మాటల కంటే చూపిస్తే పోలా!

నగరంలో కొత్త రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులు ఇటీవల వరసగా ప్రారంభం అవుతున్నాయి. మొదట్లోనే బుక్‌ చేస్తే తక్కువ ధరకు వస్తుందని ఎక్కువ మంది కొనేందుకు ముందుకొస్తున్నారు. ప్రముఖ సంస్థలు తమ బ్రాండింగ్‌తో విక్రయిస్తుంటే... వీటికి పోటీగా వస్తున్న పలు సంస్థలు నమూనా ఇళ్లతో కొనుగోలుదారుల విశ్వాసం చూరగొనే ప్రయత్నం చేస్తున్నాయి.

Updated : 18 Sep 2021 06:26 IST

నమూనా ఇళ్లతో ఆకట్టుకునేలా..

ఈనాడు, హైదరాబాద్‌

నగరంలో కొత్త రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులు ఇటీవల వరసగా ప్రారంభం అవుతున్నాయి. మొదట్లోనే బుక్‌ చేస్తే తక్కువ ధరకు వస్తుందని ఎక్కువ మంది కొనేందుకు ముందుకొస్తున్నారు. ప్రముఖ సంస్థలు తమ బ్రాండింగ్‌తో విక్రయిస్తుంటే... వీటికి పోటీగా వస్తున్న పలు సంస్థలు నమూనా ఇళ్లతో కొనుగోలుదారుల విశ్వాసం చూరగొనే ప్రయత్నం చేస్తున్నాయి. కొవిడ్‌ అనంతరం ప్రాజెక్టు సందర్శన తగ్గిపోవడంతో క్రమంగా కొనుగోలుదారులను రప్పించేందుకు నమూనా ఇళ్ళు నిర్మిస్తున్నారు. అపార్ట్‌మెంట్‌, విల్లా ప్రాజెక్ట్‌ ఏదైనా గానీ మొదట మోడల్‌ హౌస్‌ నిర్మించి కొనుగోలుదారులకు చూపిస్తున్నారు. మరికొందరు నిర్మాణదారులు అందివచ్చిన వర్చువల్‌ రియాలిటీ సాంకేతికతతో కట్టబోయే ఇళ్లు ఎలా ఉంటుందో కళ్లకు కడుతున్నారు.
సొంతిల్లు ఒకసారి కొంటే మళ్లీ మారడం ఉండదు కాబట్టి.. తాము కోరుకున్నట్లు ఉండాలని ఎక్కువ మంది భావిస్తుంటారు. అందుకోసం చాలా ప్రాజెక్ట్‌లను సందర్శిస్తుంటారు. నచ్చిన ప్రాజెక్టులో ఇంటి ప్లాన్‌ చూసి ముందడుగు వేసినా ఇల్లు పూర్తయ్యేవరకు స్పష్టత ఉండదు. పూర్తయ్యాక చూస్తే తాము ఇలా వస్తుందనుకోలేదని వాపోతుంటారు. కేవలం సామాన్య, మధ్యతరగతి వాసుల్లోనే కాదు.. విలాసవంతమైన ఇళ్లు, ఫ్లాట్‌ కొనేవారిలో సైతం ఇటువంటి అసంతృప్తులే ఉంటాయి. అప్పటికే నిర్మాణం దాదాపుగా పూర్తయ్యే దశలో ఉంటుంది కాబట్టి ఏం చేయలేని పరిస్థితి. రాజీపడి ఉండిపోవాల్సి వస్తుంది. ప్రస్తుతం వర్చువల్‌ రియాలిటీలో చూపిస్తున్నా.. ప్రత్యక్షంగా నిర్మాణం చూస్తే తప్ప చాలా మంది సంతృప్తి చెందరు. అలాంటి వారికోసమే అన్నట్లుగా కొందరు బిల్డర్లు నమూనా ఇళ్లను కట్టి మరీ చూపిస్తున్నారు. వీకెండ్‌ హోమ్స్‌, రిటైర్మెంట్‌ హోమ్స్‌ వంటి పలు కొత్త పోకడలతో రియల్టర్లు ముందుకొస్తుండటంతో వాటిని పరిచయం చేసేందుకు సైతం వీటిని కట్టక తప్పడం లేదు.

ఉపయోగించే సామగ్రితో సహా..

నిర్మాణ రంగంలో ఇటీవల కాలంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇటుకలతో కాకుండా గోడలు సైతం కాంక్రీట్‌తోనే నిర్మించే మేవాన్‌ సాంకేతికత వచ్చింది. ఆకాశహర్మ్యాలను వీటితోనే కడుతున్నారు. కిటికీలు, తలుపులకు కలప వినియోగించడానికి కాలం చెల్లింది. యూపీవీసీ కిటికీలు వచ్చాయి. ఉపయోగించే టైల్స్‌ దగ్గర్నుంచి.. స్నానాల గదుల్లోని కమోడ్‌ల వరకు తాము ఎలాంటివి వాడుతున్నామో నమూనా ఫ్లాట్‌ ద్వారా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటీరియర్స్‌తో తీర్చిదిద్దుతున్నారు. గ్రానైట్స్‌, టైల్స్‌, ఫాల్స్‌ సీలింగ్‌, ఫర్నిచర్‌, బెడ్స్‌, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలతో అందమైన ఇంటిని తయారు చేస్తున్నారు.  ఎలక్ట్రికల్‌ పాయింట్లు, ఏసీ పాయింట్లు, ఫ్రిజ్‌కు స్థలం.. ఇలా ఇంటి అవసరాలకు తగ్గట్టుగా స్థలాన్ని సర్దుబాటు చేస్తున్నారు. అన్నింటికీ అన్నీ పొందికగా కుదిరేలా అలంకరిస్తున్నారు. వీటిని చూపే బుకింగ్స్‌ చేస్తున్నారు. చెప్పిన దానికంటే నేరుగా చూడటం వల్ల కొనుగోలుదారుడు సైతం ఒక నిర్ణయానికి రావడానికి దోహదం చేస్తుందంటున్నారు. మోడల్‌ హౌస్‌లు నిర్మించిన ప్రాజెక్టుల్లో మిగతా వాటికంటే బుకింగ్‌లు త్వరగా జరుగుతున్నాయి.


సైట్‌లోనే..

వ్యక్తిగత ఇళ్లు, విల్లాలైతే అదే చోట ముందుగా నమూనా కట్టడం సులువు. దీన్ని చూపించి మిగతా విక్రయాలు చేస్తుంటారు. అదే అపార్ట్‌మెంట్‌లో నమూనా ఫ్లాట్‌ ఆరంభంలో సాధ్యం కాదు కాబట్టి సమీపంలో తాత్కాలికంగా  కడుతుంటారు. అక్కడే సేల్స్‌ కార్యాలయం కూడా ఉంటుంది. సాధారణంగా సైట్‌కు సమీపంలోనే వీటి ఏర్పాట్లు ఉంటాయి. అపార్ట్‌మెంట్‌ పూర్తయ్యి.. ఫ్లాట్‌లోకి వెళితే ఎలా ఉంటుందో అంతే విస్తీర్ణంలో అచ్చు అలాగే కడతారు. చాలావరకు వీటిలో తాత్కాలిక నిర్మాణాలే ఉంటాయి.


అంచనాకు రావొచ్చు

* నమూనా ఫ్లాట్‌ను చూడటం ద్వారా కచ్చితంగా ఇంట్లో ఎంత స్థలం ఉంటుందో అంచనాకు రావొచ్చు. చాలా మంది కొన్నాక.. ఫ్లాట్‌ ఇరుకైంది.. పడక గది మరీ చిన్నదిగా ఉంది.. అమ్మేసి మరోటి కొనుక్కోవాలి అంటుంటారు. ముందే చూస్తే చిన్నగా అనిపిస్తే.. బడ్జెట్‌ను బట్టి ఎక్కువ విస్తీర్ణం కలిగిన మరో ఫ్లాట్‌ను ఎంపిక చేసుకోవచ్చు.

* చెబుతున్న ధరలో ఏమేం వస్తాయి? ఏమేం రావు అనేది స్పష్టత తీసుకోవాలి.

* ఒకవేళ నమూనాలో చూపించిన విధంగానే ఇంటీరియర్స్‌తో కావాలంటే అదనంగా ఎంత చెల్లించాలనే విషయాలను అడిగి తెలుసుకోవచ్చు.

* నమూనాలో చూపించిన నాణ్యత కలిగిన సామగ్రినే కట్టే వాటిలో ఉపయోగిస్తున్నారో లేదో చూడాలి. ముఖ్యంగా శానిటరీ, ఎలక్ట్రికల్‌లో వాడే వాటి గురించి ఆరా తీయాలి.

* నమూనా ఇళ్లను సైతం విక్రయిస్తుంటారు. వెంటనే ఇంట్లోకి దిగిపోవాలనే తొందర ఉన్నవాళ్లు వీటిని కొనుగోలు చేయవచ్చు. మార్కెట్లో ధరలను పోల్చి చూసుకుని నిర్ణయం తీసుకోవచ్చు.

* నమూనా ఫ్లాట్‌లో ఉన్నవన్నీ కొనబోయే ఫ్లాట్‌లో ఉండవని గుర్తించాలి. అవి ఒక అవగాహన కోసం మాత్రమే. సందేహాలుంటే మొహమాట పడకుండా నిర్మాణదారుడి నుంచి ముందే స్పష్టత తీసుకోవాలి.


ఇలా ఉంటుందని..

తాము కట్టబోయే విల్లా, అపార్ట్‌మెంట్‌, అందులోని ఫ్లాట్‌ ఇలా ఉంటుందని ప్లాన్‌లో చూపించి.. వివరించే ప్రయత్నం చేసినా కొందరు కొనుగోలుదారులు సంతృప్తి చెందరు. ఎన్నో సందేహాలు వారిని ఏటూ తేల్చుకోలేకుండా సందిగ్ధంలో పడేస్తుంటాయి. అదే ఒక నమూనా ఇల్లు ఫ్లాట్‌ కట్టి చూపిస్తే వారిలో విశ్వాసం పెరుగుతుందని బిల్డర్లు అంటున్నారు. ఇప్పటికే కొనుగోలుదారుల విశ్వాసం పొందిన సంస్థలు ఆ నమ్మకమే పెట్టుబడిగా సాగుతుంటే.. మార్కెట్లోకి కొత్తగా వస్తున్న సంస్థలు ఎక్కువగా నమూనా ఫ్లాట్‌లు నిర్మిస్తున్నాయి. తాము చెప్పినట్లే కట్టిస్తామని నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నాయి.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని