ఇంటికి తారా తోరణం

రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు పంథా మార్చాయి. యువతరాన్ని ఆకట్టుకునేందుకు నయా మార్గాన్ని ఆనుసరిస్తున్నాయి. బ్రాడింగ్‌పై దృష్టి పెట్టాయి. ప్రచారకర్తలుగా సినీ, క్రీడా ప్రముఖుల్ని నియమించుకుంటున్నాయి. హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో ఈ పోకడ కొంతకాలం క్రితమే మొదలైనా..

Updated : 23 Oct 2021 04:51 IST

బ్రాండింగ్‌, కొత్తతరంపై స్థిరాస్తి సంస్థల దృష్టి

ఈనాడు, హైదరాబాద్‌

రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు పంథా మార్చాయి. యువతరాన్ని ఆకట్టుకునేందుకు నయా మార్గాన్ని ఆనుసరిస్తున్నాయి. బ్రాడింగ్‌పై దృష్టి పెట్టాయి. ప్రచారకర్తలుగా సినీ, క్రీడా ప్రముఖుల్ని నియమించుకుంటున్నాయి. హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో ఈ పోకడ కొంతకాలం క్రితమే మొదలైనా.. ఇటీవల మరింత ఊపందుకుంది. భారీ పారితోషికం చెల్లించి మరీ టాలీవుడ్‌ అగ్రహీరోలను బ్రాండ్‌ అంబాసిడర్లుగా నియమించుకుంటున్నారు. ఇటీవల ఇది సరికొత్త పరిణామమని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ప్రారంభంలో వెటరన్‌ హీరోలు, బుల్లితెర తారలు, యాంకర్లను ప్రచారకర్తలుగా నియమించుకున్న సంస్థలు.. మారుతున్న వ్యాపార పోకడల దృష్ట్యా అగ్రహీరోలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి.

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ అంతకంతకు విస్తరిస్తోంది. కొంతకాలంగా ఈ సంస్థలు భారీ ప్రాజెక్టులను చేపడుతున్నాయి. వెంచర్లు అయితే 50 నుంచి 100 ఎకరాల వరకు, కొన్ని సంస్థలు వెయ్యి ఎకరాల్లోనూ వేస్తున్నాయి.  5 నుంచి 20 ఎకరాల విస్తీర్ణంలో ఆకాశ హర్మ్యాలను నిర్మిస్తున్నాయి.  సౌకర్యాల పరంగా పెద్దపీట వేస్తున్నాయి. సహజంగానే భారీతనం వచ్చింది.  ప్రచారం సైతం ఆ స్థాయిలో ఉంటే  విక్రయాలు బాగుంటాయని ఆయా సంస్థలు భావిస్తున్నాయి. మార్కెట్‌ విలువ భారీగా పెరిగింది. లాభాలు సైతం దండిగా ఉండటంతో రూ.నాలుగైదు కోట్లపైన వెచ్చించి ప్రచారకర్తలను నియమించుకునేందుకు సైతం వెనకాడటం లేదు. మొదటగా రెండు సంస్థలు హీరో మహేశ్‌బాబును ప్రచారకర్తగా నియమించుకున్నాయి. ఇటీవల రాంచరణ్‌ మరో సంస్థకు అంబాసిడర్‌గా ప్రచారం చేస్తున్నారు.  బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి ఒక నిర్మాణ సంస్థకు ప్రచారకర్తగా ఉంది. బాలీవుడ్‌ వెటరన్‌ హీరో అనిల్‌కపూర్‌ను ఒక సంస్థ అంబాసిడర్‌గా నియమించుకుంది. మాజీ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ సైతం ఒక సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. బుల్లితెర తారలు, యాంకర్లు, సీనియర్‌ నటులు ప్రచారం చేస్తున్న సంస్థలు ఉన్నాయి.

కొత్తవారిపై  ఫోకస్‌

స్థిరాస్తులపై పెట్టుబడులు పెట్టడంలో తరాల అంతరం స్పష్టంగా కనిపిస్తోంది. 23  ఏళ్లలోపు జనరేషన్‌ జెడ్‌లో స్థిరాస్తి కొనుగోలు మూడో ప్రాధాన్యంగా ఉంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు కావడంతో వీరి ఆదాయాలు పెరిగాయి. సహజంగానే ఈ వయసువారు సినిమాలు, క్రీడలు ఎక్కువ చూస్తుంటారు. ఆయా రంగాల్లోని వారిని అభిమానిస్తుంటారు. వీరిని లక్ష్యంగా చేసుకునేందుకు స్థిరాస్తి సంస్థలు తారలను ప్రచార రంగంలోకి దింపుతున్నాయి. బ్రాండింగ్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి.

నమ్మకం  కలిగించేందుకు..

స్థిరాస్తి రంగంలో నమ్మకంతోనే ఎక్కువగా వ్యాపారం జరుగుతుంది. కొనుగోలుదారుల్లో 77 శాతం మంది డెవలపర్‌ విశ్వసనీయత చూస్తున్నట్లు ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఆయా డెవలపర్ల మీద విశ్వాసంతో పెట్టుబడి పెడుతుంటారు. గతంలో చేపట్టిన ప్రాజెక్టులు, అనుకున్న సమయానికి బ్రోచర్‌లో చెప్పిన విధంగా  ఇంటిని పూర్తిచేసి ఇచ్చారా లేదా? వెంచర్‌ అభివృద్ధి చేసి స్థలాన్ని అప్పగించారా లేదా అనేవి పరిగణనలోకి తీసుకుంటారు.  ఇందుకు  చాలా సంవత్సరాలే పడుతుంది. ఇవన్నీ పాతతరానికి తెలుసు. మరీ కొత్త తరానికి తెలియాలంటే బ్రాడింగ్‌పై ఆయా సంస్థలు పోకస్‌ చేస్తున్నాయి. అందుకు ప్రచారకర్తలను నియమించుకుంటున్నాయి. ఆయా హీరోలకు ఉన్న పేరు ప్రతిష్ఠలతో తమ సంస్థల బ్రాండింగ్‌ మరింత పెంచేందుకు, విక్రయాలు పెంచుకునేందుకు దోహదం చేస్తుందని రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు భావిస్తున్నాయి. విశ్వాసం పెంచేందుకు అంబాసిడర్లకు నగదు స్థానంలో స్థలాలను, ఫ్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేస్తున్నాయి. దీన్ని సైతం ప్రచారంగా వాడుకుంటున్నాయి.

వారిపై  విశ్వాసంతో..

ఇప్పటివరకు ప్రచారకర్తలను నియమించుకున్న వాటిలో సుదీర్ఘ అనుభవం కలిగిన సంస్థలతో పాటూ కొత్తగా మార్కెట్లోకి వచ్చినవీ ఉన్నాయి. మరోవైపు పోటీ విపరీతంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రచారకర్తలపై ఉన్న నమ్మకం తమకు కలిసి వస్తుందని రియల్‌ సంస్థలు భావిస్తున్నాయి. ప్రచారకర్తలు సైతం ఆయా సంస్థల ట్రాక్‌ రికార్డు పరిశీలించిన తర్వాత ఒప్పందం చేసుకుంటారని కొనుగోలుదారులు విశ్వాసం. ప్రచారకర్త చెబితే కంపెనీ చెప్పినట్లేనని చాలామంది భావిస్తుంటారు. ఆయా సంస్థల్లో స్థిరాస్తులు కొనుగోలు చేస్తుంటారు.

సై  అంటున్నా..

భూమి, ఇంటిమీద పెట్టుబడితో రాబడి పెరగడమే తప్ప తగ్గేది ఉండదని.. తారలు ధైర్యంగా ప్రచారానికి సై అంటున్నారు. ప్రచారకర్తను బట్టి కూడా కొనుగోలు చేసేవారు ఉంటారు. కాకపోతే  తేడా వస్తే కోర్టు కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. గతంలో ముంబయిలో డెవలపర్‌తో పాటూ ప్రచారకర్తగా ఉన్న హీరోయిన్‌ జెనీలియాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఈకేసు కోర్టు దాకా వెళ్లింది. ఇలాంటి అనుభవాలతో ఒప్పందం చేసుకునే ముందు అచితూచి అడుగులు వేస్తున్నారు.


ట్రెండ్‌ అవుతుందని అనుకోవడం లేదు

ఎక్కువగా లేఅవుట్లు వేస్తున్న సంస్థలు హీరోలను ప్రచారకర్తలుగా నియమించుకుంటున్నాయి. వ్యాపార పరంగా వ్యూహాత్మకంగా వీరిని ఎంపిక చేసుకుంటున్నాయి. మంచి పేరు ఉండి, నాణ్యమైన ఉత్పత్తులు అందజేసే వారికి ప్రచారకర్త తోడైతే వ్యాపారం పెరుగుతుంది. మొదటివి లేకుండా కేవలం ప్రచారం మీదే ఆధారపడితే ఏం ప్రయోజనం ఉండదు అనేందుకు మనకు తెలుగు రాష్ట్రాల్లో చేపట్టిన ప్రాజెక్టులు ఉదాహరణగా ఉన్నాయి. అయితే మున్ముందు అన్ని సంస్థలు ఇదే బాటలో వెళతాయని.. మార్కెట్లో ఇదో ట్రెండ్‌ అవుతుందని నేను భావించడం లేదు.

- ఎం.విజయసాయి, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు, ట్రెడా


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని