ఇంటి కొనుగోలులో బడ్జెట్టే ప్రధానం

ఇల్లు కొనేటప్పుడు కొనుగోలుదారులు ప్రధానంగా ఏం చూస్తున్నారు? ఏయే అంశాలు కొందర్ని కొనిపించేలా చేస్తున్నాయి? మరికొందర్ని వెనక్కి తగ్గేలా చేస్తున్నాయి? ఐదేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పటికీ కొనుగోలుదారుల ఆలోచనల్లో ఏమైనా మార్పు వచ్చిందా?.. అంటే.. ఇల్లు కొనేందుకు దానికయ్యే బడ్జెట్టే అత్యంత కీలకమని ఎక్కువ శాతం మంది నోబ్రోకర్‌.కామ్‌ సర్వేలో వెల్లడించారు. దీంతో పాటూ నీటి లభ్యత, ప్రజారవాణా, పనిప్రదేశం, ఇంటి విస్తీర్ణం, సౌకర్యాలనూ చూస్తున్నట్లు తెలిపారు. బడ్జెట్‌ ప్రధానమనే విషయమై దేశవ్యాప్తంగా ఒకేరకమైన అభిప్రాయం వెల్లడవగా..

Updated : 22 Jan 2022 06:49 IST

ఇల్లు కొనేటప్పుడు కొనుగోలుదారులు ప్రధానంగా ఏం చూస్తున్నారు? ఏయే అంశాలు కొందర్ని కొనిపించేలా చేస్తున్నాయి? మరికొందర్ని వెనక్కి తగ్గేలా చేస్తున్నాయి? ఐదేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పటికీ కొనుగోలుదారుల ఆలోచనల్లో ఏమైనా మార్పు వచ్చిందా?.. అంటే.. ఇల్లు కొనేందుకు దానికయ్యే బడ్జెట్టే అత్యంత కీలకమని ఎక్కువ శాతం మంది నోబ్రోకర్‌.కామ్‌ సర్వేలో వెల్లడించారు. దీంతో పాటూ నీటి లభ్యత, ప్రజారవాణా, పనిప్రదేశం, ఇంటి విస్తీర్ణం, సౌకర్యాలనూ చూస్తున్నట్లు తెలిపారు. బడ్జెట్‌ ప్రధానమనే విషయమై దేశవ్యాప్తంగా ఒకేరకమైన అభిప్రాయం వెల్లడవగా.. నగరాలను బట్టి ఇతర ప్రాధాన్యాల్లో స్వల్ప మార్పులు కన్పించాయి. తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నిర్మాణదారులు ప్రాజెక్టులు చేపడితే ఇరువురికి ప్రయోజనకరంగా ఉంటుందని కొనుగోలుదారు ఈ సందర్భంగా అభిప్రాయపడుతున్నారు.

ఈనాడు, హైదరాబాద్‌

మొదటిసారి కొనేవారే అధికం..

దేశంలో ఇప్పటికీ అత్యధిక శాతం మంది నివాసం ఉండేందుకే ఇల్లును కొనుగోలు చేస్తున్నారు. వీరి సంఖ్య 84 శాతం వరకు ఉంటోంది. పెట్టుబడి కోణంలో కొనుగోలు చేసేవారు 16 శాతంగా ఉన్నారు. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో నివాసం ఉండేందుకు మొదటి ఇల్లు కొనేవారి శాతం అధికం. రెండు, మూడోసారి ఇల్లు కొంటున్నవారిలో పుణెవాసులు ముందున్నారు.

వాణిజ్యంలోనూ కొనుగోళ్లు

* వాణిజ్య నిర్మాణాలపై ఇటీవల కాలంలో కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్‌లో 5 శాతం మంది మాత్రమే కమర్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌ వైపు చూస్తున్నారు.

* ఇల్లు కొనేటప్పుడు వాస్తుకు ప్రాధాన్యం ఇస్తున్న వారు 76 శాతంగా ఉంటున్నారు. వాస్తు పట్టింపులు లేవని చెప్పిన కొనుగోలుదారుల సంఖ్య 24 శాతంగా ఉంది.

ఇండిపెండెంట్‌గా ఉండేందుకు..

అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ కావాలా? ఇండిపెండెంట్‌ హౌస్‌ కావాలా? అంటే హైదరాబాద్‌వాసులు మాత్రం రెండోదానికే ఓటు వేస్తున్నారు. సొంత ఫ్లాట్‌ అయినా అద్దె ఇళ్లలో ఉన్నామనే భావన కలుగుతోందంటున్నారు. అందుకే ఫ్లాట్‌వైపు మొగ్గు 29 శాతం ఉంటే.. వ్యక్తిగత ఇల్లు కావాలనేవారు 59 శాతం మంది ఉన్నారు. మహారాష్ట్రలోని పుణెలో అత్యధికంగా 84 శాతం మంది, ఆ తర్వాత ముంబయిలో 77 శాతం మంది అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌  కావాలంటున్నారు. దేశ రాజధాని దిల్లీలో కూడా 57 శాతం మొగ్గు కన్పిస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం మొదటి ప్రాధాన్యం వ్యక్తిగత ఇల్లు అంటున్నారు. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలో రెండో ప్రాధాన్యంగా ఫ్లాట్‌ను కొనుగోలుపై దృష్టి సారిస్తున్నారు. స్థలాల వైపు చూస్తన్నవారి శాతం హైదరాబాద్‌లో 12 శాతంగా ఉంది.

కిరాయిదారులు ఏం చూస్తున్నారు?

* ఇళ్లలో అద్దెకుండేవారు సెమీ ఫర్నిష్డ్‌ ఉన్న వాటికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. హైదరాబాద్‌లో 69 శాతం మంది సెమీ ఫర్నిష్డ్‌ కావాలంటే... 20 శాతం మంది పూర్తి ఫర్నిష్డ్‌, 11 శాతం మంది ఫర్నిష్డ్‌ లేని ఫ్లాట్‌ కావాలనే అభిప్రాయం వెలిబుచ్చారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని