..
ఆరు పదుల వయసులో అత్యవసర వైద్య సేవలు చాలా ముఖ్యం. రిటైర్‌మెంట్ హోమ్స్‌లో వీటికి పెద్ద పీట వేస్తున్నారు. కమ్యూనిటీలోనే ప్రాథమిక వైద్యశాల ఏర్పాటు చేసి వైద్యులు, నర్సింగ్ సేవలు అందేలా చూస్తున్నారు. ఏదైనా అనుకోని ఆపద వచ్చినప్పుడు ప్రథమ చికిత్స అందించి పెద్దాసుపత్రులకు తరలించేందుకు వీలుగా అంబులెన్స్ అందుబాటులో ఉంచుతున్నారు.
కమ్యూనిటీ కిచెన్..
వృద్ధులకు సమయానికి భోజనం ఎంతో అవసరం. ఇందుకోసం విశాలమైన స్థలంలో కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటు చేస్తున్నారు. ఓపిక ఉన్నవారు ఇక్కడికి వచ్చి భోజనం చేయవచ్చు. రాలేని వారు మూడు పూటలా ఇంటికే భోజనం తెప్పించుకోవచ్చు. పెద్దల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆరోగ్యకరమైన వంటకాలు ఇక్కడ తయారు చేస్తారు.
ఉల్లాసంగా గడిపేలా..
ఉదయం, సాయంత్రం నడకకు వీలుగా ట్రాక్‌లు, యోగా, ధ్యానం చేసుకునేందుకు ఏర్పాట్లు, ప్రకృతి మధ్య గడిపేలా గార్డెనింగ్, పుస్తకాలతో కాలక్షేపం చేసేందుకు గ్రంథాలయం, క్లబ్‌హౌస్ తదితర సౌకర్యాలతో రిటైర్‌మెంట్ హోమ్స్ నిర్మిస్తున్నారు.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Hyderabad: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
-
Sports News
Ruturaj Gaikwad: ఐర్లాండ్‌తో తొలి పోరులో రుతురాజ్ ఎందుకు ఆడలేదంటే?
-
Politics News
Andhra News: అమరావతిని శ్మశానమని.. ఇప్పుడు ఎకరా ₹10 కోట్లకు అమ్ముతారా?: చంద్రబాబు
-
India News
Maharashtra: ‘మహా’ సంక్షోభం.. శిందే వర్గానికి సుప్రీం ఊరట..!
-
India News
Presidential Election: ఇద్దరు వ్యక్తులు కాదు.. రెండు సిద్ధాంతాల మధ్య పోరు!
-
Business News
Stock market: వరుసగా మూడో రోజూ లాభాల్లో సూచీలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- Aliabhatt: తల్లికాబోతున్న నటి ఆలియా భట్
- IND vs IRL: కూనపై అలవోకగా..
- Chiranjeevi: చిరు మాటలకు రావురమేశ్ ఉద్వేగం.. వీడియో వైరల్
- Andhra News: సభాపతి ప్రసంగం.. వెలవెలబోయిన ప్రాంగణం
- Chandrakant Pandit : చందునా.. మజాకా!
- Tollywood: టాలీవుడ్ ప్రోగ్రెస్ రిపోర్ట్.. ఆర్నెల్లలో హిట్ ఏది, ఫట్ ఏది?
- Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
- చెరువు చేనైంది