చట్టం కొరడా ఝుళిపించాలి

నిర్మాణరంగాన్ని ఇటీవల మహమ్మారిలా పట్టి పీడిస్తున్న ముందస్తు అమ్మకాలను (ప్రీ లాంచ్‌, ప్రీ సేల్స్‌, యూడీఎస్‌) నియంత్రించేలా చట్టం కొరడా ఝులిపించాలని నిర్మాణ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి.

Updated : 27 Nov 2021 04:44 IST

ప్రీ లాంచ్‌, ప్రీ సేల్స్‌, యూడీఎస్‌ పేరుతో అనుమతి లేకుండా విక్రయాలు

నియంత్రణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి క్రెడాయ్‌, ట్రెడా, టీబీఎఫ్‌, టీడీఏ విజ్ఞప్తి

ఈనాడు, హైదరాబాద్‌: నిర్మాణరంగాన్ని ఇటీవల మహమ్మారిలా పట్టి పీడిస్తున్న ముందస్తు అమ్మకాలను (ప్రీ లాంచ్‌, ప్రీ సేల్స్‌, యూడీఎస్‌) నియంత్రించేలా చట్టం కొరడా ఝులిపించాలని నిర్మాణ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. రెరా చట్టం చేయడమే కాదు అమలయ్యేలా చూసే బాధ్యత ప్రభుత్వానిదేనని గుర్తు చేశాయి. కొనుగోలుదారులను మభ్యపెడుతూ మోసపూరితంగా జరుపుతున్న విక్రయాలను అరికట్టాలని కోరాయి. భూమిలో అవిభాజ్యపు వాటా(అన్‌ డివైడెడ్‌ షేర్‌)ను విక్రయిస్తున్న సంస్థలకు అనుమతులు ఇవ్వవద్దని కోరాయి. ఇకనైనా ఇలాంటి విక్రయాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించాయి.  ప్రీలాంచ్‌ మోసాలపై కొనుగోలుదారుల్లో అవగాహన పెంపొందించేందుకు చాలాకాలం తర్వాత నిర్మాణ రంగంలోని నాలుగు సంఘాలు ఒక్కతాటిపైకి వచ్చాయి. బంజారాహిల్స్‌లోని క్రెడాయ్‌ హైదరాబాద్‌ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘాల అధ్యక్షులు మాట్లాడారు. రెరా అనుమతి లేని ప్రాజెక్టుల్లో కొని మోసపోవద్దని క్రెడాయ్‌ తెలంగాణ ఛైర్మన్‌ సి.హెచ్‌.రాంచంద్రారెడ్డి సూచించారు. కొంతమంది డెవలపర్లు  ఎలాంటి అనుమతులు లేకుండానే తక్కువ ధర అంటూ మోసపూరితంగా విక్రయాలు జరుపుతున్నారని.. క్రెడాయ్‌ తెలంగాణ అధ్యక్షుడు డి.మురళీకృష్ణారెడ్డి అన్నారు. కొనుగోలుదారుల్లో అవగాహన కల్పించేందుకు వేర్వేరు కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు చెప్పారు.

రియల్‌కు పట్టిన మహమ్మారి ఇది - పి.రామకృష్ణారావు, అధ్యక్షుడు, క్రెడాయ్‌ హైదరాబాద్‌

* ప్రస్తుతం మార్కెట్లో రెండు రకాల డెవలపర్స్‌ ఉన్నారు. నిబంధనలను పాటిస్తూ దీర్ఘకాలంగా నిర్మాణాలు చేపడుతున్నవారు ఒకరైతే... రెరా నిబంధనలను పట్టించుకోకుండా ప్రీసేల్స్‌, ప్రీలాంచ్‌, యూడీఎస్‌ పేరుతో అక్రమంగా విక్రయిస్తున్నవారు రెండోరకం. ఇలాంటి వారు వందల్లోనే ఉన్నారు. వీరితో పాటు పేరున్న సంస్థలు, కొత్తగా కొంతమంది బృందంగా ఏర్పడి ప్రారంభించిన సంస్థలు ఇదే ధోరణిలో ఉన్నాయి. పరిశ్రమను పీడిస్తున్న మహమ్మారి ఇది.

* జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, రెరాలో అనుమతి లేకుండా విక్రయాలు చేపడుతున్నారు. వీటిలో కొని మోసపోవద్దు. ఏడాదిన్నర క్రితం డబ్బులు వసూలు చేసిన పలు సంస్థలు ఇప్పటికీ పనులు మొదలెట్టలేదు. డబ్బులు వెనక్కి ఇవ్వాలని కోరుతున్నారు. పనులు చేపట్టకపోయినా, ఆలస్యమైనా ఇలాంటి వారికి ఎక్కడా న్యాయం జరగదు.

* ఇప్పటికైనా ఈ తరహా మోసాలకు అడ్డుకట్ట వేయాలి. మా దృష్టికి వచ్చిన కొన్ని సంస్థల వివరాలను రెరాకు అందజేశాం. ఇప్పటికైనా ఇలాంటి వాటికి అనుమతులు రాకుండా చర్యలు తీసుకోవాలి.

* ప్రస్తుతం నిర్మాణ వ్యయం 27 నుంచి 30 శాతం పెరిగింది. ఈ పరిస్థితుల్లో అంత తక్కువ ధరలో నిర్మాణం ఎలా సాధ్యమో కొనేవాళ్లు ఆలోచించాలి. సగటున చదరపు అడుగు రూ.5వేల నుంచి రూ.6వేల మధ్య ఉంటే కొన్ని ప్రాంతాల్లో చ.అ. రూ.2500 నుంచి విక్రయించారు.

అరికట్టే బాధ్యత ప్రభుత్వానిదే  - సి. ప్రభాకర్‌రావు, అధ్యక్షుడు, తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌

* తక్కువ ధర అనగానే ప్రీసేల్స్‌తో కొనుగోలు చేస్తున్నారు. రూ.ఆరువేల విలువైన వస్తువును రూ.మూడు వేలకు అమ్మడం ఎలా సాధ్యం? ప్రస్తుతం ప్రీసేల్స్‌లో జరుగుతున్నది ఇదే. ఒకప్పుడు అధిక వడ్డీరేట్లు ఇస్తామని చిట్‌ఫండ్‌ కంపెనీలు మోసం చేసిన మాదిరే ఇది కూడా.

* కొంతమంది బిల్డర్లు నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించి యూడీఎస్‌ ప్లాట్లు, అక్రమ లేఅవుట్లు చేస్తున్నారు. వీటిని అరికట్టేందుకు చట్టాలున్నాయి. కేవలం చట్టాలు చేస్తే సరిపోదు. వాటిని అమలు చేసే బాధ్యత కూడా ప్రభుత్వానిదే. చట్టం పరిధిలోకి రాకుండా కొన్ని సంస్థలు చేస్తున్నాయి. ఇలాంటి సంస్థలకు నిర్మాణ అనుమతులు రాకుండా చేయాలి. అప్పుడే మిగతావారు దారికొస్తారు.

అత్యాశకు పోవద్దు  - ఆర్‌.చలపతిరావు, అధ్యక్షుడు, ట్రెడా

* నోయిడాలో 2007-08లో ఈ తరహాలోనే ప్రీసేల్స్‌ పేరుతో భారీ ఎత్తున విక్రయాలు చేపట్టారు. వాస్తవ ధరకే విక్రయించినా.. చాలావరకు ప్రాజెక్టులను కట్టలేకపోయారు. ఇక్కడ వసూలు చేసిన సొమ్ములను ఇతరత్రా మళ్లించారు. కొనుగోలుదారుల హక్కులను కాపాడేందుకు అప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తే.. పదేళ్లు గడిస్తే కానీ రెరా రాలేదు.  

* రెరాలో రక్షణ ఉంటుంది. వీటిలో నమోదైన ప్రాజెక్టుల్లోనే కొనుగోలు చేయాలి.  ప్రీ అంటే రూఢీ కానిదని అర్థం. వీటిలో కొని ఎందుకు రిస్క్‌లో పడతారు. తక్కువకు వస్తుందని కొని మోసపోవద్దు. ఆశ ఉండొచ్చు కానీ అత్యాశకు పోతే మొదటికే మోసం వస్తుంది. కొనేటప్పుడు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, రెరా వెబ్‌సైట్‌లో అనుమతి ఉందో లేదో తెలుసుకోండి.

వృద్ధి రేటును మించి..  - జి.వి.రావు, అధ్యక్షుడు, తెలంగాణ డెవలపర్స్‌ అసోసియేషన్‌

* వృద్ధిరేటు ఎంత? ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి? ఇవేవీ పట్టించుకోకుండా ప్రీసేల్స్‌లో ఇష్టారీతిగా ప్రాజెక్టులు చేపట్టడం అనారోగ్యకర వాతావరణానికి దారితీస్తోంది. ఇప్పటివరకు హైదరాబాద్‌ నిర్మాణ రంగానికి మంచి పేరు ఉంది. బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. ఇన్నేళ్లలో రెండు మినహా మిగిలిన సంస్థలన్నీ ప్రాజెక్టులను పూర్తి చేసి కొనుగోలుదారులకు అప్పగించాయి.

* రెండేళ్ల నుంచి జరుగుతున్న యూడీఎస్‌ పథకాలు చూస్తే కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు రాబోతున్నాయి. కడతారో లేదోననే సందేహం ఒకటైతే.. జోన్ల నిబంధనలను అతిక్రమించి నిర్మాణాలు చేపడుతుండటంతో మరింత ఆందోళన కలిగిస్తోంది.

* జీవో 111లోనూ యూడీఎస్‌ అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రణాళిక రహిత అభివృద్ధితో నగరం దీర్ఘకాలంలో ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది.

* అనుమతి ఉన్న ప్రాజెక్టుల్లోనే కొనుగోలు చేయాలి. వేటికి అనుమతి ఉందో లేదో కొనుగోలుదారులు తెలుసుకునేందుకు హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, రెరాలో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని