పదికి తగ్గేదేలే.. ఆపై యాభై వరకు..!

నిర్మాణ రంగంలో వేగంగా మార్పులు వస్తున్నాయి. భూముల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో పది అంతకంటే ఎక్కువ అంతస్తుల నిర్మాణాలు హైదరాబాద్‌లో వేగంగా పెరుగుతున్నాయి. కొత్త ప్రాజెక్టులన్నీ ఇరవై, ముప్ఫై, నలభై అంతస్తుల వరకు నిర్మిస్తున్నారు. ఈ తరహా నిర్మాణాల్లో దేశంలోనే ముంబయిది ఇప్పటికీ అగ్రస్థానం. దక్షిణాదిలో హైదరాబాద్‌ ముందంజలో ఎత్తుకు ఎదుగుతోంది. ఇటీవల వచ్చిన ఈ...

Published : 12 Feb 2022 03:11 IST

బహళ అంతస్తుల నివాస ప్రాజెక్టుల్లో నిర్మాణ సంస్థలు పోటీ
గతేడాది బెంగళూరును దాటిన హైదరాబాద్‌
పుణె, ముంబయితో పోలిస్తే తక్కువే

ఈనాడు, హైదరాబాద్‌  

నిర్మాణ రంగంలో వేగంగా మార్పులు వస్తున్నాయి. భూముల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో పది అంతకంటే ఎక్కువ అంతస్తుల నిర్మాణాలు హైదరాబాద్‌లో వేగంగా పెరుగుతున్నాయి. కొత్త ప్రాజెక్టులన్నీ ఇరవై, ముప్ఫై, నలభై అంతస్తుల వరకు నిర్మిస్తున్నారు. ఈ తరహా నిర్మాణాల్లో దేశంలోనే ముంబయిది ఇప్పటికీ అగ్రస్థానం. దక్షిణాదిలో హైదరాబాద్‌ ముందంజలో ఎత్తుకు ఎదుగుతోంది. ఇటీవల వచ్చిన ఈ మార్పులకు కారణమేంటి? నివాసాలకు ఆ మేరకు డిమాండ్‌ ఉందా? ఎక్కడెక్కడ ఈ ప్రాజెక్టులు వస్తున్నాయి?

త్తైన గృహ సముదాయాలు అనగానే ముందుగా గుర్తుకొచ్చేది హైదరాబాద్‌ పశ్చిమ ప్రాంతం. షేక్‌పేట నుంచి మొదలుపెడితే రాయదుర్గం, మణికొండ, నార్సింగి, ఖాజాగూడ, పుప్పాలగూడ, గండిపేట, కోకాపేట, గచ్చిబౌలి, కొండాపూర్‌, మాదాపూర్‌, కూకట్‌పల్లి వరకు ఎక్కడ చూసినా  ఆకాశహర్మ్యాలే కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో గతేడాది మరిన్ని కొత్త ప్రాజెక్టులు మొదలయ్యాయి. సహజంగానే ఇక్కడ కొలువుండే ఐటీ ఉద్యోగుల నుంచి డిమాండ్‌ ఉండటంతో ఎకరాల విస్తీర్ణంలో ఆకాశన్నంటేలా ఎత్తైన గృహ సముదాయాలు కడుతున్నారు. అనరాక్‌ అధ్యయనం ప్రకారం క్రితం సంవత్సరం హైదరాబాద్‌లో 57 ఆకాశహర్మ్యాల ప్రాజెక్టులు ప్రారంభం అయ్యాయి. దక్షిణాదిలో హైదరాబాదే మొదటి స్థానంలో ఉంది. మన దగ్గర బెంగళూరు 51 ప్రాజెక్టులతో రెండో స్థానంలో ఉంది. ముంబయిలో అత్యంత ఎక్కువగా 263 కొత్త ప్రాజెక్టులు పది అంతస్తులపైగా చేపడితే పుణెలో సైతం 170 వరకు కొత్తవి వచ్చాయి. ఈ నగరాల నుంచి ఆకాశహర్మ్యాల పోకడ హైదరాబాద్‌, బెంగళూరుకి విస్తరించిందని స్థిరాస్తి కన్సల్టెన్సీ నిపుణులు అంటున్నారు.  

నాలుగో వంతు...

హైదరాబాద్‌లో  ఏటా సగటున 1400 అపార్ట్‌మెంట్లు నిర్మాణం చేపడితే అందులో సగటున 200 వరకు ఐదు అంతస్తులపైన ఉండే బహళ అంతస్తుల నివాస సముదాయాలు ఉంటాయి. ఇందులో నాలుగో వంతు 10 అంతకంటే ఎక్కువ అంతస్తులు ప్రాజెక్టులు వస్తున్నాయి. 2019లో 236 ఐదు అంతస్తులపైన నివాసాల బహుళ నిర్మాణ ప్రాజెక్టులు వస్తే.. 2020లో కొవిడ్‌ లాక్‌డౌన్‌తో 115కి తగ్గింది. 2021లో మళ్లీ పుంజుకుంది. ఈ లెక్కలన్నీ జీహెచ్‌ఎంసీ పరిధిలోనివి. హెచ్‌ఎండీఏ పరిధి కలుపుకొంటే ఇంకా ఎక్కువే ఉంటాయి.

భూముల ధరలు పెరగడమే కారణం..

హైదరాబాద్‌లో కొవిడ్‌ తర్వాత భూముల ధరలు బాగా పెరిగాయి. ప్రభుత్వమే వీటిని వేలం వేయడంతో ఈ ప్రభావం ధరల పెరుగుదలకు కారణమైందని పరిశ్రమల వర్గాలు అంటున్నాయి. కోకాపేట వంటి ప్రాంతాల్లో ఎకరా ధర రూ.50 కోట్లకు చేరింది. మరోవైపు అపరిమిత ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్‌(ఎఫ్‌ఎస్‌ఐ)తో  ఎన్ని అంతస్తులైనా నిర్మించుకునే వెలుసుబాటు ఏర్పడింది. దీంతో ఎకరా రూ.పదికోట్లు ఉన్నచోట పది అంతస్తులు,  రూ.ఇరవై కోట్లు పలికే చోట 20 అంతస్తులు, రూ.30 కోట్లు ఉన్నచోట 30 అంతస్తులు వేసుకుంటూ వెళుతున్నారని రియల్‌ ఎస్టేట్‌ సంఘాలు అంటున్నాయి.   గరిష్ఠంగా 40 అంతస్తుల వరకు ఇక్కడ కడుతున్నారు. ఇప్పుడు పేరున్న ప్రతి సంస్థతో పాటూ కొత్తవీ పదికి తగ్గేదేలే అంటున్నాయి.

జీవనశైలికి అనుగుణంగా..

ముంబయి లాంటి ప్రాంతాల్లో స్థలాల లభ్యత తక్కువ కాబట్టి వర్టికల్‌గా వెళుతున్నారు. హైదరాబాద్‌కు ఆ సమస్య లేదు. అవుటర్‌ చుట్టుపక్కల కొన్నివేల ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. అయినా ఆకాశహర్మ్యాల నిర్మాణాలు పెరగడానికి కారణం సిటీలోనే ఉండాలని ఎక్కువ మంది కోరుకోవడమే అంటున్నారు నిర్మాణదారులు. అందుకే బంజారాహిల్స్‌, సోమాజిగూడ, పంజాగుట్ట, ఉప్పల్‌, బేగంపేట, సంతోష్‌నగర్‌, అత్తాపూర్‌, అప్పా, బాచుపల్లి, మియాపూర్‌, సికింద్రాబాద్‌, బొల్లారం ప్రాంతాల్లో భారీ భవంతులు వస్తున్నాయి. పాత వాటి స్థానంలో  ఎత్తైన భవంతులు నిర్మిస్తున్నారు. ఆయా ప్రాంతాలు ఇప్పటికే అభివృద్ధి చెంది ఉండటం, మెరుగైన రవాణా సదుపాయాలు,  దగ్గరలో విద్య, వైద్య సదుపాయాలు ఉండటం.. అన్నింటికీ మించి  సకల సౌకర్యాలతో గేటెడ్‌ కమ్యూనిటీగా తీర్చిదిద్దుతుండటంతో  కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఏటేటా ఈ తరహా ఎత్తైన గృహ సముదాయాలు పెరుగుతున్నాయి.దక్షిణాదిలో బెంగళూరులో ఇప్పటివరకు 50 అంతస్తుల ఎత్తైన భవనాలు ఉన్నాయి. దీన్ని మించి హైదరాబాద్‌లో 57 అంతస్తుల్లో ఒక ప్రాజెక్టును చేపట్టారు.  సిటీలో మొదట నిర్మాణం పూర్తైన వాటిలో 33 అంతస్తులే అత్యధికం. 2012లో లోధా గ్రూపు పూర్తిచేసింది. ఆ తర్వాత ఈ రికార్డు బ్రేక్‌ అవుతూ వస్తోంది.


అధిక సరఫరాపై ఆందోళన..

ఒకేచోట ముప్ఫై, నలభై అంతస్తుల భవనాలు ఎనిమిది నుంచి తొమ్మిది టవర్లు కడుతున్నారు. వెయ్యి నుంచి 4వేల ఫ్లాట్లు ఉంటున్నాయి. వీటిల్లోనే నలభై వేల యూనిట్లు  ఉంటాయని అంచనా. హైదరాబాద్‌ మార్కెట్‌ కొనుగోలు సామర్థ్యం అంత ఉందా అనేది స్థిరాస్తి సంఘాల ఆందోళన. ఇప్పటివరకు సరఫరా, డిమాండ్‌ ఆధారంగా ఇక్కడ నిర్మాణాలు చేపడుతూ వస్తున్నారు. ఎప్పుడు కూడా డిమాండ్‌ ఉండేలా అచిచూచి ప్రాజెక్టులు మొదలెట్టేవారు. ఇటీవల వరసగా స్థానిక, ఇతర నగరాలకు చెందిన సంస్థలు భారీ ప్రాజెక్టులతో వస్తుండడంతో వచ్చే మూడేళ్లలో సరఫరా ఎక్కువగా ఉంటుందని సంఘాల అంచనా. దీంతో కొనుగోలుదారులకు మాత్రం ఇంటి ఎంపికలో అవకాశాలు పెరిగాయి.


బిల్డర్‌కు ఛాయిస్‌ లేదు
- ఎ.సుమంత్‌రెడ్డి, ఎం.డి., ఇండియన్‌  ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌

భూమి ధరలు పెరగడంతో బిల్డర్లకు వేరే అవకాశం లేక ఆకాశహర్మ్యాలకు వెళుతున్నారు. హైదరాబాద్‌లో ఎఫ్‌ఎస్‌ఐ ఆంక్షలు లేకపోవడంతో ప్రాజెక్ట్‌ లాభసాటి చేయాలంటే అంతస్తులు పెంచక తప్పదు.  ఎకరం స్థలంలో ఇదివరకు లక్షన్నర చదరపు అడుగుల విస్తీర్ణంలో గృహ నిర్మాణాలు చేపట్టేవారు. ఇప్పుడు మూడు లక్షలు కడుతున్నారు. నాలుగు లక్షలు కట్టేవారు ఉన్నారు. కొల్లూరు, ముత్తంగి వంటి చోట్ల 35 అంతస్తుల నిర్మాణాలు వస్తున్నాయి. ఎకరం ధర నలభై, యాభై కోట్లు ఉన్న భూముల్లో కట్టాలంటే ఆకాశహర్మ్యాలకు మించి బిల్డర్‌కు ఛాయిస్‌ లేదు. ఇదొక కారణం అయితే.. పెద్ద బిల్డర్‌ అనిపించుకోవాలని కడుతున్నవారూ ఉన్నారు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని