గృహ రుణ వడ్డీ రాయితీ స్థిరాస్తికి దన్ను!

ఇళ్లు కొనుగోలు చేసేవారిలో అత్యధిక శాతం మంది గృహరుణాలపైనే ఆధారపడుతుంటారు. ఎక్కువ 15 ఏళ్ల కాలపరిమితి ఎంచుకుని ఈఎంఐ చెల్లిస్తుంటారు. తొలినాళ్లలో అధికశాతం వడ్డీ కిందకే జమ అవుతుంది. అసలు చాలా స్వల్పంగా ఉంటుంది. ఉదాహరణకు రూ.25 లక్షల రుణానికి నెలకు రూ.20,717 ఈఎంఐ చెల్లించే రుణగ్రహీత..

Updated : 06 Jul 2019 03:52 IST

ఇళ్ల నిర్మాణ రంగానికి మేలు చేస్తుందంటున్న నిపుణులు

ఈనాడు, హైదరాబాద్‌: ఇళ్లు కొనుగోలు చేసేవారిలో అత్యధిక శాతం మంది గృహరుణాలపైనే ఆధారపడుతుంటారు. ఎక్కువ 15 ఏళ్ల కాలపరిమితి ఎంచుకుని ఈఎంఐ చెల్లిస్తుంటారు. తొలినాళ్లలో అధికశాతం వడ్డీ కిందకే జమ అవుతుంది. అసలు చాలా స్వల్పంగా ఉంటుంది. ఉదాహరణకు రూ.25 లక్షల రుణానికి నెలకు రూ.20,717 ఈఎంఐ చెల్లించే రుణగ్రహీత.. ఏడాదికి రూ.2.13 లక్షల వడ్డీ చెల్లిస్తే అందులో అసలు రూ.31వేలే. ఇప్పటివరకు చెల్లించే వడ్డీ మొత్తం ఎంతున్నా రూ.2లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు వర్తించేది. దీన్ని ఇప్పుడు 3.50 లక్షలకు పెంచారు. 30 శాతం ఆదాయపు పన్నుల శ్లాబులో ఉన్నవారికి వార్షికంగా రూ.45వేలు పన్ను ప్రయోజనం దక్కుతుంది. అయితే .. మార్చి 31, 2020 లోపు గృహరుణాలు తీసుకుని ఇల్లు కొనుగోలు చేసినవారికే వర్తిస్తుంది. ఇల్లు కూడా అందుబాటు ధర రూ.45 లక్షలలోపు ఉండాలి. జీఎస్టీ చట్టం ప్రకారం అందుబాటు ఇల్లు అంటే నగరాల్లో 90 చ.మీ. మాత్రమే.

మూడేళ్లైనా ఇస్తే బాగుండేది..  
- పి.రామకృష్ణారావు, అధ్యక్షుడు, క్రెడాయ్‌ హైదరాబాద్‌ 

గృహరుణ వడ్డీపై పన్ను మినహాయింపు అదనంగా రూ.1.5 లక్షలు పెంచడం స్థిరాస్తి రంగానికి మేలు చేసేది. ఇప్పటివరకు రూ.2 లక్షల వరకు ఉంది. కాకపోతే మరీ ఒక సంవత్సరానికి ఈ వెసులుబాటు ఇచ్చారు. ఇళ్లు పూర్తికావడానికి రెండేళ్లపైనే పడుతుంది. మూడేళ్లైనా ఇచ్చి ఉంటే బాగుంటుంది. నిర్మాణ సామగ్రిపై జీఎస్‌టీ ఎక్కువగా ఉంది. సిమెంట్‌పై 28 శాతం జీఎస్‌టీ వసూలు చేస్తున్నారు. స్టీల్‌పైన ఎక్కువే ఉంది. బడ్జెట్‌లో తగ్గిస్తారని ఆశించాం. తగ్గించకపోవడం నిరాశపర్చింది. 

రుణ లభ్యత పెరిగే అవకాశం  
- సి.శేఖర్‌రెడ్డి, అధ్యక్షుడు, సీఐఐ-ఐజీబీసీ హైదరాబాద్‌ చాప్టర్‌

డ్జెట్‌లో ప్రకటించిన అద్దె విధానం ఆహ్వానించతగ్గది. పాలసీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అద్దెలు అధికంగా ఉండటంతో దూర ప్రాంతాల నుంచి ఎక్కువ మంది పనిప్రదేశానికి వస్తున్నారు. పని ఉన్నచోటే అద్దె ఇల్లు అందుబాటులో ఉంటే చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టడం వల్ల నిర్మాణరంగానికి మేలే జరుగుతుంది. హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలను ఆర్‌బీఐ పరిధిలోకి తీసుకొస్తున్నారు. భూములు కొనేందుకు రుణాల ఇస్తారని అంచనా వేస్తున్నాం. ఆ మేరకు ఆర్‌బీఐ మార్గదర్శకాలు రూపొందించాలి.

పీవీసీ సామగ్రి భారం.. 
- జి.రాంరెడ్డి, అధ్యక్షుడు, క్రెడాయ్‌ తెలంగాణ

అందుబాటు ఇళ్ల’ను ప్రోత్సహించే దిశగా బడ్జెట్‌ ఉంది. ఫలితంగా ఎక్కువ మంది ఆ తరహా ఇళ్లను నిర్మించేందుకు ముందుకొచ్చే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.100 లక్షల కోట్లు ఖర్చు చేయడం నిర్మాణ రంగానికి సానుకూల పరిణామమే. కేంద్రానికి చెందిన భూములు నగరాల్లో చాలా ఉన్నాయి. వీటిని అందుబాటు ఇళ్ల కోసం కేటాయిస్తామనడం మంచి పరిణామం. పీవీసీ వస్తువులు భారం కానున్నాయి. నిర్మాణ రంగంలో వీటి వాడకం ఎక్కువ. మార్బుల్స్‌, టైల్స్‌ ధరలు పెరగనుండటం కొంత నిరాశే.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని