నగరంలో ఇల్లు.. శివారు ప్రాంతాల్లో విల్లా

నగరంలో సొంతిల్లు ఉన్నా.. శివార్లలో విల్లాల కొనుగోలుకూ ప్రజలు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో కొందరు రెండో ఇల్లుగా విల్లాలు ఖరీదు చేస్తుంటే... మరికొందరు సిటీలో బహుళ అంతస్తుల్లోని ఫ్లాట్‌ విక్రయించి

Updated : 19 Feb 2022 04:03 IST

కొనుగోలుదారుల్లో మారుతున్న ప్రాధాన్యాలు

ఈనాడు, హైదరాబాద్‌

నగరంలో సొంతిల్లు ఉన్నా.. శివార్లలో విల్లాల కొనుగోలుకూ ప్రజలు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో కొందరు రెండో ఇల్లుగా విల్లాలు ఖరీదు చేస్తుంటే... మరికొందరు సిటీలో బహుళ అంతస్తుల్లోని ఫ్లాట్‌ విక్రయించి కొనుగోలు చేస్తున్నారు. నగర శివారే అయినా విల్లా ప్రాజెక్టుల్లో సౌకర్యాలకు లోటు లేకపోవడం, సొంత కార్లు ఉండటంతో దూరమైనా లెక్కచేయడం లేదు. వారాంతంలో అక్కడి ప్రశాంత వాతావరణంలో నివాసానికి ఇష్టపడుతున్నారు. కొందరు పూర్తిగా మకాం అక్కడికే మార్చేస్తున్నారు. దీంతో శివార్లలో విల్లాలకు ఎక్కడలేని డిమాండ్‌ వచ్చింది.

చూడటానికి ఆయా ఇళ్లన్నీ ఒకేలా అందంగా ఉండి, పరిసరాలన్నీ పచ్చదనంతో ఆహ్వానం పలుకుతుంటాయి. వాటిని చూడగానే ఇలాంటి చోట నివాసం ఉంటే ప్రశాంతంగా ఉండొచ్చు.. అనే భావన కల్గుతుంది. నేటితరం కోరుకునే విధంగా ఆధునిక జీవనశైలికి తగ్గట్టుగా నిర్మాణాలు ఉండడంతో విల్లాలపై మనసు పారేసుకుంటున్నారు. ఏ మాత్రం కొనే స్థోమత ఉన్న ఆలస్యం చేయకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

మైక్రో మార్కెట్లతో..

హైదరాబాద్‌ నగరం నుంచి శివార్లకు ఓఆర్‌ఆర్‌తో రవాణా అనుసంధానం పెరగడం కూడా విల్లాలకు క్రేజ్‌ తీసుకొచ్చింది. విల్లాలు కొనేవారిలో అత్యధికమందికి కార్లు ఉండటంతో వీరు ఎక్కడికైనా కొన్నిగంటల్లో చేరిపోతున్నారు. దీనికితోడు శివార్లలోని ప్రధాన ప్రాంతాల్లో మౌలికవసతులు పెరగడం కూడా అటువైపు వారు కదిలేలా చేస్తోంది. గతంలో మల్టీఫ్లెక్స్‌లు, షాపింగ్‌కు సిటీకి రావాల్సి ఉండగా, ప్రస్తుత ఎక్కడికక్కడ మైక్రో మార్కెట్లు ఏర్పడ్డాయి. స్థానికంగానే రెస్టారెంట్లు, ఆసుపత్రులు, మల్టీఫ్లెక్స్‌ల వరకు అందుబాటులోకి వచ్చాయి. ఓఆర్‌ఆర్‌ నుంచి ఆయా కేంద్రాలకు నిమిషాల వ్యవధిలోనే చేరుకునేంత దగ్గరగా ఉంటున్నాయి. ఇవన్నీ విల్లా ప్రాజెక్టులకు కలిసి వస్తున్నాయి. దీంతో ఓఆర్‌ఆర్‌ చేరువగానే ఎక్కువగా అవి నిర్మాణంలో ఉన్నాయి.

సౌకర్యాలకు పెద్దపీట..

ఆహ్లాదకర పరిసరాలు.. వ్యాయామానికి ప్రత్యేక ఏర్పాట్లు, సేదతీరేందుకు ఈతకొలనులు.. వివిధరకాల ఆటలకు ఇండోర్‌, అవుట్‌డోర్‌ సదుపాయాలు, సమీపంలో అత్యవసర వైద్యసేవలు.. విందులు, వేడుకలకు వేదికలు.. ఫుడ్‌కోర్టుల్లో అందుబాటులో ఉండే ఆహారం, అన్నింటికీ మించి పిల్లలు పెద్దలకు తోడు, రక్షణ.. ఇన్ని సౌకర్యాలు, ఆధునిక హంగుల కలబోతగా నిర్మిస్తున్న విల్లాల్లో నివాసానికి ఎక్కువమంది ఇష్టపడుతున్నారు. కాలంతో పాటూ వచ్చిన మార్పులకు అనుగుణంగా తమ జీవనశైలిని కొనసాగించేందుకు విల్లాలకు మారిపోతున్నారు.

అన్నివర్గాల బడ్జెట్‌కు తగ్గట్టుగా..

ఒక్కో విల్లాను 120 చదరపు గజాలు మొదలు 500 గజాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. అర ఎకరం నుంచి ఎకరం విస్తీర్ణంలో చేపడుతున్న ప్రాజెక్టులు సిటీలో ఉన్నాయి. అవుటర్‌ రింగ్‌రోడ్డు లోపల, బయట కేంద్రంగా ఎక్కువగా ఇవి అందుబాటులో ఉన్నాయి. జీ+1, జీ+2 అంతస్తుల్లో నిర్మిస్తున్నారు. ఎక్కువగా 4 పడక గదుల నిర్మాణాలు చేపడుతున్నారు. 3 పడక గదుల విల్లాలూ ఉన్నాయి. నిర్మించే విస్తీర్ణం, ప్రాంతాన్ని బట్టి ధరలు ఉన్నాయి. వీటిల్లో విలాసవంతమైన విల్లా ప్రాజెక్టులే కాదు బడ్జెట్‌ ధరల్లోనూ చేపడుతున్నవి ఉన్నాయి. దీంతో గతంతో పోలిస్తే ఎక్కువమంది కొనుగోలు చేయగల్గుతున్నారు. మధ్యతరగతివాసులు సైతం తమ పాత ఇళ్లను, స్థలాలను విక్రయించి వాటిని కొనుగోలు చేస్తున్నారు.

భిన్న అవసరాలు...  ః నగరంలోని అపార్ట్‌మెంట్లు భార్యాపిల్లలతో కలిసి నివసించడానికి సరిపోతాయని, తల్లిదండ్రులతో ఉండేందుకు అనుకూలం కావని చాలామంది భావిస్తుంటారు. ఇలాంటి కుటుంబాలు విల్లాల్లో ఉండేందుకు ప్రస్తుతం మొగ్గుచూపుతున్నాయి.

* నగరంలో ఉరుకులు పరుగుల జీవితంలో ఎవరికి వారే బతకాల్సి వస్తోంది. విల్లాల్లో ఇరుగుపొరుగుతో సంబంధాలు ఉండటం వంటివి ఒంటరితనం నుంచి దూరం చేస్తున్నాయి. ఎవరివారు విడివిడిగా ఉంటూనే కలివిడిగా మెలిగే అవకాశం ఇక్కడ ఉంటుంది. ముఖ్యంగా పెద్దవాళ్లకు చక్కని కాలక్షేపం లభిస్తుంది. వారాంతాల్లో కుటుంబంతో గడిపేందుకు, అభిరుచులను కొనసాగించేందుకూ వీటిని కొనుగోలు చేస్తున్నారు. భవిష్యత్తు దృష్ట్యా పెట్టుబడిపరంగా మరికొందరు కొనాలని భావిస్తున్నారు.

* ముఖ్యంగా ఎన్నారైలు శివార్లలోని విల్లాలపై ఆసక్తికనబరుస్తున్నారు. విదేశాల్లో ఇది వారికి అలవాటైన జీవితమే. హైదరాబాద్‌ తిరిగొచ్చాక వీరు విల్లాల్లోనూ ఉండేందుకు ఇష్టపడుతున్నారు.

విభిన్న సదుపాయాలు

విల్లా నిర్మాణంలోనూ ఎప్పటికప్పుడు నిర్మాణ సంస్థలు కొత పోకడలను పరిచయం చేస్తున్నాయి. వాటిల్లో ప్రధానమైనవి.

* ఇంట్లో పెద్దవాళ్లకు తోడుగా సేవకులు ఉంటున్నారు. వారి కోసం ప్రత్యేకంగా గదులు నిర్మిస్తున్నాయి.

* ఇళ్లపైన సోలార్‌ వాటర్‌హీటర్‌తోనే పరిమితం చేయకుండా సౌరవిద్యుత్తు ఉత్పాదన చేస్తూ స్వీయ అవసరాలకు వినియోగిస్తున్నారు. గ్రిడ్‌కు అనుసంధానం చేయడం ద్వారా మిగిలిన కరెంటును డిస్కంకు విక్రయించేలా చూస్తున్నారు.

* నెట్‌జీరో కాన్సెప్ట్‌తో నిర్మాణాలు చేపడుతున్నారు. నీటి సంరక్షణ, మురుగునీటి శుద్ధి, సౌర విద్యుత్తు వినియోగం వరకు సుస్థిరాభివృద్ధి చర్యలను చేపడుతున్నారు. కొందరు అక్కడే వ్యవసాయం చేస్తున్నారు.

* నివాస ప్రదేశాల్లో వైద్యం కూడా ముఖ్యమైందే. పెద్దలు, పిల్లలను ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని విల్లాల్లో ప్రత్యేకంగా అత్యవసర వైద్యసేవలూ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టెలీవైద్య సేవలనూ కల్పించడంపైనా దృష్టి సారించాయి.

* విల్లా ప్రాజెక్ట్‌లో శబ్దకాలుష్యం తావు లేకుండా వాహనాల హరన్లు నిషేధించడంతో పాటూ కొన్నిచోట్ల బ్యాటరీ కార్లను ఉపయోగించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని