మాటలు కట్టిపెట్టు.. ఇంటి మేలు తలపెట్టు

అందుబాటు ధరల్లో ఇళ్ల నిర్మాణం తగ్గడమే ప్రీలాంచ్‌, యూడీఎస్‌ విక్రయాలకు వరంగా మారిందా? అవుననే అంటున్నారు స్థిరాస్తి సంఘాల ప్రతినిధులు కొందరు. బహిరంగంగా చెప్పకపోయినా అంతర్గత చర్చల్లో

Updated : 11 Dec 2021 06:23 IST

అందుబాటు ధరల్లో నిర్మాణంపై ధోరణి మారాలి

ఈనాడు, హైదరాబాద్‌

అందుబాటు ధరల్లో ఇళ్ల నిర్మాణం తగ్గడమే ప్రీలాంచ్‌, యూడీఎస్‌ విక్రయాలకు వరంగా మారిందా? అవుననే అంటున్నారు స్థిరాస్తి సంఘాల ప్రతినిధులు కొందరు. బహిరంగంగా చెప్పకపోయినా అంతర్గత చర్చల్లో మాత్రం తరచూ ఈ అంశం గురించి తమ సభ్యుల వద్ద ప్రస్తావిస్తున్నారు. పెద్ద సంస్థలన్నీ ప్రీమియం ప్రాజెక్టులే తప్ప అందుబాటు ఇళ్ల వైపే చూడటం లేదు. వీరి బాటలోనే మరిన్ని బడా సంస్థలు అనుసరిస్తుండటంతో పేరున్న సంస్థల నుంచి అందుబాటు ఇళ్ల ప్రాజెక్టులు రావడం గగనమైంది. దీంతో అనుభవం లేని వ్యక్తులు, ఇతర రంగాల నుంచి వచ్చిన వారు ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రీలాంచ్‌లో తక్కువ ధర అనగానే.. కొనుగోలుదారులు ఆకర్షితులవుతున్నారు. ఫ్లాట్‌ ఖరీదు మొత్తం ఒకే దఫాలో చెల్లిస్తే చ.అడుగు రూ.3వేల లోపే అనడంతో పెద్ద ఎత్తున కొనుగోలుదారులు ఈ తరహా ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టారు. అనామకంగా వచ్చిన సంస్థలన్నీ కలిసి పెద్ద ఎత్తున మార్కెట్‌ వాటాని చేజిక్కించుకున్నాయి.  అటు కొనుగోలుదారులకు, ఇటు నిర్మాణదారులకు జరుగుతున్న నష్టాన్ని ఆలస్యంగానైనా గుర్తించిన స్థిరాస్తి సంఘాలు అప్రమత్తం అయ్యాయి.  అనుమతులు లేని ప్రాజెక్టుల్లో కొని మోసపోవద్దని కొనుగోలుదారులకు సూచిస్తూనే... అందుబాటు ఇళ్ల ప్రాజెక్టులు చేపట్టాలని తమ సభ్యులకు సంఘాల ప్రతినిధులు సూచిస్తున్నారు.
చిన్న బిల్డర్లు చేపడుతున్న స్టాండలోన్‌ అపార్ట్‌మెంట్లు తప్ప పెద్ద సంస్థల ప్రాజెక్టులు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఫ్లాట్ల ధరలు అందుబాటులో లేవు. రూ.యాభై లక్షల పైనే తప్ప అంతకు తక్కువలో  చూద్దామన్నా కనిపించడం లేదు. కమ్యూనిటీలో కల్పించే సౌకర్యాలను బట్టి  తక్కువలో తక్కువ రూ.75 లక్షలు వెచ్చిస్తే తప్ప కోరుకున్న ఫ్లాట్‌ దొరకడం లేదు. పైగా ఇవన్నీ శివార్లలో. నగరంలో, ఐటీ కారిడార్‌లో కావాలంటే రూ.కోటిపైనే ధర పెట్టాలి. చదరపు అడుగు ధర సగటున రూ.5వేల వరకు పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రీలాంచ్‌, యూడీఎస్‌ పథకాలు మార్కెట్లోకి వచ్చాయి. రూ.పాతిక లక్షలకే ఫ్లాట్‌,  రూ.యాభై లక్షలకే ఆకాశ హర్మ్యాల్లో ఫ్లాట్‌ అనడంతో చాలామంది వీటిలో కొనుగోలు చేశారు. తమ బడ్జెట్‌లో సొంతిల్లు వస్తుందని కొందరు..మూడేళ్లలో ఇల్లు పూర్తయ్యాక మంచి రాబడి వస్తుందని వీటిలో కొన్నారు. వీటిలో కొని మోసపోవద్దు అని క్రెడాయ్‌ ఒకపక్క అవగాహన కల్పిస్తుంటే.. మరోవైపు వీరి సభ్యులు ఎక్కడ ప్రాజెక్ట్‌ మొదలెట్టినా ప్రీలాంచ్‌లో ఎంతకు ఇస్తారని అడుగుతున్నారంటే వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కొన్ని వర్గాలకు ఇళ్లు అందుబాటు ధరల్లో లేకపోవడమే ఈ సమస్యకు మూలం. ఒకటి రెండు మినహా పెద్ద సంస్థలు అందుబాటు ఇళ్ల విభాగాన్ని పూర్తిగా విస్మరించాయి. ఇప్పటికైనా కొన్ని ప్రాజెక్టులు చేపడితే అటు కొనుగోలుదారులకు, ఇటు పరిశ్రమకు మేలు జరుగుతుందని స్థిరాస్తి పెద్దలు అంటున్నారు.

డిమాండ్‌ అధికం..

అందుబాటు ఇళ్లను కడితే విక్రయించడం కష్టమవుతుందని కొందరు బడా బిల్డర్లు అంటున్నారు. అందుకే ఎక్కువ మంది దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. కొందరు ఈ విభాగంలో ఇళ్లు కట్టి తక్కువ సమయంలోనే విక్రయించినవారు మార్కెట్లో ఉన్నారు.  ఈ వాదనలు ఎలా ఉన్నా.. స్థిరాస్తి కన్సెల్టెన్సీ నివేదికల ప్రకారం రూ.50 లక్షల లోపు ఇళ్లకు ఎక్కువగా డిమాండ్‌ ఉందని.. వీటిలో విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెబుతున్నాయి. ఈ ఏడాది మొదటి 11 నెలల నివేదికను పరిశీలిస్తే... 66 శాతం విక్రయాలు ఈ విభాగంలోనే ఉన్నాయని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా వెల్లడించింది.


పెరుగుతున్న వ్యయాలు..

నగరంలో కొవిడ్‌ ముందు వరకు చ.అ. రూ.4వేల నుంచి రూ.4500 వరకు ఉండేది. కొవిడ్‌ అనంతరం భూముల ధరలు, నిర్మాణ సామగ్రి, కూలీల ధరలు పెరగడంతో నిర్మాణ వ్యయం గణనీయంగా పెరిగిందని బిల్డర్లు అంటున్నారు. నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.500 నుంచి రూ.800 వరకు పెరిగిందని చెబుతున్నారు. దీంతో వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఫ్లాట్‌ ధర రూ.50 లక్షలు దాటుతోందని అంటున్నారు. జీఎస్‌టీ, సౌకర్యాలకు అదనంగా వసూలు చేసే ఛార్జీలతో కలిపితే ధర మరింత పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అందుబాటు ధరల్లో ఇళ్లు కట్టాలంటే ప్రభుత్వ పరంగా కూడా కొన్ని రకాల ప్రోత్సాహకాలు ఉండాలని డెవలపర్లు కోరుతున్నారు. ఈ విభాగంలో లాభాలు కొంత తగ్గించుకునైనా చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.


రాజీ పడాల్సిందేనా?

* హైదరాబాద్‌లో ఫ్లాట్‌ అంటే కనీసం వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణమైనా ఉండాలని ఎక్కువ మంది కోరుకుంటున్నారు.  విస్తీర్ణం కొంత తగ్గితే అందుబాటు ధరల్లో ఫ్లాట్‌ కట్టేందుకు అవకాశం ఉంటుందని బిల్డర్లు అంటున్నారు.

* మౌలిక వసతులన్నీ ఉన్నచోట ధర కాస్త ఎక్కువే ఉంటుంది. ప్రస్తుతానికి అవి లేకపోయినా.. భవిష్యత్తులో వచ్చేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకుంటే అనుకున్న బడ్జెట్‌లో ఇంటివారు అవ్వొచ్చు అని సూచిస్తున్నారు.


మౌలిక వసతులు కల్పించాలి

- సతీష్‌ మారం, కార్యవర్గ సభ్యులు, క్రెడాయ్‌ హైదరాబాద్‌

అందుబాటు ధరల్లో ఇళ్లు కట్టాలంటే శివార్లకు వెళ్లాలి. అక్కడ ప్రభుత్వమే మౌలిక వసతులు కల్పించాలి. సరైన రహదారి, రవాణా వ్యవస్థ, విద్యుత్తు, మంచి నీరు, సోషల్‌ ఇన్‌ఫ్రా, ఉపాధి అవకాశాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇవేవీ లేకుండా జనాలు శివార్లకు వచ్చి ఇళ్లు కొనాలంటే కష్టం. ఉపాధి ఉన్నచోటనే నివాసానికి ఎక్కువ మొగ్గు చూపుతారు. కాబట్టి నగరానికి ఒకవైపే కాకుండా అన్నివైపులా ఉపాధి అవకాశాలు కల్పించే చర్యలు ప్రభుత్వం చేపట్టాలి.

* శివార్లలో ఎక్కువగా వ్యవసాయ భూములు ఉన్నాయి. వీటిలో గృహ నిర్మాణం చేపట్టాలంటే నాన్‌ అగ్రికల్చరల్‌ జోన్‌లోకి మార్చుకోవాలి. ఇందుకు చాలా సమయం పడుతుంది. భవన అనుమతి దశలోనే ఈ పక్రియ ఆటోమేటిక్‌గా జరిగేలా నిబంధనలు సులభతరం చేయాలి. ఫీజులను నామమాత్రంగా తీసుకోవాలి.

* అందుబాటు ఇళ్లకు జీఎస్‌టీ 1 శాతం ఉంది. అదే మాదిరి రాష్ట్ర ప్రభుత్వం సైతం వీటి రిజిస్ట్రేషన్‌కు చెల్లించే స్టాంప్‌డ్యూటీని 1 శాతానికి తగ్గించాలి.

* అందుబాటు ధరల్లో ప్రాజెక్టులు చేపట్టే డెవలపర్లను ప్రోత్సహించేందుకు సులభతరంగా రుణాలు, తక్కువ వడ్డీరేట్లకు సమకూరేలా చూడాలి.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని