ప్రభుత్వ భూమిని డెవలప్‌మెంట్‌కు ఇవ్వాలి

‘హైదరాబాద్‌ నగరం మరింతగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంతర్జాతీయ నగరాలతో పోటీ పడుతూ దూసుకెళుతోంది. ఆ స్థాయిలో భవనాలు, ఎలివేషన్లు సిటీలో ప్రస్తుతం చూస్తున్నాం. డెవలపర్లు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను అందిపుచ్చుకుని ఆ మేరకు ఒక్కో మెట్టు ఎదుగుతున్నారు. నగరం మరింతగా విస్తరించేందుకు ఐదు ప్రధానమైన ‘ఐ’లపై సర్కారు దృష్టి పెట్టాలి. ఇన్‌ఫుట్‌ కాస్ట్‌ తగ్గాలి..  ఇన్నోవేషన్స్‌ రావాలి.

Published : 09 Oct 2021 02:57 IST

‘ఈనాడు’తో ట్రెడా అధ్యక్షుడు ఆర్‌.చలపతిరావు

ఈనాడు, హైదరాబాద్‌: ‘హైదరాబాద్‌ నగరం మరింతగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంతర్జాతీయ నగరాలతో పోటీ పడుతూ దూసుకెళుతోంది. ఆ స్థాయిలో భవనాలు, ఎలివేషన్లు సిటీలో ప్రస్తుతం చూస్తున్నాం. డెవలపర్లు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను అందిపుచ్చుకుని ఆ మేరకు ఒక్కో మెట్టు ఎదుగుతున్నారు. నగరం మరింతగా విస్తరించేందుకు ఐదు ప్రధానమైన ‘ఐ’లపై సర్కారు దృష్టి పెట్టాలి. ఇన్‌ఫుట్‌ కాస్ట్‌ తగ్గాలి..  ఇన్నోవేషన్స్‌ రావాలి.. ఇన్వెస్ట్‌మెంట్స్‌ పెరగాలి.. ఇన్‌ఫ్రా అభివృద్ధి చేయాలి.. ఇరిగేషన్‌ వృద్ధి చెందాలి’ అని తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌(ట్రెడా) అధ్యక్షుడు ఆర్‌.చలపతిరావు అన్నారు. ‘ఈనాడు’ ముఖాముఖిలో ఆయన పలు విషయాలు వెల్లడించారు.

* నగర అభివృద్ధికి ఐదు ‘ఐ’లు సూచించారు కదా? వాటి గురించి వివరిస్తారా?

ఇన్‌పుట్‌ కాస్ట్‌ తగ్గాలనేది ప్రధానమైంది. ఇన్‌పుట్‌ కాస్ట్‌లో భూమి వాటానే ఎక్కువగా ఉంటుంది. వీటి ధరలు నియంత్రణలో ఉండాలి. ఇన్నోవేషన్స్‌ రెండోది.. ఏ నగరానికైనా ఇవే ఆకర్షణ. మూడోది ఇన్వెస్ట్‌మెంట్స్‌. సిటీకి పెట్టుబడులు, పరిశ్రమలు రావాలి. అప్పుడు ఉపాధి లభిస్తుంది. నాలుగోది ఇన్‌ఫ్రా. రహదారులు, ప్రజారవాణా వంటి మౌలిక వసతులును ప్రభుత్వం కల్పించాలి. హైదరాబాద్‌ నుంచి ప్రతి జిల్లాకు 100 అడుగుల రహదారి నెట్‌వర్క్‌ ఉండాలి. ఇక ఐదోవది ఇరిగేషన్‌. నగర అభివృద్ధికి దీనితో పరోక్ష సంబంధం ఉంది. గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ మంది ఆధార పడేది వ్యవసాయం మీదే. అక్కడ సాగు పెరిగితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఇది పరోక్షంగా నగరానికి మేలు చేస్తుంది.

* ఇళ్ల ధరలు ఆకాశానికి ఎగబాకుతున్నాయి? అందుబాటులో ఉండాలంటే ఏం చేయాలి?

ఇంటి నిర్మాణంలో భూమే కీలకం. భూముల ధరలు పెరగడంతో ఇన్‌పుట్‌ వ్యయం భారీగా పెరుగుతోంది. దీంతో సహజంగానే ఇంటి ధరలు పెరుగుతున్నాయి. అన్ని వర్గాలకు ఇళ్లు అందుబాటులో ఉండాలంటే ప్రభుత్వ భూమిని బిల్డర్లకు డెవలప్‌మెంట్‌కి ఇవ్వాలి. ప్రభుత్వ వాటాకు వచ్చిన ఇళ్లను సర్కారు ఆయా వర్గాలకు కేటాయించవచ్చు. వాణిజ్య స్థలమైతే అంకుర సంస్థలకు లీజుకు ఇవ్వవచ్చు. భవిష్యత్తులో హైదరాబాద్‌ ఆర్బిట్రేషన్‌ కేంద్రం కాబోతుంది. ఇక్కడికి వచ్చే సంస్థలకు భూముల స్థానంలో బిల్టప్‌ స్పేస్‌ను కేటాయించే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ కన్సల్టెంట్లను పిలిచి మా ప్రతిపాదనపై కసరత్తు చేయాలని కోరుతున్నాం. ఆదాయం కోసం కొంత భూములను విక్రయించినా.. కొంత భూమిని తాము సూచించిన పద్ధతిలో ఇవ్వగల్గితే ఇళ్లు అందుబాటులో ఉంటాయి.

* మాస్టర్‌ ప్లాన్‌లో గ్రిడ్‌ రహదారుల నిర్మాణం ఆలస్యం అవుతోంది? దీంతో ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి ఆశించినంతగా జరగడం లేదనే విమర్శలు ఉన్నాయి?

నగరం చుట్టూ ఓఆర్‌ఆర్‌ వెంట అటు ఇటు కిలోమీటర్‌ పొడవున గ్రోత్‌ కారిడార్‌ను ప్రతిపాదించారు. ఇక్కడ పెద్ద ఎత్తున భూముల లభ్యత కారణంగా మరో నగరం ఇక్కడ వృద్ధి చెందుతుందని ఆశించారు. కానీ ఆ విధంగా జరగలేదు. గ్రోత్‌కారిడార్‌లో వంద అడుగుల రహదారులను ప్రతిపాదించారు. ఇప్పటివరకు వాటిని మార్కింగ్‌ చేయలేదు. త్వరలోనే చేస్తామని మంత్రి కేటీఆర్‌ గతంలో చెప్పినా.. ఎందుకో అది జరగలేదు. మార్కింగ్‌ తొందరగా పూర్తైతే అక్కడ భూములున్న వాళ్లు రహదారులు వేసుకుని అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉంటుంది. భూములు కోల్పోయేవాళ్లకు తగిన పరిహారం అందుతుంది. ప్రభుత్వం వద్ద నిధులు లేనందున దీన్ని ఎలా చేయాలో ఒక విధానంతో సర్కారు ముందడుగు వేయాలి. లేకపోతే భూమి వినియోగంలోకి రాదు. ఆలస్యం అయ్యేకొద్దీ మాస్టర్‌ప్లాన్‌ రహదారుల్లో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి.

* ధరణిలో బిల్డర్లు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు?

ధరణిలో 95 శాతం సమస్యలు పరిష్కారం అయినా.. మిగిలిన 5 శాతంలోనే బిల్డర్లు ఎక్కువగా ఇరుక్కుపోయి ఉన్నారు. ఈ సమస్యలను పరిష్కరించాలి. సంబంధం లేనివాటిని, క్షేత్రస్థాయిలో సర్వే నంబర్లు కంప్యూటర్‌లో ఎంట్రీ చేసే సమయంలో జరిగిన పొరపాట్ల కారణంగా కొన్ని భూములు నిషేధిత జాబితాలో చేరాయి. వివాదం ఉన్నంత వరకే నిషేధిత జాబితాలో కాకుండా మొత్తం భూమినంతా చేర్చిన సంఘటనలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో జరిగిన ఇలాంటి పొరపాట్లను వెంటనే సరిదిద్దాలి. ధరణ ఉండాల్సిందే.. ఇలాంటి లోటుపాట్లను సరిచేయాలి.

* ఎల్‌ఆర్‌ఎస్‌పై సర్కారు ఎలాంటి వైఖరి అవలంబించాలి?

భూముల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) సుప్రీంకోర్టులో ఉంది. ఎందుకోసం ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చిందో కోర్టుకు వివరించాలి. భవిష్యత్తులో అక్రమ వెంచర్లు పుట్టుకురాకుండా చర్యలు తీసుకోవాలి. పంచాయతీల పరిధిలో నివాసాల కోసం రోడ్‌ కారిడార్‌లను గుర్తించి అక్కడ నిర్మాణాలను అనుమతి ఇవ్వాలి. అక్రమ ప్లాటింగ్‌ను అడ్డుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని