దసరాకు కొత్తింటికి!

గృహ రుణంపై వడ్డీరేట్లు తగ్గడంతో మధ్యతరగతి కుటుంబాల్లో కొత్తింటి ఆశలు చిగురించాయి. ఇన్నేళ్లుగా రేపుమాపంటూ వాయిదా వేస్తూ వస్తున్న వారు కూడా సొంతింటి కోసం వెతుకులాట ప్రారంభించారు. విజయదశమి శుభవేళ గృహప్రవేశం చేయాలని ఆశపడుతున్నారు.

Published : 02 Oct 2021 02:07 IST

గృహ రుణ వడ్డీ రేట్ల తగ్గుదలతో మధ్య తరగతి ఆశలు

ఈనాడు, హైదరాబాద్‌: గృహ రుణంపై వడ్డీరేట్లు తగ్గడంతో మధ్యతరగతి కుటుంబాల్లో కొత్తింటి ఆశలు చిగురించాయి. ఇన్నేళ్లుగా రేపుమాపంటూ వాయిదా వేస్తూ వస్తున్న వారు కూడా సొంతింటి కోసం వెతుకులాట ప్రారంభించారు. విజయదశమి శుభవేళ గృహప్రవేశం చేయాలని ఆశపడుతున్నారు. హైదరాబాద్‌ మహానగరంలో స్థిరాస్తి రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. పండుగల సీజన్‌ కావటం, వడ్డీరేట్లు కూడా తగ్గటంతో కొవిడ్‌ కష్టాల నుంచి బయట పడుతుండటంతో మార్కెట్‌లో చలనం మొదలైంది. బ్యాంకులు ఇంటి కొనుగోలుకు ఇచ్చే రుణాల వడ్డీ రేట్లను తగ్గిస్తుండటంతో సొంతంగా ఇల్లు కట్టుకునేవారికి, నిర్మించిన ఫ్లాట్ల కొనుగోలుకు ఎక్కువమందికి అవకాశం ఏర్పడనుంది.

ఇదే అదను కొనేద్దాం..

బడ్జెట్‌ అందుబాటులో ఉండటంతో నచ్చిన ఇంటి కోసం వెతుకులాడే వారి సంఖ్య పెరుగుతోంది. మున్ముందు ధరలు అధికమవుతానే ఆలోచన, క్యాలెండర్‌ మారక ముందే కొత్తిల్లు సొంతం చేసుకోవాలని లెక్కలు వేసుకుంటున్నారు. విజయదశమి పండగ సెంటిమెంట్‌గా కలసి వస్తుందనే ఉద్దేశంతో బ్యాంకు రుణాల కోసం వివరాలు సేకరిస్తున్న వారు పెరుగుతున్నట్టు బ్యాంకర్లు చెబుతున్నారు. వ్యక్తిగతంగా వారి బడ్జెట్‌లో దొరికే ఇంటికోసం ఎక్కువమంది ఎదురు చూస్తున్నారనేది దీన్ని బట్టి స్పష్టమవుతోంది. బిల్డర్లు కూడా దీన్ని పరిగణనలోకి తీసుకుని ప్రారంభించిన ప్రాజెక్టులను వీలైనంత త్వరితగతిన పూర్తి చేయాలనుకుంటున్నారు. ఈ ఏడాదే  ఇంటిని కొనుగోలు చేయాలని.. ఇప్పుడు కాకపోతే మున్ముందు మరింత కష్టమనే అభిప్రాయంలో 80 శాతం మంది ఉన్నారు. గృహరుణ వడ్డీరేట్లు తగ్గనుండటం.. బిల్డర్లు కొనుగోలుదారుల కోసం ఎదురుచూస్తుండటం వంటి సానుకూల అంశాలు ప్రస్తుతం మార్కెట్లో ఉన్నాయి. ఈ పరిణామాలు కొనుగోలుదారులకు అనుకూలించనున్నాయి. స్వగృహ కల సాకారానికి ఈ పరిస్థితులను అందిపుచ్చుకోవచ్చు.

ఇప్పుడేం చేయాలంటే
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటి కోసం ముందు నుంచే ప్రణాళికాయుతంగా వ్యవహరించాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం గృహరుణ వడ్డీరేట్లు 7.5శాతం కంటే తక్కువగా ఉన్నాయి. కొన్ని బ్యాంకులు 6.6శాతం వడ్డీపై కూడా రుణాలు ఇస్తున్నాయి.
* ఇప్పటికే తీసుకున్న రుణాలను గృహరుణ దరఖాస్తు చేసుకోవడానికంటే ముందే తీర్చడం ద్వారా అవసరమైన మేర రుణం పొందవచ్చు.
* గృహరుణం 85 శాతానికి మించి ఇచ్చే అవకాశం తక్కువ.. కాబట్టి మిగిలిన మొత్తం కొనుగోలుదారులే భరించాలనేది గుర్తుంచుకోవాలి. దీనికోసం కొంతకాలంగా పొదుపు చేసిన మొత్తం ఉన్నట్టయితే ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఏమైనా ప్రణాళికలు ఉన్నట్టయితే కొద్దికాలం వాయిదా వేసుకోవాలి. పిల్లల చదువులు, వివాహాలు ఉన్నట్టయితే అదనపు భారం పడకుండా జాగ్రత్త పడాలి.
* చిన్నపాటి వ్యాపారులు ఉన్నట్టయితే వారు ఇన్నాళ్లు నగదు రూపంలో లావాదేవీలు నిర్వహించినా.. డిజిటల్‌ రూపంలోకి మారిపోవడం.. బ్యాంకు ద్వారా లావాదేవీలు నిర్వహించడం ద్వారా రుణ అర్హత పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది. వ్యాపారానికి, ఇంటికి అవసరాన్ని బట్టి రుణాలను తీసుకోవచ్చు.
*ఉద్యోగుల్లో గృహరుణంపై ఆధారపడేవారే ఎక్కువ. కొత్తగా వ్యక్తిగత రుణాలు, క్రెడిట్‌కార్డుల అప్పులను వీలైనంత త్వరగా తీర్చివేయాలి.  రుణం పొందేందుకు సిబిల్‌ కూడా పరిగణనలోకి తీసు
కుంటారని గుర్తించాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని