ఇలా చేస్తే 2022లో గృహమస్తు

సంవత్సరం మారింది.. ఇంటి ధరలు మారాయి. ఇంటి కల మాత్రం అలాగే మిగిలిపోయింది. ఆలస్యం చేసే కొద్దీ ఏటేటా ఇంటి ధరలు పెరగడం తప్ప తగ్గిన దాఖలాలు హైదరాబాద్‌ మార్కెట్లో కనపడటం లేదు. 2022లో ఇల్లు కావాలంటే అరకోటి పైన కావాల్సిందే. అందుకు సిద్ధపడితే

Updated : 08 Jan 2022 04:51 IST

ఈనాడు, హైదరాబాద్‌

సంవత్సరం మారింది.. ఇంటి ధరలు మారాయి. ఇంటి కల మాత్రం అలాగే మిగిలిపోయింది. ఆలస్యం చేసే కొద్దీ ఏటేటా ఇంటి ధరలు పెరగడం తప్ప తగ్గిన దాఖలాలు హైదరాబాద్‌ మార్కెట్లో కనపడటం లేదు. 2022లో ఇల్లు కావాలంటే అరకోటి పైన కావాల్సిందే. అందుకు సిద్ధపడితే నూతన సంవత్సరంలో గృహ ప్రవేశం చేయగలుగుతారని నిర్మాణదారులు అంటున్నారు. గృహరుణాల వడ్డీరేట్లు ప్రస్తుతం చాలా తక్కువగా ఉన్నాయని.. అధిక రుణం తీసుకుని ఇల్లు సొంతం చేసుకోవాలని సూచిస్తున్నారు.

హైదరాబాద్‌ స్థిరాస్తి మార్కెట్‌లో పెద్ద నోట్ల రద్దు, కొవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో మార్కెట్‌ కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్నా.. అనంతరం స్థిరాస్తుల ధరలు వేగంగా దూసుకెళ్లాయి. బడ్జెట్‌లో ఇంటి కోసం వెతుకులాట మొదలెట్టినప్పటి నుంచి క్రమంగా ధరలు పెరుగుతున్న అనుభవమే తప్ప  ఎక్కడా తగ్గినట్లు కనిపించలేదని కొనుగోలుదారులు అంటున్నారు. మరింత ఆలస్యం చేయడం మంచిది కాదనే అభిప్రాయానికి వస్తున్నారు.

మొదట బడ్జెట్‌..
ఇప్పుడు కాకపోతే మున్ముందు మరింత కష్టమనే అభిప్రాయం కొనుగోలుదారుల్లో ఉంది.  ఇళ్ల ధరలు పెరిగినా గృహరుణాల వడ్డీరేట్లు తగ్గడం సానుకూలంగా ఉంది. కాబట్టి మొదట ఎంత బడ్జెట్‌ వరకు అనేది నిర్ణయించుకోవాలి. వచ్చే  ఆదాయం ఎంత? ఎంతవరకు డౌన్‌పేమెంట్‌ చెల్లించగలరు? రుణం ఎంత వస్తుంది? ఈఎంఐ ఎంత వరకు కట్టగలరు? వీటిని బట్టి బడ్జెట్‌ను నిర్ణయించుకోవచ్చు.
ప్రాంతం ఎంపిక..
బడ్జెట్‌పై స్పష్టత వచ్చాక ఆ ధరల శ్రేణిలో ఎక్కడ ఇళ్లు, ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయో చూడాలి. అరకోటి లోపల ఇళ్లు ఎక్కువగా శివార్లలో నిర్మాణంలో ఉన్నాయి. పశ్చిమ హైదరాబాద్‌ మినహా ఉత్తర, దక్షిణ, తూర్పు హైదరాబాద్‌ ప్రాంతాల్లో ఈ తరహా ఇళ్ల లభ్యత ఉంది. పని ప్రదేశానికి ఎంత దూరం? భవిష్యత్తులో అక్కడ వృద్ధి ఉంటుందా? అనే విషయాలను బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకోవచ్చు.
ఏ దాంట్లో..
వ్యక్తిగత ఇళ్లు, అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌, గేటెడ్‌ కమ్యూనిటీ..ఇలా చాలా ఐచ్ఛికాలు ఉన్నాయి. వీటిలో దేంట్లో ఇల్లు తీసుకోవాలనేది కూడా ముందే నిర్ణయించుకోవాలి. లేకపోతే బడ్జెట్‌ ఒకటి ఉంటే చూసే ఇల్లు మరోటి ఉంటుంది. ఎప్పటికీ కొనలేరు. రూ.అరకోటి లోపు అయితే అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ శివార్లలో వస్తుంది. కొద్దిగా ఎక్కువ మొత్తం సమకూర్చుకోగలిగితే గేటెడ్‌ కమ్యూనిటీలో కొనుగోలు చేయవచ్చు. ఇంకొంచెం ఎక్కువ దూరం వెళితే వ్యక్తిగత ఇళ్లు సైతం ఈ బడ్జెట్‌లో దొరుకుతాయి. కాబట్టి ముందే స్పష్టతతో ఉంటే కోరుకున్న బడ్జెట్‌లో.. అనువైన ప్రాంతంలో ఇల్లు కొనగలుగుతారు.

ముందు నుంచే ప్రణాళికతో..
ఈ ఏడాదిలో ఇల్లు సొంతం చేసుకునేందుకు ముందు నుంచే ప్రణాళికాయుతంగా వ్యవహరించాల్సి ఉందని ఇప్పటికే ఇల్లు సమకూర్చుకున్న వారి అనుభవాలు చెబుతున్నాయి.
*ఉద్యోగస్తులైతే ఇంటి నిర్మాణానికి  గృహరుణంపై ఆధారపడేవారే అధికం. కాబట్టి కొత్తగా వ్యక్తిగత రుణాలు, క్రెడిట్‌కార్డుల వంటివి తీసుకోకపోవడం ఉత్తమం. ఇప్పటికే తీసుకున్న రుణాలను గృహరుణ దరఖాస్తు చేసుకోవడానికంటే ముందే తీర్చడం ద్వారా అవసరమైన మేర రుణం పొందవచ్చు.
*చిన్న వ్యాపారస్తులైతే.. ఇన్నాళ్లు నగదు రూపంలో లావాదేవీలు నిర్వహించినా.. డిజిటల్‌ రూపంలోకి మారిపోవడం.. బ్యాంకు ద్వారా లావాదేవీలు నిర్వహించడం ద్వారా రుణ అర్హత పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది. వ్యాపారానికి, ఇంటికి అవసరాన్ని బట్టి రుణాలు తీసుకోవచ్చు.
* గృహరుణం 85 శాతానికి మించి ఇచ్చే అవకాశం తక్కువ.. కాబట్టి కొంత మొత్తాన్ని కొనుగోలుదారులు సమకూర్చుకోవాలి. అందుకోసం కొంతకాలంగా పొదుపు చేసిన మొత్తాన్ని అందుబాటులో ఉంచుకోవడంతో పాటూ.. ఖర్చులు తగ్గించుకోవాలి. విహారం వంటి వాటిని వాయిదా వేసుకోవడం మేలు. ఒకవేళ వెళ్లినా పరిమితి దాటకుండా చూసుకోవాలి. చిన్నమొత్తమే అయినా ఇది కలల ఇంటికి  అక్కరకు వస్తుంది.
కొనే ముందు ఏం చూడాలి..

* జీహెచ్‌ఎంసీ, స్థానిక పురపాలక సంస్థలు, కార్పొరేషన్లు, హెచ్‌ఎండీఏ  నుంచి అనుమతి ఉన్న ప్రాజెక్టుల్లో కొనుగోలు చేయడం మేలు. రెరా రిజిస్ట్రేషన్‌ అయ్యాక కొంటే మంచిది.
* నిర్మాణదారుడు గతంలో చేపట్టిన ప్రాజెక్టులు, ట్రాక్‌ రికార్డును పరిశీలించాలి.
* నిర్మాణం నాణ్యంగా ఉందా లేదో నిర్ధారించుకోవాలి. ప్రత్యక్షంగా సైట్‌కు వెళ్లి పరిశీలించి తెలుసుకోవచ్చు. సిద్ధంగా ఉన్న ఫ్లాట్లను కొనుగోలు చేస్తుంటే అప్పటికీ అందులో దిగిన వారిని వాకబు చేయవచ్చు.
* కొనేముందే ఇంట్లో వాడే వస్తువులు, కమ్యూనిటీలో కల్పించే సౌకర్యాలపై మాటలతో కాకుండా లిఖిత పూర్వకంగా నిర్మాణదారు ఒప్పందంలో రాసిమ్మని కోరాలి.

రాజీ తప్పదు..
ఎక్కువ మంది వారి బడ్జెట్‌ను మించి ఇంటికి వెచ్చించలేరు. కాబట్టి కొన్ని అంశాల్లో కొంత రాజీ తప్పదని ముందడుగు వేయాలి. బడ్జెట్‌లో కోరుకున్న ప్రదేశంలో ఇల్లు కావాలంటే ఇంటి విస్తీర్ణం కొంత తగ్గొచ్చు. మరికొన్ని సార్లు కార్యాలయానికి దూరంగా  ఇల్లు కొనే ప్రదేశం ఉండొచ్చు. రెండు మూడేళ్లు అయితే తప్ప మౌలిక వసతులు ఆ ప్రాంతంలో సమకూరే పరిస్థితులు ఉండకపోవచ్చు. భవిష్యత్తులో ఆ ప్రాంతం వృద్ధికి అవకాశం ఉంటుందంటే ఇలాంటి విషయాల్లో కొంత రాజీపడినా ఫర్వాలేదు.

ఇంట్లో దిగే ముందు
* నిర్మాణం చేపట్టిన ప్రదేశానికి స్వయంగా వెళ్లి ప్రస్తుత స్థితి, ఎప్పటికి పూర్తవుతుందనే విషయాలపై స్పష్టత తీసుకోవడం మంచిది.
* ప్రాజెక్ట్‌లో క్లబ్‌హౌస్‌, ఈతకొలను, జిమ్‌తో పాటూ మరెన్నో సౌకర్యాలు ఉంటాయని చెప్పి.. కొనుగోలుదారులకు అందజేసే సమయంలో వీటిలో కొన్నింటిని కల్పించకుండా చేతులేత్తేస్తుంటారు. చెల్లించే ధర వీటన్నింటికి కలిపి నిర్ణయించి ఉంటారు కాబట్టి వెళ్లే ముందే అన్నీ చూసుకోవాలి.
* కొత్త ఇంట్లో బిగించే ఫిట్టింగ్స్‌ కూడా ముఖ్యమే. నాసిరకం కాకుండా నాణ్యమైన పరికరాలు వాడారో లేదో పరిశీలించాలి. ఎలక్ట్రికల్‌ స్విచ్‌బోర్డ్‌ మొదలు, డోర్‌ నాబ్స్‌, స్నానాల గదిలో పరికరాలు సూచించిన విధంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి.  
* తలుపులు, కిటికీలు ఇతరత్రా వాడే వస్తువులను బట్టి ఇంటి ధరలో తేడాలుంటాయి. సరైన వస్తువులు వాడారో లేదో చెక్‌ చేసుకోవాలి. అవి సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో కూడా నల్లాలను ఒకసారి తిప్పి చూడాలి. దీనివల్ల ఎక్కడైనా లీకేజీలు ఉంటే తెలిసిపోతుంది.
* కొత్త ఫ్లాట్‌లోకి వెళ్లేముందు డ్రైనేజీ అవుట్‌లెట్స్‌లోంచి నీరు సరిగ్గా వెళుతుందో లేదో చూసుకోవాలి. పనిచేసే సమయంలో సిమెంట్‌ పడి మూసుకుపోయే అవకాశం ఉంది. బాల్కనీ, స్నానాలగది, వంటగది, ఇతరత్రా వాడుకునే ప్రాంతాల్లోని అవుట్‌లెట్స్‌ నుంచి నీరు సక్రమంగా వెళుతుందో లేదో పరిశీలించాలి.
* గోడలు, సీలింగ్‌ పరిశీలించాలి.. తడి ఉన్నా.. పగుళ్లు ఉన్నా.. ముఖ్యంగా విద్యుత్తు సాకెట్లు ఉన్న చోట పగుళ్లు బయటపడుతుంటాయి. వీటిని మరమ్మతు చేసి ఇమ్మని అడగాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని