Updated : 15 Oct 2021 17:27 IST

సొంతింటికి నలుదిక్కులూ రారమ్మంటున్నాయ్‌!

విజయదశమికి ఏ కార్యక్రమం తలపెట్టినా విజయమే దక్కుతుందని చాలా మంది అభిప్రాయం.  స్థిరాస్తుల కొనుగోలు సైతం కలిసి వస్తుందని.. పలువురు స్థలాల కొనుగోలు, కొత్త ఇంటికి సంబంధించిన నిర్ణయాలు ఈ రోజు తీసుకుంటుంటారు.  కొవిడ్‌ తర్వాత బాగా పుంజుకున్న మార్కెట్‌ ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతోంది. సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు అనువైన సమయంగా కొనుగోలుదారులు భావిస్తున్నారు. 

ఈనాడు, హైదరాబాద్‌ :బాహ్యవలయ రహదారితో నగరం నలువైపులా  విస్తరిస్తోంది. అవుటర్‌ లోపల పెద్దఎత్తున గృహ నిర్మాణం జరుగుతోంది. వ్యక్తిగతంగా ఇళ్లు కట్టుకోవడం మొదలు చిన్న బిల్డర్లు నిర్మించే  అపార్ట్‌మెంట్లు, పెద్ద సంస్థలు కడుతున్న గేటెడ్‌ కమ్యూనిటీల వరకు పనులు జరుగుతున్నాయి. పరిమితంగా విల్లా ప్రాజెక్టులు అవుటర్‌ లోపల అందుబాటులో ఉన్నాయి. ఇతర ప్రాంతాల డెవలపర్లు స్థానిక భూ యాజమానులతో ఉమ్మడి భాగస్వామ్యంగా ప్రాజెక్ట్‌లు చేపట్టేందుకు ముందుకొస్తున్నారు. ఆయా నగరాలతో పోలిస్తే ఇక్కడ ఇప్పటికీ ధరలు చాలా తక్కువ అనేది వారు చెబుతున్న మాట. స్థానికులకు ఈ ధరలు కాస్త భారమే అయినా.. మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని భూముల ధరలు పెరుగుతుండటంతో ఇళ్లధరలు భవిష్యత్తులో మరింత పెరగక తప్పదని స్థిరాస్తి వ్యాపారులు అంటున్నారు. 

* సికింద్రాబాద్‌ వైపు ఉన్న పలు ప్రాంతాలను హైదరాబాద్‌ ఉత్తర దిక్కుగా చెబుతుంటారు. జాతీయ రహదారి అనుసంధానం,  జేబీఎస్‌ వరకు మెట్రో, ప్రతిపాదిత ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్ట్‌లు సానుకూల అంశాలు.  అల్వాల్, బోయిన్‌పల్లి, కొంపల్లి, సాకేత్, మల్కాజిగిరి వంటి చోట్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి.

అత్తాపూర్, హైదర్‌గూడ, బండ్లగూడ, కిస్మత్‌పూర్, అప్పా కూడలి ప్రాంతాలు హైదరాబాద్‌ దక్షిణంగా వ్యవహరిస్తుంటారు. గగన్‌పహాడ్, సాతంరాయి, శంషాబాద్‌ వరకు  విస్తరించింది. బహుళ అంతస్తుల నిర్మాణాలు మొదలయ్యాయి.  స్థలాలు కొనుగోలు చేసేవారు కొత్తూరు, షాదర్‌నగర్, జడ్చర్ల వరకు వెళుతున్నారు. సిటీకి దూరమే అయినా..  ఫార్మాసిటీ ఏర్పాటుతో శ్రీశైలం మార్గంలో రియల్‌ బూమ్‌ నడుస్తోంది. 

మెట్రోరైలు రాకతో ఆశావహంగా కొనుగోలుదారులు చూస్తున్న ప్రాంతంగా హైదరాబాద్‌ తూర్పు కనిపిస్తోంది. విజయవాడ, వరంగల్, అవుటర్, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుతో రవాణా అనుసంధానంగా ఉంది. ఎల్‌బీనగర్, నాగోల్, బండ్లగూడ, హస్తినాపురం, ఉప్పల్, ఏ.ఎస్‌.రావు నగర్, సైనిక్‌పురి ప్రాంతాల్లో నిర్మాణాలు విస్తరించాయి. గౌరెల్లిలో అవుటర్‌ లోపలే విల్లాలు అందుబాటులో ఉన్నాయి. బోడుప్పల్‌ తర్వాత నారపల్లి, పోచారం వరకు గృహ నిర్మాణం ఊపందుకుంది. రూ.50 లక్షల లోపు వెయ్యి చ.అ.ఫ్లాట్లు దొరుకుతున్నాయి. భవిష్యత్తు దృష్ట్యా స్థలాలపై పెట్టుబడి పెట్టేవారు ఘట్‌కేసర్, యాదాద్రి వైపు చూస్తున్నారు. సాగర్‌ మార్గంలోనూ తుర్కయంజాల్‌ నుంచి నిర్మాణాలు ఊపందుకున్నాయి. 

* గచ్చిబౌలి, కూకట్‌పల్లి చుట్టుపక్కల హైదరాబాద్‌ పశ్చిమం కిందకు వస్తుంది.  ఇక్కడ మరింత దూకుడు పెరిగింది. ఐటీ సంస్థలు కార్యాలయాల నిర్మాణాలు  ఒకవైపు... వాటికి పొటీగా రెసిడెన్షియల్‌ విభాగంలో ఆకాశహర్మ్యాలను పలుసంస్థలు కడుతున్నాయి. కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, నార్సింగి, నానక్‌రాంగూడ, పుప్పాలగూడ, ఖాజాగూడ, మణికొండ, బాచుపల్లి, కొల్లూరు, తెల్లాపూర్, నల్లగండ్ల, లింగంపల్లి దాటి పటాన్‌ చెరు వరకు విస్తరిస్తోంది. ఐటీ కార్యాలయాలకు 10-20 కి.మీ. దూరంలోని ప్రాంతాలన్నీ దూసుకెళుతున్నాయి. 

40 శాతం లావాదేవీలు ఇప్పుడే..

ఇప్పటి నుంచి వచ్చే మూడునెలలు వరసగా పండగలు ఉన్నాయి. ఈనెలలో దసరా, నవంబరులో దీపావళి, డిసెంబర్‌లో క్రిస్‌మస్, జనవరిలో సంక్రాంతి వరసగా వస్తున్నాయి. మూడు నెలలే అయినా స్థిరాస్తి మార్కెట్‌కు సంబంధించి చాలా కీలకమైనది. 40 శాతం లావాదేవీలు ఈ సమయంలోనే జరుగుతుంటాయి. కొవిడ్‌ భయాలు తగ్గడం కూడా కలిసి రానుంది.  విదేశాల్లో స్థిరపడిన వారు సెలవుల్లోనే నవంబరు, డిసెంబరు నెలల్లో భారత్‌ వస్తుంటారు. వీరు సైతం ఎక్కువగా పెట్టుబడి పెట్టేది  ఈ సమయంలోనే.  వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని స్థిరాస్తి వ్యాపారులు సైతం కొనుగోలుదారుడిని చేజార్చుకోకుండా రాయితీలు ప్రకటిస్తుంటారు.- ఆర్‌.చలపతిరావు, అధ్యక్షుడు, ట్రెడా 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని