కంది వైపు బంగారమైంది!

స్థలాలు, భూముల ధరలు నిరంతరం పెరుగుతుండటంతో భవిష్యత్తు దృష్ట్యా ప్లాట్లు కొనేందుకు కొనుగోలుదారులు ముందుకు వస్తున్నారు. ఇతర పెట్టుబడి సాధనాల కంటే రాబడి అధికంగా ఉంటుందని ఆసక్తి చూపిస్తున్నారు. రెండు మూడేళ్లలో పెట్టిన పెట్టుబడి రెండింతలు అవుతుందనే అంచనాలతో కొనుగోలు చేస్తున్నారు.

Updated : 01 Jan 2022 23:40 IST

స్థలాలు, భూముల ధరలు నిరంతరం పెరుగుతుండటంతో భవిష్యత్తు దృష్ట్యా ప్లాట్లు కొనేందుకు కొనుగోలుదారులు ముందుకు వస్తున్నారు. ఇతర పెట్టుబడి సాధనాల కంటే రాబడి అధికంగా ఉంటుందని ఆసక్తి చూపిస్తున్నారు. రెండు మూడేళ్లలో పెట్టిన పెట్టుబడి రెండింతలు అవుతుందనే అంచనాలతో కొనుగోలు చేస్తున్నారు. పిల్లల ఉన్నత, విదేశీ చదువులు, ఆడపిల్లల వివాహం, పదవీ విరమణ తర్వాత సొంతంగా విల్లా కట్టుకోవాలనే ఆలోచనలతో స్థలాలను కొంటున్నారు. వృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతాల్లో కొన్నవారు ఆ మేరకు ప్రతిఫలం పొందుతున్నారు.

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో పశ్చిమ ప్రాంతానిదే మొదటి నుంచి హవా. మాదాపూర్‌, గచ్చిబౌలి చుట్టుపక్కల విస్తరించిన ప్రాంతాలన్నీ పశ్చిమ హైదరాబాద్‌ కిందకు వస్తాయి. ఐటీతో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటంతో రెండు దశాబ్దాలుగా ఐటీ కారిడార్‌ కేంద్రంగానే రియల్‌ వ్యాపారం ఎక్కువగా సాగుతోంది. ఈ ప్రాంతమే అత్యధిక వాటా సొంతం చేసుకుంది. ఐటీ రంగం ప్రారంభ దశలో ఇక్కడ కొనుగోలు చేసినవారికి బాగా కలిసి వచ్చింది. ప్రస్తుతం ఐటీ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ జనాసాలు, నిర్మాణాలతో నిండిపోయాయి. ప్రస్తుతం కోకాపేట, మోఖిల్లా, కొల్లూరు వరకు నిర్మాణ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. దీంతో రియల్‌ మార్కెట్‌ ప్రత్యేకించి ప్లాటెడ్‌ డెవలప్‌మెంట్‌ శంకర్‌పల్లి, కంది, పటాన్‌చెరు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించింది.


ఐటీకి చేరువగా..
సిటీ నుంచి ఆయా ప్రాంతాలు దూరమే అయినా.. ఐటీ కారిడార్‌ను అరగంటలో చేరుకునే అవకాశం ఉండటం కలిసి వస్తోంది. ఇప్పటికే అవుటర్‌ రింగ్‌ రోడ్డు, శంకర్‌పల్లి నుంచి కంది మీదుగా సంగారెడ్డి వెళ్లే మార్గం, శంకర్‌పల్లి నుంచి నేరుగా గండిపేట మీదుగా ఓఆర్‌ఆర్‌కు చేరుకునే వీలుండటం, ఓఆర్‌ఆర్‌ చౌరస్తా మీదుగా పటాన్‌చెరు రహదారి.. ఇలా పలువైపుల దారులు ఉండటంతో ఎక్కడికైనా వేగంగా వెళ్లిపోవచ్చు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు లోపలే ఈ ప్రాంతాలు కావడం, ఐఐటీ హైదరాబాద్‌ క్యాంపస్‌, సంగారెడ్డి పట్టణ కేంద్రం, ముంబయి జాతీయ రహదారి అనుసంధానంతో మరింత సానుకూలత ఏర్పడింది.  


నివాసం ఉండేలా..
ఐటీ కారిడార్‌ చేరువగా ఉన్న ప్రాంతాల్లో స్థలాలు, విల్లాల ధరలు కొన్ని వర్గాలకు అందుబాటు లేకపోవడంతో బడ్జెట్‌లో దొరికే స్థలాల కోసం దూరమైన సరే కొనేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. నగర విస్తరణ ఇటువైపే వేగంగా ఉంటుందనే అంచనాలు సైతం ఇక్కడ కొనేలా చేస్తున్నాయి. వెంటనే కాకపోతే మరో నాలుగైదేళ్లలో ఇల్లు కట్టుకుని అక్కడ ఉండొచ్చు అనే ధీమాతో కొంటున్నవారు ఉన్నారు. ఇప్పటికే చుట్టుపక్కల పలు విల్లా ప్రాజెక్టులు రాకతో వీటి చుట్టపక్కల నివాస స్థలాలకు డిమాండ్‌ పెరిగింది. ‘పశ్చిమ హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ ఎక్కువగా ముంబయి జాతీయ రహదారి వైపు పెరుగుతోంది, ఇక్కడ స్థలాలు కొంటే రెండు మూడేళ్లలో పెట్టుబడి రెట్టింపువుతుందనే విశ్వాసంతో కొనుగోలు చేస్తున్నారు. గతంలో కొని ప్రతిఫలం పొందిన అనుభవంతో స్థలాల్లో మదుపు చేస్తున్నారు’ అని సాయి సూర్య డెవలపర్స్‌ ఎండీ సతీష్‌ చంద్ర గుప్తా అన్నారు.

- ఈనాడు, హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని